
నిర్వికల్ప సంగీతం పుస్తకానికి మా అక్క ముందుమాట రాసింది. నిన్న షేర్ చేసిన పిడిఎఫ్ లో ఎందుచాతనో ఆ ముందుమాట మిస్సయ్యింది. అందుకని అది ఇక్కడ పొందుపరుస్తున్నాను.
నిజానికి ఇవాళ ఈ పూలతోటకి నేను మార్గనిర్దేశకురాల్ని కానక్కరలేదు. కాని ఒక ఉత్సాహం- నా ఆనందానుభూతి అందరికీ పంచాలన్నా ఉత్సుకత-ఇలా రాయిస్తోంది.
ఈ తోటలో పూలు ఎంత చిరపరిచితాలో, అంత నిత్యనూతనాలు. ఎందుకంటే ఇవి ఆహ్లాదాన్నీ, మాదకతనీ, హాయినీ ఇచ్చే సౌరభం చిమ్ముతాయి. విభిన్న వర్ణ సమ్మిళితంగానూ ఉంటాయి, అలా ఉంటూనే తమ సువాసనలతో మనపైన ఎన్నో ఎసోసియేషన్స్ ని ట్యూన్ చేస్తాయి. ఇదే వీటి నిత్యనూతనత్వం.
ఇవి పాడే నిర్వికల్ప సంగీతం మధురంగా ఉండి, మైమరపు కలిగిస్తూనే గొప్ప విషాదపు లోకాల్ని-మనకి తెలీకుండా మనలో ఉన్నవాటిని-తాకుతోంది.
అయితే హిందుస్తానీ సంగీతాన్ని ఆలపించే ఏ మధురగాయనో కూడా ఆ మన విషాదలోకాల్లోకి వినిపించేలా నినదించవచ్చు. కాని ఈ కవిత్వంలో ఈ విషాదం తాలూకు ఎరుక చాలా స్పష్టం. అందుకే ఇది నిర్వికల్పసంగీతమేమో? మరి!
2
జీవితం యొక్క అసలు తత్త్వం, ప్రేమ, వియోగం, మృత్యువు, దుఃఖం, వీటినన్నిటికీ దాటి వీటన్నిటిలోంచీ వెళ్తూ కూడా తనలోకి తనని చూపుకోగల ఒక విచికిత్స ఇందులోని అన్ని కవితల్లోనూ నిండా నిండి జాలువారుతోంది.
కవి తనకు తగిలిన అనేక రకాల గాయాలలోంచి మథనపడి పాడుకునే పాటలు చదువుకునే ప్రతి వ్యక్తికీ తమవేనేమో అనిపింపచేసే స్థితికంటే గొప్ప కవిత్వం ఏముంది?
ఈ కవితలు చదువుతూంటే నా అనుభూతులకు భాషనిచ్చినట్టుందని ఇక్కడ నేను వ్రాయకుండా ఉండటం ఎలా?
పూలసువాసన లోంచి తాకే ఎసొసియేషన్ కి ట్యూన్ కావడానికే కొంత అనుభూతి కావాలి,అలాంటిది జీవితంలో కలిగిన అనేక సుఖదుఃఖానుభవాల స్మృతులు ఒక్కమాటతో, ఒక్క వర్ణనతో వచ్చి హృదయపు ముంగిట వాలేలా చేసే కవిత్వానికి ట్యూన్ కావాలంటే ఎంత అనుభూతి గాఢత కావాలి?
3
శక్తి తర్వాత, ‘నిపుణతా లోకశాస్త్ర కావ్యాద్యవేక్షణాత్’ అంటాడు శాస్త్రకారుడు. కవితాశక్తిమంతుడయ్యాక కూడా బాగా చదువుకున్నవాడు (లోకాన్ని కూడా) అయితేనే గొప్ప కవి అని.
అనేక భాషా సాహిత్యాలకు చెందిన తాత్త్వికులు, కవులు, సైద్ధాంతికులు చూపించిన అనేక కోణాల్లోంచి జీవితాన్ని పరిశీలిస్తూనే అనుభూతి చెందుతూ దాన్ని కవిత్వంగా పలికించే తపన వీటిల్లో కన్పిస్తుంది.
ఇంత మథనం, ఇన్ని సందేహాలు, ఆవేదనలు, ఆశలు నింపిన ఈ కవితలు-ఈ నలగని, వాడని చిన్నిపూలు-వీటిని ఇలా చూపించాలన్నదే ఈ ప్రయత్నం.
వీటి సువాసన మాత్రం ఎవరికి వారుగా తెలుసుకోవాల్సిందే.
వాడ్రేవు వీరలక్ష్మీదేవి
శేఫాలిక, కాకినాడ, 23-3-86


చాల చక్కగా చెప్పారు. అభినందనలు
ధన్యవాదాలు