ఆగని కచేరీ

Telangana State Museum, Hyderabad

పదిపన్నెండేళ్ళ కిందట మొదటిసారి చూసాను స్టేట్ మూజియాన్ని. అబ్దుర్ రహ్మాన్ చుగ్తాయి చిత్రలేఖనాలు చూడటానికి. అసలు చుగ్తాయి చిత్రించిన అన్ని వర్ణచిత్రాలు హైదరాబాదులో ఒక మూజియంలో ప్రదర్శనకి ఉండవచ్చునని నేను ఊహించనేలేదు. కాని అప్పుడు నేను చూసింది చుగ్తాయినే తప్ప మొత్తం స్టేట్ మూజియం ని కాదని నిన్న నాకు అర్థమయింది.

పబ్లిక్ గార్డెన్స్ లో డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి స్టేట్ మూజియం ఉందని హైదరాబాదు నగరవాసులకి ఎంతమందికి తెలుసో నాకు అనుమానమే. ఎవరికైనా తెలిసి ఉంటే, లేదా దాని గురించి విని ఉంటే అదొక మమ్మీ మూజియంగానే తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే, మూజియంలో అడుగుపెట్టగానే ముందు కనిపించేది ఒక మమ్మీ. రెండున్నర వేల ఏళ్ళ కిందటి ఈజిప్షియన్ టాలెమీ యుగానికి చెందిన మమ్మీ అది. దాన్ని ఆరవ నిజాం అల్లుడు వెయ్యి పౌండ్లకి కొన్ని ఏడో నిజాం కి కానుక చేసాడు. బ్రిటిష్ వాళ్ళు ఈజిప్టుని కొల్లగొట్టుకున్నప్పుడు అక్కడి మమ్మీల్ని కూడా వదల్లేదు. అలా భారతదేశానికి చేరిన ఆరు మమ్మీల్లో ఒకటి హైదరాబాదుకి కూడా చేరింది. ఇప్పుడు నగరంలో స్కూలు పిల్లలకి ఉపాధ్యాయులు ఈజిప్షియన్ చరిత్ర గురించి చెప్పాలంటే ఆ మమ్మీకన్నా సజీవ ఉదాహరణ మరొకటి దొరకడం కష్టం.

కానీ, హైదరాబాద్ స్టేట్ మూజియం అంటే ఆ మమ్మీ మాత్రమే కాదు. ‘మీకు తెలుసా! మా దగ్గర దాదాపు రెండున్న లక్షల నాణేలున్నాయి. నూమిస్మేటిక్స్ లో బ్రిటిష్ మూజియం తర్వాత ప్రపంచంలో రెండో పెద్ద మూజియం మాదే’ అని అన్నారు మూజియం క్యురేటర్ గంగ గారు. కాని ఆ నాణేలన్నీ బాంకులో స్ట్రాంగ్ రూమ్ లో దాచిన బంగారంలాగా లోపలనే ఉన్నాయి. వాటిని ప్రదర్శనకి పెట్టాలంటే, చాలా నిధులు కావాలి. షోకేసులు, లైటింగ్, అదనపు సిబ్బంది, అన్నిటికన్నా మించి గతం గురించీ, గత చరిత్ర గురించీ తెలుసుకోవాలన్న ఉత్సాహం, ఉద్రేకం పొంగిపొర్లే ప్రజలు.

నేనింతకుముందు ఆ మూజియాన్ని చూసినప్పటికి ఇంకా తెలంగాణా రాష్ట్రం ఏర్పడలేదు. కాని ఈ పదేళ్ళలో ప్రత్యేక తెలంగాణా ఏర్పడ్డాక, తెలంగాణా చరిత్ర గురించీ, చరిత్ర పూర్వ సంస్కృతి గురించీ ఎంతో కొత్త చైతన్యం పరవళ్ళు తొక్కుతుండవలసిన కాలంలో కూడా, ఒక శనివారం మధాహ్నం నాతో పాటు నలుగురైదుగురు మించి సందర్శకుల్లేరక్కడ.

మూజియంలో మొత్తం నాలుగు భవనాలున్నాయి. మొదటి భవనంలో ఈజిప్షియన్ గాలరీతో పాటు, బ్రాంజ్ గాలరీ, పోర్సిలిన్, నగలు, వస్త్రాల గాలరీ ఉన్నాయి. ‘బిడ్డా, చాలామంది ఈ గాలరీ చూసి వెళ్ళిపోతారు. దీని వెనక ఉన్న బిల్డింగులు కూడా చూసి వెళ్ళంది. అక్కడ బుద్ధుడి అస్తికలు కూడా ఉన్నాయి’ అని అన్నది నాతో అక్కడి చిరుద్యోగి. ఆమె అక్కడ తోటమాలిగా పనిచేస్తున్నదట. సిబ్బంది కొరత వల్ల, గాలరీలో కూడా డ్యూటీ చేస్తున్నది.

‘నువ్వేం చదువుకున్నావు?’ అనడిగాను.

‘నాకు చదవడం, రాయడం రాదు’ అందామె.

కాని ఆమె మూజియం గురించి చెప్పిన వివరాలు విన్నాక, నాకే గనుక అధికారం ఉంటే, ఆమెని తక్షణం అసిస్టెంట్ క్యురేటర్ గా ప్రమోట్ చేసి ఉండేవాణ్ణి.

నాలాంటి నగరవాసులకి ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలియదోగాని, అక్కడ భద్రపరిచిన బుద్ధుడి అస్థికల వల్ల, దలైలామాతో సహా ప్రపంచంలోని బౌద్ధభిక్షువులకు చాలామందికి, ఈ ఒక్కకారణం చేత స్టేట్ మూజియం ఒక పవిత్ర స్థలంగా మారిపోయింది. కాని నా దురదృష్టం కొద్దీ నేను వెళ్ళినప్పుడు ఆ గాలరీలో విద్యుత్ సరఫరాలేదు. నా మొబైల్ టార్చ్ వెలుగులో మూజియం క్యురేటర్ ఆ అస్థిపేటికనీ, బుద్ధుడి అస్థికగా చెప్తున్న కాలర్ బోన్ శకలాన్నీ, దానితో పాటు పేటికలో భద్రపరిచిన నవరత్నాల్నీ చూపించారు. బావికొండ తవ్వకాల్లో బయటపడ్డ ఆ ధాతుపేటి, ఆ దివ్యావశేషాలు నేనున్న ఊరిలో నాకింత దగ్గరలో ఉన్నాయని నాకిప్పటిదాకా తెలియదు. ఆ చీకట్లోనే నేను ఆ పేటికముందు మోకరిల్లకుండా ఉండలేకపోయాను.

ఆ రెండో భవనం మేడ మీద అజంతా ఫ్రెస్కోల గాలరీ ఉంది. అజంతా గుహల్లో వర్ణచిత్రాలు కాక, ఆ చిత్రాలకు నకలు తీసి ప్రదర్శిస్తున్న అటువంటిది గాలరీ ఒకటి హైదరాబాదులో తప్ప, ప్రపంచంలో, మరెక్కడా లేదు. ఆ గాలరీ కథ మరొక ఆశ్చర్యం. ఒకప్పుడు ఔరంగాబాదు కూడా నైజాం రాజ్యంలో భాగంగానే ఉండేదికాబట్టి, అజంతా గుహల్లో చిత్రలేఖనాలు బయట పడగానే, నిజాం నవాబు వాటికి నకళ్ళు గీసి తెమ్మని ఇద్దరు చిత్రకారుల్ని అక్కడికి పంపించాడు. ఖాన్ బహదూర్ సయ్యద్ అహ్మద్, మహమ్మద్ జలాలుద్దీన్ అనే ఆ ఇద్దరు చిత్రకారులు దాదాపు ముప్ఫై ఏళ్ళ పాటు అజంతా దగ్గరే ఉండిపోయి ఆ చిత్రాల్ని చూసినవి చూసినట్టుగా eye-copies చిత్రించారు. 1949 లో ఆ వర్ణచిత్రాల్ని ఈ మూజియంలో మొదటిసారి ప్రదర్శించారు.

‘అజంతా వర్ణచిత్రాల్ని అధ్యయనం చెయ్యాలంటే ఇప్పుడు ఆ వర్ణచిత్రాలే ఆధారం, ఎందుకంటే, ఈ గడచిన డెబ్భై ఎనభయ్యేళ్ళల్లో అజంతా బొమ్మల రంగులు మరింత వెలిసిపోయాయి, గోడలు మరింత పెచ్చులూడిపోయాయి’ అని అన్నారు గంగగారు.

ఆ చిత్రలేఖనాల గాలరీలో లైటింగ్ మరింత మెరుగుపర్చవలసి ఉంది. ఆ వర్ణచిత్రాలతో ఒక చిన్న బ్రోచరో, పుస్తకమో తేవలసి ఉంది. కాని ఆ అరకొర వెలుగులోనే ఆ బొమ్మల్లోని అందాన్ని చూడకపోలేదు నేను. ముఖ్యంగా పద్మపాణి బోధిసత్త్వ, హంస జాతక కథ, వెస్సంతర జాతక కథ వంటి వాటిని చూస్తున్నప్పుడు, ఆ పేలవెలుగు వల్ల, అజంతా గుహాలయంలో అసలు చిత్రాల్ని చూస్తున్నట్టే ఉంది.

గాలరీనుంచి బయటికొచ్చాక అంతదాకా చూసిన దృశ్యాల్ని ఒక క్షణం మరోసారి నెమరేసుకున్నాను. చిత్రించిన చిత్రకారులు ఆంధ్రులు. ఇతివృత్తం బౌద్ధ జాతక కథలు. చిత్రించింది గుప్త సామ్రాజ్య కాలంలో. తిరిగి వాటికి నకళ్ళు రాయించింది ఒక మహ్మదీయ రాజవంశం. ఆ నకళ్లు చిత్రించిన చిత్రకారులు ఇద్దరూ ముస్లిములు. మతాల, రాజ్యాల, యుగాల సరిహద్దులు పూర్తిగా చెరిగిపోయి ఒక్క కళమాత్రమే వర్ధిల్లుతున్న అపురూపమైన చోటుకదా అదని నాకు నేను చెప్పుకున్నాను.

ఆ రెండో భవనానికి పక్కన మూడో భవంతిలో ఇస్లామిక్ ఆర్ట్ గాలరీ ఉంది. అక్కడనే చుగ్తాయి చిత్రలేఖనాలున్నాయి. నేనింతకు ముందు ఆ చిత్రాలు మాత్రమే చూసి వెళ్ళిపోయాయని ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఆ పక్కనే అద్భుతమైన మీనియేచర్ గాలరీ ఉంది. అసలు హైదరాబాదులో అంత విశిష్టమైన మీనియేచర్ల ప్రదర్శన ఉండగలదని నేనెప్పుడూ ఊహించలేదు. ఏమి మీనియేచర్లవి!

వాటిలో మరీ గొప్పగా ఉన్నవి రాగరాగిణుల మీనియేచర్ చిత్రాలు. హిందుస్తానీ సంగీతంలో ప్రతి ఒక్క ముఖ్యరాగానికీ, ఆ రాగం నుంచి జనించిన రాగిణులకి ఒక దేవత, ఆ దేవతకొక ఆకృతి, అలంకారం, ఆమె చుట్టూ ఒక వాతావరణం చిత్రకారులు ఊహించారు. వాటిని ఈ మీనియేచర్ చిత్రకారులు అత్యంత లలితరేఖల్తో, అహ్లాదకరమైన రంగుల్లో చిత్రించేరు. ఆ మీనియేచర్ ఒక్కొక్కటీ ఒక రోజంతా చూడదగ్గది.

ఏమన్నాను? చూడదగ్గది అనా? కాదు, వినదగ్గది.

ఆ మీనియేచర్ గాలరీలోనే దంతం పైనా, ఇత్తడిపైనా చిత్రించిన మీనియేచర్లు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఆరబిక్, పర్షియన్ మానుస్క్రిప్టులు, కురాన్ రాత ప్రతులూ కూడా ఉన్నాయి.

మూజియంలోని నాలుగో విభాగం జైన శిల్ప ప్రదర్శన. కాని ఆ భవంతి మరమ్మత్తుల్లో ఉన్నందున సందర్శకులకి అనుమతి లేదు. మూజియం మొదటి భవనానికీ, రెండో భవంతికీ మధ్య ప్రాంగణంలో విజయనగర కాలం నాటి తేరు ఒకటి ప్రదర్శిస్తున్నారు. మరొకపక్క కాకతీయుల కాలం నాటి మండపానికి ఒక నమూనా కూడా నిర్మించి పెట్టారు. తవ్వకాల్లో బయటపడ్డ వివిధదేవతా ప్రతిమలూ, అసఫ్ జాహీలు యుద్ధాల్లో వాడిన ఫిరంగులూ కూడా ఆ ఆరుబయట ప్రదర్శనలో ఉన్నాయి.

‘బుద్ధభగవానుడి అస్థికలూ, మమ్మీ కాక ఇంకా గొప్పగా చెప్పుకోదగ్గ ఆర్టిఫాక్ట్స్ ఇంకా ఏమున్నాయి మీ మూజియంలో’ అనడిగాను గంగ గారిని.

‘హారీతి’ అన్నారామె.

‘హారీతి బౌద్ధంలో ఒక దేవత. చిన్నపిల్లల బాగోగుల్ని చూసుకునే దేవత. ఆమెకి సంబంధించిన మొదటి కాంస్యప్రతిమ మా బ్రాంజ్ గాలరీలో ఉంది. ధూళికట్ట దగ్గర తవ్వకాల్లో దొరికింది. ఒకరకంగా చెప్పాలంటే సింధులోయ నాగరికత కాలానికి సమకాలికంగా చెప్పదగ్గ ప్రతిమ అది’ అన్నారామె.

‘నేను బ్రాంజ్ గాలరీ మొదటే చూసాను. కానీ ఆ ప్రతిమని చూసినట్టు అనిపించలేదు. నాకు ఆ ప్రతిమని చూపిస్తారా?’ అనడిగాను.

అప్పటికే మూజియం పని గంటలు ముగిసిపోయాయి. గాలరీ తలుపులు మూసేసి సంతకాలతో సీల్ చేస్తున్నారు. కాని ఆమె ఎంతో దయతో నాకోసం మళ్లా ఆ తలుపులు తెరిపించి గాలరీలోకి తీసుకువెళ్ళారు. అక్కడ ఒక చిన్ని కాంస్యప్రతిమని చూపించి ‘ఇదే హారీతి’ అని అన్నారు.

ఆశ్చర్యపోయాను. నా హైస్కూలు రోజుల్లో మొదటిసారి గీతాంజలి పుస్తకం చూపిస్తూ మా వెంకట రత్నం మాష్టారు దీనికే నోబెల్ ప్రైజు వచ్చిందని చెప్తే ఎంత ఆశ్చర్యపోయానో, ఇప్పుడూ అంతే ఆశ్చర్యపోయాను. మహాస్తూపాలు, చైత్యాలు, తోరణ శిల్పాలు, కుడ్యచిత్రాలు రూపొందించిన బౌద్ధ శిల్పులు అంత చిన్న శిల్పాన్ని కూడా, అది కూడా భారతీయ శిల్పకళ వికసిస్తున్న తొలిరోజుల్లోనే, రూపొందించి ఉండగలరని నేను ఊహించలేకపోయాను.

సుమారు నాలుగంగుళాల పొడవూ, మూడంగుళాల వెడల్పూ ఉండే ఆ ప్రతిమలో ఒక దేవత. ఆమె జడకట్టు, నేత్రాలు, నోరు, చెవికమ్మలు, కడియాలు, దండకడియాలు, వడ్డాణం-  ఆ దేవతకు సంబంధించిన ఏ అలంకారాన్నీ, వివరాన్నీ కూడా ఆ శిల్పి విడిచిపెట్టలేదు. ఆమె ఒడిలో ఒక చిన్నబిడ్డ, ఆ బిడ్డ కుడిచేతిలో ఒక దానిమ్మపండు కూడా. నేను కొంతసేపు ఆ దేవతాప్రతిమనే చూస్తూ ఉండిపోయాను.

హైదరాబాదు చూడాలని వచ్చే యాత్రీకులు ఈ చిన్ని శిల్పాన్ని చూడకుండా, చార్మీనారూ, కుతుబ్ షాహీ సమాధులూ, ఆసఫ్ జాహీ వాస్తు నిర్మాణాలూ మాత్రమే చూసి వెళ్ళిపోతే ఎంత అన్యాయం! నేను మొదటిసారి ఎర్రకోట సందర్శించినప్పుడు అక్కడ మూజియంలో ఒక చిన్న చేప మీనియేచర్ వర్ణ చిత్రాన్ని చూసి ఇదే దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక జాతి కళావైభవం మహానిర్మాణాల్లో మాత్రమే కాదు, ఇటువంటి సూక్ష్మ సుందరకృతుల్లో కూడా మనం చూడవలసి ఉంటుంది. జపాన్ సాహిత్యం గురించి రాస్తూ ఒక విమర్శకుడు ఈ మాటే చెప్పాడు: ఆ సాహిత్యంలో ఒక గెంజిగాథలాంటి మహాకావ్యమే కాదు, మూడు పాదాల హైకూ కూడా ఒక భాగమేనని.

నేను మొదటిగాలరీ లో కలుసుకున్న చిరుద్యోగి, నేను ఆ మూజియం అంతా ఒక రౌండు చుట్టివచ్చేలోపటనే, ఆ మూజియం క్యురేటర్ తో అన్నదట: ‘అమ్మా, ఒక సారు వచ్చిండు, సాలార్ జంగ్ మూజియం కన్నా మన మూజియమే బాగుందని చెప్పిండు’ అని.

నిజమే. సాలార్ జంగ్ మూజియం కి చాలా ప్రశస్తి లభించింది గాని, అక్కడి వస్తుసామగ్రి సాలార్ జంగ్ తాలూకు తక్కువ రకం అభిరుచికి, విదేశీ వస్తు వ్యామోహానికీ ప్రతీకగా కనిపించింది నాకు. అక్కడి గాలరీల్లో అత్యున్నత స్థాయి శిల్పాలుగాని, చిత్రలేఖనాలుగాని, యుగాల తరబడి చెక్కుచెదరకుండా తెలంగాణా చరిత్రకు అద్దం పట్టే వస్తుసామగ్రి కాని పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు చెప్పగలను, తెలంగాణా చరిత్రకు సాక్ష్యం చెప్పే మూజియం హైదరాబాదులో చూడాలంటే స్టేట్ మూజియం కి వెళ్ళండని.

కానీ ముందు తెలంగాణా పాలకులు ఈ మూజియాన్ని సందర్శించాలి. తన పదేళ్ళ పాలనాకాలంలో పూర్వముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఇక్కడ అడుగుపెట్టలేదని విన్నాను. ప్రస్తుత ముఖ్యమంత్రి దృష్టి ఇంకా ఇటుపడ్డట్టులేదు. నిజాం నవాబు తర్వాత మళ్ళా వై.ఎస్.రాజశేఖర రెడ్డి కాలంలోనే ఈ మూజియం కొంత ఆదరణకు నోచుకుందని తెలుస్తున్నది.

చాలా చెయ్యాలి. మూజియంలో లైటింగ్ మెరుగుపరచాలి. భవనాలకు వెల్లవేయాలి. లోపల చెక్క షోకేసులు మార్చాలి. సందర్శకులకి ప్రతి ఆర్టిఫాక్టు గురించీ వివరంగా చెప్పే ఒక గైడెడ్ టూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించాలి. ముఖ్యమైన ఆర్టిఫాక్టుల నమూనాలు, చిత్రలేఖనాల నమూనాలు ప్రింటు తీసుకునే ఏర్పాటు ఉండాలి. ప్రతి గాలరీలోనూ ఒక కియోస్కు ఉండాలి. ఈ మూజియం గురించిన బ్రోచర్లు, బుక్ లెట్లు విరివిగా అందుబాటులో ఉంచాలి. పబ్లిక్ గార్డెన్స్ బయట ఈ మూజియం గురించి నలుగురికీ తెలిసేలా పెద్ద బోర్డు పెట్టించాలి. హైదరాబాదులో చరిత్రపరిశోధకులు, చిత్రకారులు, సాహిత్యవేత్తలు వీలైనన్న్ని సార్లు ఇక్కడ సమావేశం కావడానికి వీలుగా ఏర్పాట్లు చెయ్యాలి.

అసలు అన్నిటికన్నా ముందు ఆ మూజియం భవంతి ఇండో-పర్షియన్ ఆర్కిటెక్చర్ దానికదే ఒక దృశ్యమాన సౌందర్యం. ఆ గుమ్మటాల మీద ప్రేమగా కొమ్మలు పరుచుకుని రోజంతా నౌబత్తులు మోగిస్తున్నట్టుండే ఆ తురాయి చెట్లని చూడటమే గొప్ప అనుభవం. ఇంటికొచ్చాక కూడా ఆ తురాయిపూల నాదస్వరంతో గొంతుకలిపి ఆ మీనియేచర్ల లలిత స్వరాలు, నా వీనుల్లో, ఆగని కచేరీ సాగిస్తోనే ఉన్నాయి.

23-6-2024

22 Replies to “ఆగని కచేరీ”

  1. ఎన్నెన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను. Feeling grateful, sir! 🙏🏽

  2. చాలా మంచి విషయాలు అందించారు సార్.ధన్యవాదాలు

  3. సాలార్ జంగ్ మ్యూజియం తప్ప పబ్లిక్ గార్డెన్స్ లో మ్యూజియం తెలియదు. నాకే కాదు చాలామంది కి తెలిసి ఉండదని అనుకుంటా.
    చాలా విషయాలు తెలియజేసారు.
    దాంతో పాటు మీ సూచనలను ఇప్పటి ప్రభుత్వం పట్టించుకుంటే, మంచి పర్యాటక కేంద్రం అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడాలి. ధన్యవాదాలండీ.

  4. నా 8th క్లాస్లో ఎక్స్కర్షన్ కు వచ్చినప్పుడు ఈ మ్యూజియం చూసాము మొదటిసారి..
    తర్వాత నేను హైదరాబాద్ లో ఉద్యోగనిమిత్తం ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చిన బంధువుల పిల్లల్ని తీసుకుని వెళ్లాను కొన్నిసార్లు..
    KPHB నుంచి డైరెక్ట్ గా చార్మినార్, సాలార్ జంగ్, అసెంబ్లీ, స్టేట్ మ్యూజియం, బిర్లా టెంపుల్, రవీంద్ర భారతి, లుంబిని పార్క్… ఇట్లా ఉండేది మా టూర్ ప్లాన్..
    చిన్నప్పుడు చూసిన ఆ మ్యూజియం బాగా గుర్తు చేశారు.. థాంక్యూ సర్..
    మళ్ళీ ఓసారి చూడాలి

  5. మాటలు రాని మౌన సమాధిలో కొన్ని క్షణాల పాటు. మీరు చెప్పేదాకా చూసిన స్పృహ కూడా లేని ముఖ్యంగా అందులోని వస్తువుల గురించి ఏమీ తెలియని గాజు కన్నులు వీక్షించిన దాన్ని
    ….చాలా ఏండ్ల క్రితం చూచానని చెప్పటం సిగ్గుపడటం కోసమే. హారీతి శిల్పం కరీంనగర్ జిల్లా లోని ధూళికట్టలో దొరికిందని చెప్పగానే మీరన్న మాట తెలంగాణా చరిత్ర ఇంకా తెలుసుకోవలసినది తెలియవలసినది చాలా ఉందని అనిపించింది. అక్కడి చిరుద్యోగిని పరిచయం చేసిన తీరు ఆమెను కూడ ‘దర్శనీయ’
    గా చేసారు.
    కాళోజీ. అశీతి సభ పక్కనే ఉన్న ఇందిరా ప్రియదర్శిని హాలులో జరిగినప్పుడు సభాధ్యక్షులు సదాశివ,ముఖ్య అతిథి పీవీ. ఆ సభకు హాజరైన సందర్భంలో చూసిన గుర్తు..
    కానీ అది చూడని కిందకే లెఖ్ఖ. మీ సాంస్కృతిక దార్శనికతకు కేలుమోడ్చుటొక్కటే చేయగలపని.

  6. మ్యూజియం గురించి గొప్ప వివరణ అది మీకే సాధ్యం. 🙏..

  7. మ్యూజియం గురించి చాలా విషయాలు మాకు తెలిపినందుకు ధన్యవాదాలు సార్ మీకు

  8. వ్యాఖ్య వ్రాయలేకుండా ఉండలేకపోతున్నాను.

    2002 ప్రాంతాల్లో భాగ్యనగరంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు స్టేట్ మ్యూజియం లో ఓ రోజంతా గడిపాను సార్. ఒక నాట్యగత్తె ప్రతిమను చూస్తూ ఆ ఆభరణాలు ఒక్కొక్కటి చూస్తూ గుర్తు పెట్టుకున్నాను. ఆ రోజు నేనొక్కడినే సందర్శకుడిని. వెలితి అనిపించలేదు, ప్రశాంతంగా నిండుగా ఉన్నది.

    మీరు చూపిన హారీతి ప్రతిమ ఈరోజుకూ కళ్ళల్లో మెదులుతూ ఉంది. ఆ రోజు తర్వాత తిరిగి వరుసగా నాలుగు రోజులు వెళ్ళాను. కప్పగంతుల హనుమచ్చాస్త్రి గారనుకొంటాను, బౌద్ధం మీద విస్తృతంగా ఒక పుస్తకం వ్రాశారు. ఆ పుస్తకం 50 శాతం రిబేటుతో మ్యూజియం వారి దగ్గరే కొనుక్కున్నాను. ఇప్పటికీ ఉంది.

    అక్కడే ఆవరణలో విగ్రహాలు ఎండకు ఎండుతూ ఉంటే, ఎదలో గుచ్చినట్లు అనిపించేది. శ్రీశైలంలోనో, మరెక్కడో మునిగి పోయిన ఒక మంటపాన్ని తిరిగి రీ కన్ స్ట్రక్ట్ చేసి పెట్టినట్టు గుర్తు. చాలా అందమైన ఒద్దికైన మంటపం.

    హైద్రాబాద్ లో ఉన్నప్పుడంతా ఆ మ్యూజియం ముందు వెళ్ళినప్పుడు మనసు చాలా బాధపడేది.

    ఎవరికీ అర్థం కాని వేదన అది.

  9. చాలా సార్లు మెట్రో నుండి వెళ్తూ ఈ మ్యూజియం చూస్తూ కట్టడం బాగుంది అనుకున్నాను, మొదటిసారి మీ వివరణ చదివాక ఒక గొప్ప చరిత్ర కు సంబంధించిన నిధికి రూట్ మాప్ దొరికినంత ఆనందంగా ఉంది. వీలుచూసుకుని తప్పకుండా వెళ్తాను. మీకు కృతజ్ఞతలు.

  10. Museum గురించిన చాలా విషయాలు తెలిపారు. హైదరాబాద్ లో చదువుకొని ఉద్యోగం చేసి, దాని ముందు నుండే చాలా సార్లు వెళ్లి..తెలుసుకొనందుకు, చూడనందుకు సిగ్గు పడుతున్నాను. విలువైన సమాచారాన్ని యిచ్చారు. కృతజ్ఞతలు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading