కవిత్వం కావాలి కవిత్వం

వారం రోజుల కిందట అనిల్ బత్తుల నుంచి ఫోన్.

‘ఎక్కడున్నారు? మీ కాలనీలోనే వున్నాను. ‘కవిత్వం కావాలి కవిత్వం’ మీ చేతుల్లో పెట్టాలి అర్జంటుగా’.

‘కర్నూల్లో ఉన్నాను, రాత్రవుతుంది హైదరాబాదు వచ్చేప్పటికి, ఆ పుస్తకం మా అపార్ట్ మెంట్లో వాచ్ మేన్ కి ఇచ్చేగలరా!’ అన్నాను, ‘ఒక్క పుస్తకం పేరే చెప్తాడేమిటి? అయిదు పుస్తకాలు కదా’ అని అనుకుంటూనే.

‘మిగిలిన నాలుగు పుస్తకాలూ కూడా మీకు చేర్చాలి, రెండుమూడు రోజుల్లో పంపిస్తాను’ అన్నాడు నా మనసులో మాట చదువుతున్నట్టుగా. మళ్ళా వెంటనే ‘లేదు, ఇవాళే ఎలాగోలా మీకు చేరుస్తాను’ అన్నాడు.

‘పోర్టర్లో పంపించండి, సాయంకాలానికల్లా వచ్చేస్తాయి’ అన్నాను.

మళ్ళా సాయంకాలం ఫోన్ చేసాడు. ‘సార్, ఆ అయిదు పుస్తకాలూ కమల్ కి పంపిస్తాను. కమల్ మీకు రాత్రికల్లా ఇంట్లో అందచేస్తాడు’ అని అన్నాడు. ఈ కమల్ ఎవరు అనుకుంటూ ఉండగానే ‘మీ కాలనీలోనే ఉంటాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్. మీకు అతని నంబరు పంపించాను చూడండి. మీరు రాత్రి రాగానే మొహమాట పడకుండా ఫోన్ చేయండి, తనే మీ ఇంటికొచ్చి పుస్తకాలు అందచేస్తాడు’ అని కూడా అన్నాడు.

అప్పుడు గుర్తొచ్చింది, నాలుగు పుస్తకాలు కదా, అయిదు అంటాడేమిటి? అని. ‘కవిత్వం కావాలి కవిత్వం మరో కాపీ కూడా ఇస్తున్నాను. ఆ అయిదు పుస్తకాలూ ఒక సెట్టు. వాటిని విడదీయాలనిపించలేదు’ అని మళ్ళా తనే అన్నాడు ‘అయితే ఒక రిక్వెస్టు. ఎల్ల లోకము ఒక్క ఇల్లై పుస్తకం ఒక కాపీ కమల్ కి ఇవ్వగలరా?’ అని అడిగాడు మొహమాటపడుతూనే నిర్మొహమాటంగా.

రాత్రి చాలా పొద్దు పోయింది కర్నూలు నుంచి వచ్చేటప్పటికి. తెల్లవారుతూనే కమల్ నుంచి ఫోన్. ‘అయిదో ఫ్లోరుకి వచ్చేయండి నేరుగా’ అన్నాను. అతని కోసం ‘ఎల్లలోకం ఒక్క ఇల్లై’ తీసి పేరు రాసి బల్లమీద పెట్టుకున్నాను. మరునిమిషంలో కమల్ మా ఫ్లాట్ ఎదట ఉన్నాడు. అతడి చేతిలో ఒక పాకెట్. ‘ఆకాశం నీలంగా ఉంది’ లాంటి కోడ్ మాటలేవీ చెప్పుకోకుండానే ఒకరిచేతుల్లో నిధినిక్షేపాలు మరొకరి చేతుల్లోకి మారిపోయాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కమల్ వెంటనే వెళ్ళిపోయాడు.

ఇన్నేళ్ళ నా జీవితంలో ఏ అపాయింట్ మెంటు ఆర్డరుగాని లేదా ఏ ప్రేమలేఖగాని అలా ఒక సుడిగాలిలాగా నా వెంటబడింది లేదు. కాని కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు వయసు పక్వమయ్యే కొద్దీ ఇలానే ఉంటుందనుకుంటాను, ఒక్క ప్రేమలేఖ కాదు, ప్రేమలేఖల కట్టలు ఏకంగా అయిదు ఒక వార్తాహరుణ్ణి ఎన్నుకుని మరీ నీ ఇంట్లో అడుగుపెడతాయి.

ముందు ఆ కట్ట విప్పి ఆ అయిదు పుస్తకాలూ ఆప్యాయంగా తడిమి చూసుకున్నాను. వాటిల్లో అయిదు సముద్రాలున్నాయని తెలుసు నాకు. శంఖంలో దాగి ఉన్న సముద్రఘోష వినబడాలంటే కనీసం చెవి దగ్గర పెట్టుకుని వినాలి. కాని ఈ సముద్రకెరటాలు చూస్తూండగానే ఎగిసిపడుతున్నాయి.

ఒకప్పుడు హిందీలో ఉత్తరాది భక్తికవులు కవిత్వానికి వాడిన భాషని సాధుక్కడీ అన్నారు. అందులో కొంత బ్రజభాష, కొంత అవధి, కొంత భోజ్ పురి,  కొంత హిందుస్తానీ, కొంత హర్యాని, కొంత పంజాబీ  ఇలా ఎన్నో పలుకుబళ్ళు కలగలసి ఉంటాయని. సాధువులందరి అనుభవమూ ఒక్కలాంటిదేగనుక, వాళ్ళ అనుభూతి వ్యక్తీకరణ కూడా ఒక్కలాగే ఉంటుంది కాబట్టి, నేననుకుంటాను సాధుక్కడీ అంటే సాధువులు మాత్రమే పలకగలిగే భాష, సాధువులు మాత్రమే పోల్చుకునే భాష అని. అందుకనే సాధుక్కడిలో చేరకపోయినా తిరుక్కురళ్ లోనూ, రామకృష్ణ పరమహంస బెంగాలీలోనూ, సాయిబాబా మరాఠీలోనూ కూడా కబీర్ మాటలు వినబడతాయి మనకి.

మన కాలంలో కూడా మనకొక సాధుక్కడీ ఉంది. అందులో కొంత జెన్, కొంత సూఫీ, కొంత గోదా, కొంత మీరా, కొంత టాగోర్, కొంత జిబ్రాన్, ఎమర్సన్, డికిన్ సన్, అప్పుడప్పుడు బ్లేక్, అక్కడక్కడ హాలుడు, అంతర్లీనంగా చలం. ఎన్ని దేశాల కవిత్వం చదివినా ప్రాయికంగా నేనిష్టపడేది ఈ భాషని. ఈ భాష మాట్లాడే కవులెక్కడున్నా ఎంతదూరమైనా నేను నడుచుకుంటూ కూడా వాళ్ళ దగ్గరికి పోగలను. ఎందుకనిపించిందో తెలీదుగాని, 87-88 ప్రాంతంలోనే పోల్చుకోగలిగాను, నా సమకాలికుల్లో నాసరరెడ్డి ఈ నవ్యసాధుక్కడీలో పండితుడని.

ఇప్పుడు ఆయన నుంచి నాకు అందిన ఈ అయిదు సంపుటాలూ ఆ అభిజ్ఞని బలపరిచేయని మళ్ళా చెప్పనక్కర్లేదు కదా.

మొదట, ‘కవిత్వం కావాలి కవిత్వం ‘.

ఈ మాట త్రిపురనేని శ్రీనివాస్ అన్నాడట. పుస్తకం మీద అతడితో పాటు కవి కూడా. ఆ ఫొటో తీసిందేమో స్మైల్ గారట. పుస్తకం తెరవగానే ముందు భారతీయ కవిత్వం, 27 గురు కవులు, ఒక జానపద గీతం ఆ తర్వాత విదేశీయ కవిత్వం, మరొక 27 గురు కవులు, మరో రెండు జానపదగీతాలు. ఆ కవుల్లో కొందరు నాకు తెలియదు, మరీ ముఖ్యం భారతీయ కవులు. ఆశ్చర్యం లేదు, నాసరరెడ్డి నాకన్నా ఏడాకులు ఎక్కువచదివినవాడేనని తెలుసు నాకు. కానీ అసూయ లేదు, పైగా సంతోషమే, ఎందుకంటే, ఈ కవితల్లో ఎనిమిది కవితలు నేనూ అనువాదం చేసాను, నాసరరెడ్డి చేస్తున్నాడని తెలియకుండానే.

‘ఇటువంటి అనువాదాలు ఎందుకు రావాలంటే’- అని పెద్ద ప్రసంగం చేయాలని ఉంది. కానీ ఒక్క మాట చెప్తాను. ఏ కవితైనా పది పదిహేను పంక్తుల్ని మించి పెరిగిందంటే అది ప్రసంగంగా మారిపోతుంది. ప్రసంగానికీ, కవిత్వానికీ మధ్య తేడా తెలియాలంటే ఇటువంటి కవితలు చదవాలి, ఇటువంటి అనువాదాలు రావాలి. చూడండి, రెండు ఉదాహరణలు సరిపోతాయనుకుంటాను:

కైలాస్ వాజ్ పేయి

మోమిన్

ప్రార్థనాలయాలు పూర్వం కూడా వుండేవి
వధ్యస్థలాలు కూడా
పూర్వం ఉండేవి.
మనం సాధించిన ప్రగతి ఇది:
రెండింటినీ ఒకటి చేశాం.

ఏమీ లోవెల్

కళాకారుడు

సాధువు కిసెన్
వెయ్యి కవితలు రాశాడు
తొమ్మిది వందల తొంభై కవితల్ని నదిలో పడేశాడు
ఒక్కటి మాత్రమే ఉంచదగిందని గ్రహించి.

రెండో పుస్తకం జపనీయ తంక.

తంక జపనీయ ఛందస్సు. అయిదు పాదాలు. అయిదు, ఏడు, అయిదు, ఏడు, ఏడు మాత్రలు. స్పందించే హృదయాన్ని మాటలుగా విప్పిపరుచుకోడానికి అయిదు పంక్తులు చాలు. (తర్వాతి జపనీయ కవులకి ఆ అయిదు పంక్తులు కూడా అతివ్యాప్తి అనిపించి అందులో మొదటి మూడు పంక్తుల దగ్గరే ఆగిపోయి హైకూని సృష్టించుకున్నారు). కానీ హైకూ కన్నా తంకది మరింత సాంద్రహృదయవీథి. అందులోనూ జపనీయ తొలి సంకలనాలైన ‘మన్యోషూ’, ‘కొకిన్ వకాషు’ లు చదవడం మొదలుపెట్టినవాళ్ళు, నాకు తెలిసి, ఒక జీవితకాలంలో ఆ పఠనం పూర్తిచెయ్యలేరు. చదివిన కవితల దగ్గరే ఆగిపోతూ, ఆగిన కవితల దగ్గరే మళ్ళా మళ్ళా తచ్చాడుతుంటారు.

నాసరరెడ్డి ఇందులో 42 మంది తంక కవుల్ని మనకి పరిచయం చేసాడు. నిజానికి ఒక హైకూని, ఒక తంకని చదవడమంటే ఆ ఒక్కటే విని మురిసిపోవడం కాదు, ఆ ఒక్క కవిత, ఒక్కొక్కసారి అందులో ఒక పంక్తి, లేదా ఒక పదం, లేదా ఒక విరామయతి- మరెన్ని కవితల్ని గుర్తుకు తెస్తుందో వాటన్నిటినీ కూడా తలుచుకోవడమన్నమాట. అలా ఒక్క కవిత నీకెన్ని కవితల్ని గుర్తుకు తెస్తే నువ్వంత సుసంపన్నుడివి. నాకింతదాకా ఇటువంటి సంపన్నులు ముగ్గురు తెలుసు. ఉర్దూపారశీక కవిత్వాల్లో సదాశివగారు, సంస్కృతాంధ్ర కవితాల్లో శరభయ్యగారు, ఇంగ్లీషు, ఫ్రెంచి కవిత్వాల్లో సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు. ఇప్పుడు జపనీయ కవిత్వాస్వాదనలో నాసరరెడ్డిని కూడా వారి సరసన చేర్చవచ్చునని తెలుసుకున్నాను.

ఈ సంపుటిలోంచి కూడా రెండు కవితలు మీకోసం:

హెంజో

భిక్షువునైనా
నీ పేరుకు ఆకర్షితుణ్నై కోశాను
ఒమినయెషి పువ్వా!
ఎవరికీ చెప్పకు
నా మోహం గురించి.

ఈ ఒమెనయషి పువ్వు స్త్రీకి ప్రతీక అని నాసరరెడ్డి ఇచ్చిన వివరణ చదివాక ఈ తంక ఎంత సున్నితంగా నా హృదయంలోకి సొరవేసుకుపోయిందో చెప్పలేను. అలానే ఇషికవ తకొబొకు రాసిన ఈ తంక చూడండి:

నా మిత్రులంతా నాకంటె ఉన్నతంగా కనిపించిన రోజు
ఇంటికి పువ్వుతో వచ్చి
నా భార్యపై ప్రేమచూపాను.

తకుబొకు జీవితం గురించి తెలిసినవాళ్ళకి ఈ మూడు పాదాలూ ఎంత దిగులుపుట్టిస్తాయో చెప్పలేను, అలానే ఆ కవిని ఎంత ధీరచిత్తుడిగా రూపుకట్టిస్తున్నాయో, అది కూడా.

మూడో పుస్తకం, ఆహా! తెలుగు వాళ్ళ భాగ్యమేమని చెప్పను! వజ్జాలగ్గం: వంద గాథలు.

వజ్జాలగ్గం ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఒక ప్రాకృత కవితల సంకలనం. జయవల్లభుడనే జైన సాధువు ఏరికూర్చినది. దాదాపుగా ఒకప్పటి తెలుగునేలలోనే ఈ కవితలు పుట్టినప్పటికీ, ఇప్పటిదాకా, కప్పగంతుల కమల గారు తప్ప మరెవరూ దీన్ని తెలుగులోకి అనువదించలేదు. ఆమెకూడా వచనానువాదమే చేసారు. కాబట్టి ఈ గాథల్లో కొన్నింటిని ఎంచుకుని వాటిని పద్యాల్లోకి మార్చాలన్న ఆలోచననే గొప్పగా ఉంది. ఈ ఒక్క అనువాదం చాలు నాసరరెడ్డి తెలుగు సాహిత్యచరిత్రలో తన పేరు మరెవరూ చెరపకుండా రాసేసుకున్నాడని చెప్పడానికి.

ఈ పద్యాల్లో తెలుగు భావకవుల తెలుగులాగా కనిపిస్తుందిగానీ, ఆ భావకవులు చీనా, జపాన్ కవిత్వాలు చదివిఉండాలి, కేదార్ నాథ్ సింగ్ నీ, కమలాదాస్ నీ చదివి ఉండాలి, అమీ లోవెల్ నీ, ఆక్టేవియో పాజ్ నీ అస్థిగతం చేసుకుని ఉండాలి. అప్పుడే ఇటువంటి పాత-కొత్త తెలుగు పట్టుబడుతుంది. నా మాటలకు సమర్థనగా వంద పదాలూ ఇక్కడ ఎత్తిరాయాలని ఉంది, కాని మచ్చుకి మూడు పద్యాలు:

గాథలందు, మధురగానమ్ములందును
వాద్యతంత్రికారవమ్ములందు
ప్రౌఢమహిళలందు రసము నెరుగనట్టి
యరసికులగువారి కదియ శిక్ష.

వందనము దారిద్య్రమా వందనమ్ము
ఇట్టి ఋద్ధి నీ కరుణ లభించె నాకు:
ఎల్లలోకము నాకు కన్పించుచుండ
నేను లోకమునకు కనిపింపకుంటి.

తన ప్రియురాలి రోదనమొకవైపు,
మరియొక వైపు సమరతూర్యరవము;
ప్రేమ, రణరసము-రెండింటి నడుమ
డోలాయితమ్ము భటుని హృదయమ్ము.

నాలుగో పుస్తకం, పాశ్చాత్య హైకూ. ‘లైలాక్ పరిమళం‘పేరిట.

నిస్సందేహంగా మంచి కవుల్ని వెతికిపట్టుకుని మంచి కవితలే ఎంపిక చేసాడు నాసరరెడ్డి. కానీ నా ప్రగాఢనమ్మకం, పాశ్చాత్య కవులు ఎంత తపస్సు చేసినా వాళ్ళ హైకూలు వాళ్ళ సాఫల్యానికి కాక, వైఫల్యానికే గుర్తులుగా మిగిలిపోతాయని. ఇక్కడ పాశ్చాత్య అంటే ఇంగ్లండ్, అమెరికాలనే కాదు, జపాన్ కి అటూ ఇటూ ఏ దేశానికి చెందిన ఏ కవులైనా కూడా అనే.

అయిదో సంపుటి, అసలైన సంపుటి. నాసరరెడ్డి రాసుకున్న పద్యాలూ, గేయాలూ, మళ్ళా మరికొన్ని అనువాదాలూ.

ప్రియాంగన‘ పేరిట పొందుపరిచిన ఈ గుత్తిలో నాసరరెడ్డి సొంతపద్యాల మీద మహాకవుల ముద్రా, అనువాదాల మీద నాసరరెడ్డి ముద్రా స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మన కాలంలో ఒక తెలుగు కవి ఇలా తేటగీతుల్ని నమ్ముకుని జీవిస్తున్నాడంటే ఎంత అబ్బురంగా ఉందో చెప్పలేను. చూడండి ఈ పద్యం:

దూపాడు

గాలినాసరరెడ్డిని కన్న యట్టి
గ్రామమల్లదే దూపాడు కనుము కనుము!
అతని కవితలు వినిపించు నచటిగాలి
ప్రీతి గొలుపగ మిత్రమా! వినుము వినుము!

ఆహా! ఈ పద్యం నేను రాయవలసింది. డోర్నాల దాటి వినుకొండ వైపు వెళ్ళిన ప్రతిసారీ దూపాడు కనబడ్డప్పుడల్లా ఈ మాటలే చెప్పుకునేవాణ్ణి. ఆ దారిన వెళ్ళినప్పుడే కాదు, ఎర్రగొండపాలెం (రక్తనగాఖ్యపురం అనాలి అంటాడు నాసరరెడ్డి) మీంచి మాచర్ల పోయినప్పుడు, దూపాడు కనబడదన్న మెలకువతో కూడా, ఎన్ని సార్లు ఈ మాటలు చెప్పుకుని ఉంటాను!

అనువాదాల్లో మళ్ళా వాంగ్-వెయి, బషొ, వాల్మీకి, భారతియారు- మళ్ళా అదే సాధుక్కడి. కాని ఆశ్చర్యం, తిక్కనని కూడా తెలుగు చేసాడు మనవాడు! ఈ పద్యం చూడండి!

అస్థిమాలయా కౌస్తుభమా యలంక
రించుకొన నీకెది యధిక ప్రీతికరము?
హాలహలమో యశోదస్తన్యమ్మొ నీకు
స్వాదువేదియో వచియింపు స్వామి!నాకు.

అనిల్! నీకొక ప్రేమాలింగనం. ఆకాశం మీద నల్లమబ్బులు కమ్ముకుంటున్నవేళ, కిటికీ పక్కన కోకిల నా మతిస్తిమితం తప్పిస్తున్నవేళ, ఈ కవిత్వాన్ని నాకు అందచేసి నువ్వెంత పుణ్యం మూటగట్టుకున్నావో నీకు తెలీదు.


ఈ పుస్తకాలు అన్ని బుక్ షాపుల్లోనూ లభ్యంగా ఉన్నాయి. అయిదూ కలిపి మొత్తం 350/-

9-7-2024

19 Replies to “కవిత్వం కావాలి కవిత్వం”

  1. ఐదా!! ఒక్కటే చూశాను, తప్పకుండా చదువుతాను. ❤️❤️

    మీ ఆకలి కి ఓ వందనం. జీర్ణశక్తికి వంద. 😀

  2. నమస్కారం సర్…ఎప్పటిలానే ఇష్టంగా చదివించిందీ వచనం..ఇక పుస్తకాలు కొని చదవాలి…

  3. గొప్ప కవిత్వం!!
    గొప్ప పరిచయం! Thank you sir.

    “ఆకాశం నీలంగా ఉంది’ లాంటి కోడ్ మాటలేవీ చెప్పుకోకుండానే ఒకరిచేతుల్లో నిధినిక్షేపాలు మరొకరి చేతుల్లోకి మారిపోయాయి.” 😂

  4. పుస్తకాలన్నీ అమాంతం చదివేయాలి ఆనేంత గొప్పగా పరిచయం చేసారు.. ధన్యవాదాలు..

  5. ఒక జీవితకాలంలో ఆ పఠనం పూర్తిచెయ్యలేరు. చదివిన కవితల దగ్గరే ఆగిపోతూ, ఆగిన కవితల దగ్గరే మళ్ళా మళ్ళా తచ్చాడుతుంటారు.
    అవును. చిన్న చిటికే జీవితం. అవగాహన, శ్రద్ధ రానప్పుడు… సమయం విలువ తెలియని పాపాయి పారాడేటప్పటి చేతగానితనపు తిరుగుడు.

    నిజానికి ఒక హైకూని, ఒక తంకని చదవడమంటే ఆ ఒక్కటే విని మురిసిపోవడం కాదు, ఆ ఒక్క కవిత, ఒక్కొక్కసారి అందులో ఒక పంక్తి, లేదా ఒక పదం, లేదా ఒక విరామయతి- మరెన్ని కవితల్ని గుర్తుకు తెస్తుందో వాటన్నిటినీ కూడా తలుచుకోవడమన్నమాట. అలా ఒక్క కవిత నీకెన్ని కవితల్ని గుర్తుకు తెస్తే నువ్వంత సుసంపన్నుడివి.

    ఇది చదివాక కళ్ళు చెమ్మగిల్లి కళ్ళు మసక.
    వెనుకకి తిరిగి చూసుకుంటే తమకేం కావాలో తమకి తెలియని మనిషి. తెలిసాక ముగింపు దశ.
    అప్పుడు సముద్రమంతా, ఆకాశమంత కవిత్వం విస్తరిస్తూ పొంగుతూ వస్తుంది.
    దానికి భాష్యం ఉండదు. కానీ అమోఘం.

    ఆకాశం మీద నల్లమబ్బులు కమ్ముకుంటున్నవేళ, కిటికీ పక్కన కోకిల నా మతిస్తిమితం తప్పిస్తున్నవేళ, ఈ కవిత్వాన్ని మీరు చదివి మా వంటి వారికి వినిపించిన మీరెంత పుణ్యం మూటగట్టుకున్నావో మీకూ తెలియదు.
    హృదయ పూర్వక సుమాంజలులు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading