
ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా గిరిజనులు సంఖ్యలోగాని, చరిత్రలో వారు పోషించిన పాత్ర దృష్ట్యాగాని, వారికున్న అత్యంత విలువైన సంస్కృతి వల్లగానీ ఎంతో ప్రముఖ స్థానంలో ఉన్నారు. కాబట్టే వెయ్యేళ్ళ తెలుగు కావ్యసాహిత్యంలో ప్రసిద్ధకవుల కావ్యాల్లో ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో గిరిజనుల ప్రస్తావనా, ప్రసక్తీ ఉంటూనే ఉన్నాయి. పన్నెండవ శతాబ్దంలోనే పాలుకురికి సోమన వంటి మహాకవి తన పండితారాధ్య చరిత్రలో శ్రీశైలాన్ని వర్ణిస్తూ అక్కడి ‘చెంచు సద్భక్తుల్ని’ తలచుకోకుండా ఉండలేకపోయాడు.
కాని ఆ స్ఫూర్తి పందొమ్మిదో శతాబ్దం నుంచీ తక్కువవడమే కాకుండా, ఇరవయ్యవ శతాబ్దపు తొలిరోజుల్లో దాదాపుగా కనుమరుగైందని చెప్పాలి. ఆధునిక తెలుగుసాహిత్యానికి యుగకర్తగా మనం చెప్పుకుంటున్న గురజాడ అప్పారావు, కావటానికి విజయనగరం సంస్థాన ఉద్యోగినే అయినప్పటికీ, గిడుగు రామ్మూర్తి ఆయనకు చిరకాలమిత్రుడైనప్పటికీ, తన సాహిత్యంలో గిరిజనుల్ని దాదాపుగా విస్మరించాడు. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికుడుగా మన నీరాజనాలందుకుంటున్న కందుకూరి వీరేశలింగం వంటి సామాజిక సంస్కర్త జీవితమంతా రాజమండ్రిలోనే గడిపినప్పటికీ, అక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలోనే దండకారణ్యం ఉన్నప్పటికీ, గిరిజనుల స్థితిగతుల గురించి ఏమీ రాయలేదన్నది ఒక యథార్థం. పైగా తన అధిక్షేప రచనల్ని ప్రకటించడానికి వెలువరించిన పత్రికకి ‘కోదు హాస్య సంజీవిని’ అని పేరుపెట్టాడు!
ఇక ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యంలో ధ్రువతారలుగా చెప్పదగ్గ కృష్ణశాస్త్రి, చలం, విశ్వనాథ సత్యనారాయణ, పద్మరాజు, గోపీచంద్, బుచ్చిబాబు వంటి వారికి ఆదివాసుల గురించిగాని, వారి సమస్యల గురించి గాని కనీస పరిజ్ఞానం కూడా లేదని వారి సాహిత్యం ఏ మాత్రం చదివినవారికేనా సులభంగా తెలుస్తుంది. ఇది కేవలం 1950 కి పూర్వపు రచయితల పరిమితి మాత్రమే కాదు. ఆ తర్వాత కాలంలో ప్రజాపక్ష రచయితలుగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, కాళీపట్నం రామారావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి వంటి వారి సాహిత్యంలో కూడా మనకు ఆదివాసి కనిపించడు.
అయితే, ఇరవయ్యవ శతాబ్దపు మొదటితరంలోని రచయితలు కొందరు లేకపోలేదు. చింతాదీక్షితులు, దువ్వూరి రామిరెడ్డి లాంటివాళ్ళు. సమాజం దృష్టికి ఆనని చెంచు, సుగాలి, యానాది జీవితాల్ని ఎంతో దగ్గరగా చూసి వారికోసం తమ పూర్తి హృదయంతో స్పందించిన రచయితలు వాళ్ళు. కాని వారి వారసత్వాన్ని అందుకోడానికి తెలుగు సాహిత్యం 1970 దాకా ఆగవలసి వచ్చింది.
1971 లో భూషణం వెలువరించిన ‘కొండగాలి’ కథలు మొదటిసారిగా గిరిజన ప్రాంతాల గుండెచప్పుణ్ణీ, పురిటి నొప్పుల్నీ పట్టుకున్నాయి. ఆ తర్వాత ఒక మహాకథక పరంపర, కవిగాయక పరంపర గిరిజన సమస్యల్ని ప్రపంచమంతా వినేలాగా ఘోషించడం మొదలుపెట్టింది. అయితే, కళింగాంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లో గిరిజనుల సమస్యల్ని చిత్రించడం మొదలుపెట్టిన కథకులూ, కవులూ కూడా ప్రధానంగా విప్లవోద్యమాల నేపథ్యం నుంచి వచ్చినవారూ, ప్రజాపోరాటాన్ని కొనసాగించాలనే ఏకైక లక్ష్యానికి కట్టుబడ్డవారూ కావడంతో వారి సాహిత్యం గిరిజన ప్రాంతాల్లోని సంఘర్షణని చిత్రించడం మీద దృష్టి పెట్టినంతగా ఆదివాసి జీవితంలోని సౌందర్యాన్నీ, సంతోషాన్నీ పట్టుకోవడం మీద మనసు లగ్నం చెయ్యలేకపోయింది. బహుశా ఒకటీ అరా కథలు ఉండవచ్చు. కానీ ఆ కథకుల లక్ష్యం అసమానతల్నీ, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల్నీ ప్రశ్నించడమే ప్రధానంగా ఉంటూ వచ్చింది.
ఈ శతాబ్దం మొదలయిన తరువాత సంభవించిన గొప్ప పరిణామం గిరిజన ప్రాంతాల గురించి గిరిజన కథకులూ,కవులే స్వయంగా రాయడానికి ముందుకు రావడం. మల్లిపురం జగదీశ్, పలమనేరు బాలాజీ, రమేష్ కార్తిక్ నాయక్, పద్దం అనసూయ, భూక్యా తిరుపతి, తిమ్మక రాం ప్రసాద్, సూర్యా ధనుంజయ్, ఆదిలాబాదు జిల్లాలో కొలాం తెగకు చెందిన ఆత్రం మోతీరామ్ వంటి రచయితలు గిరిజనుల జీవితాల్ని స్వానుభవంతో చిత్రించడంతో తెలుగు సాహిత్యంలో గిరిజనసాహిత్య యుగం మొదలయ్యిందని చెప్పవచ్చు.
అయినప్పటికీ, ఇంకా ఒక వెలితి మిగిలే ఉంది. గిరిజనుల గురించి గిరిజనులే రాసుకోవడంలో స్వానుభవం ఉంటుందన్నది కాదనలేని సత్యమే అయినప్పటికీ అక్కడితో తృప్తి చెందితే ఆదివాసుల గురించి మరింత తెలుసుకోవలసిన బాధ్యత నుంచి తక్కిన సమాజం తప్పించుకున్నట్టే అవుతుంది. మానవ జీవితానుభవాల్ని, సుఖదుఃఖానుభూతినీ సాహిత్యంగా మార్చడంలో స్వానుభవం ఎంత ముఖ్యమో సహానుభవం కూడా అంతే ముఖ్యం. గిరిజన ప్రాంతాల గురించి గిరిజన రచయితలు రాయడం ఎంత హర్షణీయమో, గిరిజనేతర రచయితలు రాయాలనుకోవడం కూడా అంతే స్వాగతించదగ్గ అంశం. గిరిజనేతర రచయితలు గిరిజనుల గురించి రాయడంలో కొంత సాధికారికత లోపించవచ్చుగాక, ఎన్నో విశేషాలూ, ఎన్నో పార్శ్వాలూ వారికి అందకపోవచ్చుగాక, కానీ, అక్కడ మనం చూడవలసింది, వారి హృదయాన్ని. గిరిజనుల పట్ల వారి మనసులో అంకురించిన ఆసక్తిని. వారి ప్రేమైకశీలత్వాన్ని.
అందుకనే, ఇదుగో, యల్లాప్రగడ సంధ్య గారు రాసిన ఈ ‘మోదుగపూలు’ నవల చూడగానే నాకెంతో సంతోషం కలిగింది. ఆమె నివసిస్తున్నది అట్లాంటాలో. ప్రవృత్తి రీత్యా ఆమె ఆధ్యాత్మిక సాధకురాలు. అటువంటి రచయిత్రి దృష్టి అదిలాబాదుమీదా, గోండులమీదా ప్రసరిస్తుందని ఎలా అనుకోగలను! కాని ఈ రచన మొదలుపెట్టి పూర్తి చేసేదాకా ప్రతి పేజీ నేనెంతో ఉత్కంఠతో మాత్రమే కాదు, ఎంతో సంభ్రమంతో కూడా చదివేను.
ముప్ఫై ఏళ్ళ కిందట పూర్వపు అదిలాబాదు జిల్లాలో నేను గిరిజన సంక్షేమాధికారిగా పనిచేసిన జ్ఞాపకాల నేపథ్యంలో చదివాను. ఆ అల్లంపల్లి, ఆ ఉట్నూరు, ఆ మార్లవాయి, ఆ గిన్నెధరి, ఆ మామిడిపల్లి, ఆ యింద్రవెల్లి, ఆ కేస్లాపూరు, ఆ జోడేఘాట, ఆ కెరమెరి, ఆ అసిఫాబాదు నా మనసుమీద వదిలిపెట్టిన ముద్రల వెలుగులో చదివాను. ఎన్నో ఏళ్ళు ఆ అడవుల్లో నివసించినవాళ్ళకో లేదా నాకులాగా కనీసం కొంతకాలమేనా ఆ అడవుల్లో తిరిగినవాళ్ళకో మాత్రమే పట్టుబడే ఆ అడవిగాలి, ఆ పూల తావి సంధ్యగారి రచనలోంచి గుప్పున నా ముఖం మీద వీచాయి. నేను ఆశ్చర్యపోయాను. తోటిమానవుడి గురించి చెప్పడానికీ, రాయడానికీ ముందు కావలసింది సమాచారం కాదు, అతడి గురించి బెంగపెట్టుకోగల హృదయం అని తెలిసొచ్చింది నాకు.
1909 లో యూరోప్ యాత్రకి బయలేదురుతూ టాగోర్ రాసుకున్న ఒక వ్యాసంలో ఒక మాట రాసాడు:To see man as truth, this is the true vision of the soul and can only happen out of love అని. మనిషిని సత్యంగా సాక్షాత్కరించుకోవడమే అన్నిటికన్నా అసలైన యోగసాధన. సంధ్యగారు ఇంతకు ముందు తన గురువు ఎవరో తెలుసుకోడానికి చేసిన తన ప్రయాణాన్ని పుస్తకంగా రాసారు. ఇది కూడా ఆ అన్వేషణకు సమానమైన అన్వేషణనే. ఎందుకంటే టాగోర్ చెప్పినట్టు మనిషి జీవితంలోని సత్యాన్ని వెతుక్కుంటూ చేసే ప్రయాణమే నిజమైన యోగసాధన. అది ప్రేమ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.
నర్మదా నదిచుట్టూ ఆమె చేసిన పరిక్రమ అనుభవాల్ని మనతో పంచుకుంటూ కూడా ఆమె గతంలో ఒక పుస్తకం రాసారు. అది ఒక నది చుట్టూ ప్రదక్షిణమైతే, ఇది ఒక అడవి చుట్టూ, అడవి బిడ్డల చుట్టూ చేపట్టిన పరిక్రమ.
సంధ్య గారు ఈ పుస్తకం రాయకపోయి ఉంటే ఆమెని ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే ఇటువంటి ఒక బాధ్యత ఆమె భుజాల మీద ఉందని ఆమెని దగ్గరగా చూసిన నేనే అనుకోలేదు. కాని ఆమె తాను ఆ ప్రాంతాలు తిరిగి, ఆ ఆదివాసుల్ని దగ్గరగా చూసి, వారి గురించి ఎక్కడ ఏ సమాచారం దొరికినా చదివి ఈ పుస్తకం రాసారు. అన్వేషణ అంటే ఇది. మహాసముద్రాల మధ్యన ఎక్కడో ద్వీపాల్లో తక్కిన ప్రపంచానికి దూరంగా ఉన్న ఆదివాసుల గురించి ఇలా వెతుక్కుంటూ తెలుసుకుంటూ ఒక మాలినోవిస్కి వంటి వాడు, ఒక మార్గరెట్ మీడ్ వంటి వారు ప్రయాణాలు చేసినందువల్లా, పుస్తకాలు రాసినందువల్లా మాత్రమే పాశ్చాత్య ప్రపంచం తన జాతిస్వాతిశయం నుంచి బయటపడగలిగింది.
ఈ పుస్తకానికి నా స్వాగతం. తెలుగు సాహిత్యంలో గిరిజన రచయితలు మాత్రమే కాదు, ఇటువంటి గిరిజన ప్రేమికులు కూడా అత్యధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను. అటువంటి జిజ్ఞాసువులకి ఈ రచన ఒక స్ఫూర్తి కాగలదని నమ్ముతున్నాను.
30-7-2024


మంచి పుస్తకం పరిచయం చేశారు సర్. మీ విశ్లేషణ బాగుంది.
ధన్యవాదాలు మేడం!
గిరిజన సమాజికాన్ని తెలుగు ప్రతిభావంతులైన సాహితీ వేత్తలు ముట్టుకోక పోవడం నాక్కూడా ఆశ్చర్యం కలిగించింది సర్.
సామాజిక సాహిత్యంలో స్వీయానుభవం ఎంత ముఖ్యమో సహానుభూతి కూడా అంతే ముఖ్యమన్న మీ అభిప్రాయం గొప్పది. సంధ్య ఎల్లాప్రగడ గారు వైష్ణవం పై రాసిన ఓ book నేను కొన్నాను. ఆమె గిరిజనులపై వ్రాయడం మధురం.
ధన్యవాదాలు సార్
“””తోటిమానవుడి గురించి చెప్పడానికీ, రాయడానికీ ముందు కావలసింది సమాచారం కాదు, అతడి గురించి బెంగపెట్టుకోగల హృదయం –“
ధన్యవాదాలు సార్
వాస్తవం సర్. అడవులజిల్లాలో నలభయ్యేళ్లు పని చేసినా వారి సంస్కృతి గురించి గానీ, వారి జీవన విధానాలను గానీ పరిశీలించలేని నా అజ్ఞతాజ్ఞాతవాసం నా ముందు నిలబడి ప్రశ్నిస్తున్నట్లనిపించింది. నా ద్వితీయనిరుద్యోగ పర్వంలో 34 ఏళ్లు దాటటంతో నాకు ఐటిడిఏ స్కూళ్లలో పనిచేసే అవకాశం కలుగలేదు. 1989 లో బి.ఎడ్ కాగానే నా సహాధ్యాయులలో కొందరు అందులో చేరారు. ఫణికుమార్ గారి గోదావరి గాథల్లో , ఆ తరువాత మీ అనేక రచనల్లో
గిరిజనుల గురించి తెలిసినా వారితో మమేకమయ్యే
సందర్భం రాలేదు. కొంతలో కొంత మిత్రుడు నాగబాల సురేశ్ కుమార్ తీసిన టెలీ ఫిలిం కొమురం భీం లో నటించినప్పుడు , కొన్ని ఆదివాసుల అగచాట్లను కళాపరంగా చూడగలిగాను. మీరు కారణజన్ములు. గిరిజన సంక్షేమాభిలాష మీ హృదయంలో ఎంతగా పాదుకొని ఉందో మీ వ్యాసాలు తెలుపుతాయి. మోదుగపూలు రచయిత్రి సంధ్య గారికి అభినందనలు.
మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సార్!