
శ్రీ శ్రీ ఖడ్గసృష్టి మొదటిసారి చదివినప్పుడు అందులో నన్ను ఆకర్షించిన చాలా వాటిల్లో పాల్ ఎలార్డ్ పేరూ, ఆయన కవితలూ కూడా ఉన్నాయి. అప్పటికి పాల్ ఎలార్డ్ కవిత్వం శ్రీ శ్రీ తప్ప మరెవ్వరూ తెలుగు చేసినట్టు నాకు తెలియదు.
శ్రీ శ్రీ పాల్ ఎలార్డ్ వి మొత్తం తొమ్మిది కవితలు అనువదించాడు. అవి ‘ద్వేషగీతం’ (1943), ‘వాడిదే ఇంకో గీతం’ (1943), ‘నౌకాయానాల తర్వాత’ (1945), ‘పబ్లిక్ రోజా’ (1945), ‘స్వాతంత్య్రం’ (1947), ‘ఒకరో, పలువురో’ (1948), ‘విషాదనగరం’ (1949), ‘గీతం’ (1955), ‘చిరుతిండి’ (1974). అంటే ఒకవైపు దేశం క్విట్ ఇండియా పోరాటం ముగించి స్వాతంత్య్రం పొందడానికి సమాయత్తం అవుతున్న కాలం నుంచి మళ్ళా ఎమర్జెన్సీ విధించే రోజులదాకా దాదాపు ముప్ఫై ఏళ్ళ పాటు ఆయన చదువుతున్న, అనువదిస్తున్న కవుల్లో పాల్ ఎలార్డ్ కూడా ఉన్నాడన్నమాట.
ఆ తర్వాత బైరాగి ఆగమగీతి నా చేతికి అందినప్పుడు మళ్ళా పాల్ ఎలార్డ్ ప్రత్యక్షమయ్యాడు. అందులో అతడివి వి మూడు కవితలున్నాయి. ‘ప్రేయసి’, ‘చీకటిని సొంతం చేసుకున్నాం’, ‘హెచ్చరిక’. బైరాగి ఆ కవితల్ని ఇంగ్లిషునుంచి అనువదించినట్టు రాసుకున్నాడు. శ్రీ శ్రీ లాగా ఎలార్డ్ అని రాయకుండా యూలార్డ్ అని రాసాడు.వీళ్ళిద్దరూ కాక, ఇస్మాయిల్ గారు కూడాపాల్ ఎలార్డ్ ది ఒకటో రెండో కవితలు అనువదించినట్టు గుర్తు.
ఆ పదిపదిహేను అనువాద కవితలూ చదివినప్పటినుంచీ పాల్ ఎలార్డ్ పేరూ, అతడి కవిత్వమూ కొంత కొత్తగా, ఆకర్షకంగా అనిపిస్తూ ఉండేదిగాని, అతడి కవిత్వం తత్త్వం, దాని లోతు, గాంభీర్యం నేను అంచనా వేసుకోకలేకపోయాను. ఇదుగో, ఇప్పుడు Gilbert Bowen అనువదించి సంకలనం చేసిన Selected Poems (2023) చదివినదాకా.
బోవెన్ అనువాద సంకలనంలో మొత్తం 44 కవితలున్నాయి. వాటితో పాటు Max Adereth అనే ఆయన రాసిన అద్భుతమైన పరిచయవ్యాసం కూడా ఉంది. కవితలూ, ముందుమాటా కలిపి నూట యాభై పేజీలు కూడా మించని ఈ పుస్తకం పూర్తి చేయగానే నాకు పాల్ ఎలార్డ్ అంటే ఏమిటో అర్థమయింది. ఒక మహాకవిని మాత్రమే కాదు, ఒక ప్రేమాస్పద మానవుణ్ణి కూడా ఎంతో దగ్గరగా చూసానన్న తృప్తి కలిగింది.
పాల్ ఎలార్డ్ కవిత్వంలో అన్నిటికన్నా మొదటగా నన్ను కట్టిపడేసిన అంశం ఆ కవిత్వంలో ఎక్కడా కావ్యభాషలేకపోవడం. ఆయన తన కవిత్వంలో ఫ్రెంచి భాష సహజగుణాలమీదా, నాదాత్మకతమీదా ఎంతవరకూ ఆధారపడ్డాడో తెలియదుగాని, అర్థాలంకారాల కోసం ఎక్కడా ప్రయత్నించలేదని మటుకు స్పష్టంగా తెలుస్తోంది. కవిత్వం ఎల్లలు దాటి ప్రసరించడానికి మెటఫర్ చాలావరకూ సాయపడుతుందని మనకు తెలుసు. కాని ఎలార్డ్ కవిత్వంలో ఎక్కడా రూపకాలంకారాలకోసం వెతుకులాట కనిపించదు. అది మామూలు భాష, మామూలు మాటలు, అత్యంత స్వభావోక్తి. కాని ఒక మాట నేరుగా హృదయం నుంచి వెలువడినప్పుడు దానికదే గొప్ప కవిత్వం కాగలదని ఈ సంపుటంలోని కవితలన్నీ ఋజువుచేస్తున్నాయి.
పాల్ ఎలార్డ్ సర్రియలిజం ప్రవక్తల్లో ఒకడు. కొన్నాళ్ళు కమ్యూనిస్టుగా తన భావాల్ని ప్రచారం చేసి మధ్యలో పార్టీ నుంచి బయటపడి, మళ్లా కమ్యూనిస్టుగా కొనసాగినవాడు. కాని సర్రియలిజం, కమ్యూనిజం రెండింటినుంచీ అతడు తన కవిత్వాన్ని కాపాడుకున్నాడు. అతడు జీవితకాలం పాటు, వర్డ్స్ వర్త్ మాటల్లో చెప్పాలంటే, the real language of men లో తన కవిత్వం చెప్పడం సాధన చేసాడు. ఈ ప్రభావం శ్రీ శ్రీ ‘ఖడ్గసృష్టి’ కవితల్లోనూ, ఆ తర్వాత ‘మరోప్రస్థానం’ కవితల్లోనూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇస్మాయిల్ గారిది ఈ తరహా శైలి అని చెప్పవచ్చు. ఉదాహరణకి ఈ వాక్యాలు చూడండి:
పరిపూర్ణ న్యాయం
జీవితం పట్ల మనుషుల నమ్మకం
ద్రాక్షల్ని పానీయంగా మార్చడం లాంటిది
వాళ్ళు బొగ్గునుంచి నిప్పు సృష్టిస్తారు
ముద్దుల్లోంచి మనుషుల్ని రూపొందిస్తారు.
జీవితం పట్ల మనుషుల నమ్మకం
తీవ్రాతితీవ్రం. అది సకల యుద్ధాల
నడుమ, దైన్యం నడుమ, మృత్యువు ఎదట
కూలిపోకుండా ప్రాణాల్తో నిలబడటం.
జీవితం పట్ల మనుషుల నమ్మకం
కడు ఉదాత్తం, అది నీళ్ళని విద్యుత్తుగా
మార్చడం, కలల్ని వాస్తవంగా, శత్రువుల్ని
సోదరులుగా మార్చుకోడం లాంటిది.
చాలా పురాతనమైన నమ్మకం, సరికొత్తది
కూడా. ఎప్పటికప్పుడు తనని తాను మరింత
బలపర్చుకుంటూనే ఉంటుంది, పసిపాప మనసు
మొదలుకుని పరమోన్నత తత్త్వం దాకా.
కవిత్వానికి ప్రధాన శత్రువు వాగ్ధాటి. దీన్ని మనం రెటారిక్ అనవచ్చు లేదా affectation అనవచ్చు, sentimentality అనవచ్చు. కాని కవి వక్తగా మారినా, ప్రవక్తగా మారినా కూడా కవి కాకుండా పోతాడు. తన కాలం నాటి రాజకీయ అవసరాలు దృష్టిలో పెట్టుకుని కవిత్వం చెప్పే కవులకి వక్తృత్వ ప్రమాదం ఉంటుంది. తన కాలంలో తన కళ్ళముందు కనిపిస్తున్న సామాజిక, రాజకీయ అవసరాల్ని పట్టించుకోకుండా కాలాతీతమైన విషయాల గురించి మాట్లాడాలనుకునే కవి ప్రవచనకారుడిగా మారిపోతాడు. ఈ రెండు వైరుధ్యాల మధ్యా, తూకం తప్పిపోకుండా కవిత చెప్పడమే కవికి నిజమైన పరీక్ష. ఒక విధంగా కత్తిమీద సాము అది.
ముఖ్యంగా తెలుగు వచన కవిత్వంతో నాకున్న ఇబ్బంది ఇదే. పద్యం ఛందస్సు మీద ఆధారపడింది కాబట్టి వచనకవితని లయమీద ఆధారపడ్డదిగా చూడటం తెలుగు కవులు చేస్తూ వచ్చిన పొరపాటు. లయాత్మక వచనం నిజానికి వక్తృత్వం తప్ప మరేమీ కాదు. లయ చాలావరకూ శబ్దాలంకారాల మీద ఆధారపడుతుంది కాబట్టి ఛందస్సునుంచీ, లయనుంచీ కవిత్వాన్ని బయటపడెయ్యాలనుకుంటే, అర్థాలంకారాలు మాత్రమే శరణ్యమవుతాయి అనిపిస్తుంది, మొదట్లో. కాని తన అనుభూతిని, ఆవేదనని గాఢమైన చింతనగా మార్చుకోగలిగిన కవికి, అసలు ఏ అలంకారాల్తో పనిలేని కావ్యోక్తి సాధ్యం కావడం అసాధ్యం కాదు. అటువంటి సాధన చేసిన కవుల్లో ఎలార్డ్ ఉన్నాడని, ముందు వరసలో ఉన్నాడనీ ఈ కవితలు చదువుతున్నంతసేపూ స్ఫురిస్తూనే ఉంది. ఉదాహరణకి ఈ కవిత చూడండి.
ఇది గాబ్రియెల్ పెరి (1902-41) అనే అతడి మీద రాసిన కవిత. పెరి ఒక పాత్రికేయుడు, రాజకీయవాది. కమ్యూనిస్టు. ఫ్రాన్సుని నాజీలు ఆక్రమించుకోడానికి వ్యతిరేకంగా అతడు రాసిన రాతలకి గాను అతణ్ణి 1941 మే లో అరెస్టు చేసారు, ఆ ఏడాది డిసెంబరులో కాల్చేసారు. తన అభిప్రాయాల్ని ప్రకటించినందుకు మరణించవలసి వచ్చిన ఒక రచయిత మీద రాసిన ఈ కవిత చూడండి:
గాబ్రియేల్ పెరి
జీవితం వైపు విశాలంగా చాచిన
బాహువులు తప్ప మరే రక్షణ కవచంలేని
ఒక మనిషి మరణించాడు.
తుపాకుల్ని ద్వేషించే దారి తప్ప
మరో దారి తెలియనందుకు
ఒక మనిషి మరణించాడు.
చరిత్రవిస్మృతిలోకి నెట్టేసే మృత్యువుతో
ఇంకా పోరాడుతూనే ఉన్నందుకు
ఒక మనిషి మరణించాడు.
అతడేవేవి కోరుకున్నాడో
అవన్నీ మనమూ కోరుకున్నాము
అవన్నీ ఇవాళే కావాలని కోరుకున్నాం
కళ్ళల్లో నెలకొన్న హృదయంలో
వెలిగే సంతోషపు వెలుతురు
ఈ భూమ్మీద ఒకింత న్యాయం.
మనకి బతకడానికి సాయం చేసే పదాలుంటాయి
చాలా మామూలు పదాలు
వెచ్చదనం అలాంటి పదం నమ్మకం అలాంటి పదం
ప్రేమ న్యాయం స్వేచ్ఛ అలాంటి ఒక పదం
శిశువు అలాంటి ఒక పదం, దయ ఒక పదం
కొన్ని పూలపేర్లు కొన్ని పండ్ల పేర్లు
ధైర్యం అనే పదం కనుగొనడం ఒక పదం
అన్నదమ్ముడు అనే పదం కామ్రేడ్ అటువంటి పదం
కొన్ని నేలల పల్లెల పేర్లు
స్త్రీల స్నేహితుల పేర్లు
ఇప్పుడు వాటికి మనం పెరి అనే పదం కూడా చేరుద్దాం
మనకి ప్రాణంపోసే ప్రతిఒక్కదానికోసం
పెరి మరణించాడు
అతణ్ణి మనం స్నేహితుడా అనిపిలుద్దాం
అతడి వక్షం తుపాకిగుళ్ళకు ఛిద్రమైంది
కాని అతడికి నిజంగా మనం కృతజ్ఞులమై ఉండాలి
ఎందుకంటే అతడివల్లనే
మనం ఒకరినొకరం మరింత బాగా అర్థం చేసుకున్నాం
మనం ఒకరినొకరం స్నేహితుడా అని పిలుచుకున్నంతకాలం
అతడి ఆశ సదా బతుకుతూనే ఉంటుంది
ఇలాంటి కవుల్ని చదివాకనే మహాప్రస్థాన గీతాల తర్వాత శ్రీ శ్రీ శబ్దసార్వభౌమత్వం మీద తిరుగుబాటు చేసాడు. అంటే తన భాషాసామ్రాజ్యం మీద తనే తిరుగుబాటు చేసి మామూలు మాటల్లో హృదయావేదన మొత్తం కుమ్మరించగల విద్యకోసం సాధనచేసాడు. తిక్కన్న లాగా, వేమన్నలాగా, గురజాడలాగా. మరో ప్రస్థానం నాటికి ఆ స్థాయికి చేరగలిగాడు.
ఎలార్డ్ కవిత్వం చదువుతుంటే మన ప్రగల్భాలు, పటాటోపాలు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. కవిత్వం ఒకప్పుడు సత్యాన్ని అన్వేషించింది. ఆ తర్వాత సౌందర్యాన్ని అన్వేషించింది. కాని ఆధునిక యుగంలో దయనీ, ప్రేమనీ, హితాన్నీ అన్వేషిస్తున్నది. దాన్ని ఎలార్డ్ the milk of human kindness అన్నాడు. ఆ దయాక్షీరంలో మరేది పడ్డా ఆ పాలు విరిగిపోతాయని అతడికి తెలుసు. అందుకనే అతడి కవిత్వంలో ఉపమ, రూపకం, ప్రతీక, పదచిత్రం ఏవీ కనిపించవు. ముందుమాటలో రాసినట్టుగా, అతడికి ‘సంతోషం ఒక వెలుతురులాంటిది కాదు, దానికదే ఒక వెలుతురు.’ కాబట్టే, ఈ వాక్యాలు అతడి కవిత్వానికి మోటో అని చెప్పుకోవచ్చు:
మనం బతకడానికి సాయం చేసే పదాలుంటాయి
చాలా మామూలు పదాలు.
తెలుగు కమ్యూనిస్టు కవులు ప్రేమనీ, పోరాటాన్నీ విడివిడిగా చూసారు. వాటిమధ్య బలంగా బిగించి పెట్టిన పరదాని శివసాగర్ కొంత వరకూ చింపెయ్యగలిగాడు. కాని ఎవరో ఒకరిని ప్రేమించకుండా, ఒక మనిషినో, ఒక వర్గాన్నో, ఒక జాతినో, ఒక దేశాన్నో, ఒక సత్యాన్నో, ఒక సూత్రాన్నో ప్రేమించకుండా నువ్వు దేనికోసం పోరాడతావు? అందుకనే మాక్స్ అడెరెత్ ఇలా రాస్తున్నాడు:
The theme of brotherhood is an extension of love. Loving a woman and loving his fellow human beings were to Eluard part of the same process of overcoming solitude.
ఎలార్డ్ కి ఈ విషయంలో ఇంత స్పష్టత ఉందని నాకు తెలియడం ఇదేగాని, నేను గత ఇరవై ముప్ఫై ఏళ్ళుగా చెప్తున్నది ఇదే. ప్రాచీన చీనాకవులూ, తమిళసంగం కవులూ చేసింది ఇదే. వాళ్ళు చెప్పిందే ఎలార్డ్ మళ్లా ఎంత మామూలు మాటల్లో చెప్తున్నాడో చూడండి:
We shall not reach the goal one by one but in twos
Knowing each other in twos we shall all know one another
We shall all love one another and our children will laugh
At the somber legend in which a lonely man is weeping
ఆ క్షణం, కవి చెప్పినట్లుగా ‘బాధలన్నీ పాతగాథలై’ పోయే క్షణం ఒక్కరూ తనలో తాను కుములుతుంటే వచ్చేదికాదు, మరొకరితో కలవాలి. కలిసి నడవాలి, నమ్మాలి, నమ్మకాల్ని నిజంచేసుకోడానికి కలిసి పోరాడాలి.
19-02-2024


మీరు చెప్పింది నిజం. రాజకీయ కవిత్వం వచనమై తేలిపోతుంది. దాన్ని కవిత్వం చెయ్యడం కష్టం. కొన్ని భ్రమలు తొలగి, నా అవగాహన విస్తృతమైంది. కవిత్వమనే బ్రహ్మ పదార్థం ఇంకొంచెం అర్థమైంది. ధన్యవాదాలు🙏
ధన్యవాదాలు సార్