బసవన్న వచనాలు-21

261

గోడలేని చిత్తరువులాగా
భక్తిలేని
ప్రమథుడివలె
ఎప్పుడుండగలను?

సత్యంలేని
శరణునివలె
ఎప్పుడుండగలను?

కొలతల్లేని
తూకంతో
అప్పిచ్చిన
వ్యాపారిలాగా
ఉన్నానయ్యా
కూడలసంగమదేవా! (940)

262

లభించిన
అనుగ్రహం
ఆయతం.

అది ఏదో
ఒక పద్ధతిలోనే
తెలిసేది కాదు.

కాబట్టి
చూడవద్దు
చూపించవద్దు.

కూడల సంగని
భక్తి
దిద్దలేని
డొంక. (941)

ఐక్యుని మాహేశ్వర స్థలం

263

దశదిశలూ
ధరాగగనాలూ
నాకు తెలియవు.

‘లింగమధ్యే
జగత్స్వర్వం’
అన్నది కూడా
నాకు తెలియదు.

దైవం తాకిన సుఖమనే
సముద్రంలో పడ్డ
వడగళ్ళలాగా
భేదభావంలేక

కూడలసంగయ్యా
శివశివా
అంటున్నానయ్యా! (943)

ఐక్యుని ప్రసాది స్థలము

264

మిథ్యని అణచివేసాక
మిగిలిన
సత్యప్రసాది.

రంజనం లేని
నిరంజన ప్రసాది.

దుఃఖాన్ని అణచిన
ఘనానంద ప్రసాది.

అనిత్యంలేని
నిత్యప్రసాది.

ఖండితంకాని
అఖండిత ప్రసాది.

కూడలసంగమదేవునిలో
తానే
ప్రసాది. (944)

265

వెలుగులోపలి వెలుగు
మహావెలుగు
ప్రసాదంలో
పర్యవసించిన
ప్రసాది.

అతడి
పరమానందాన్ని
దేనితో
పోల్చేది?

పరమాశ్రయమే తానై
కూడలసంగమదేవా
చెన్నబసవడనే
మహాప్రసాది
మాటకీ, మనసుకీ
అతీతుడైపోయాక
నేనేమనగలనయ్యా! (946)

266

దొరికింది
భంగమైంది.
సంపాదించుకున్నదీ
భంగమైంది.

ఆయతమేమో
తెలియదు.
స్వాయతమేమో
తెలియదు.

అన్నిచోట్లా
కూడలసంగమదేవుడే
ఉన్నాడు
కాబట్టి

భావంలో
వ్రతం
చెడింది

ఆ భావంలో
జీవం కూడా
లుప్తమయ్యింది. (947)

267

తనకే
స్వయంగా
దైవంతో అనుభావం
దొరికాక

ఇంకా
దేవలోకమేమిటి?
మర్త్యలోకమేమిటి?

వాటిల్లో
మళ్ళా
తేడా ఏమిటి?

కూడలసంగమదేవా
ఇంకా
ఆలస్యమేమిటి? (948)

268

ఏమనగలను
ఏమనగలను
ఒకటే
రెండైనదాన్ని.

ఏమనగలను
ఏమనగలను
రెండు
ఒకటైన దాన్ని.

ఏమనగలను
ఏమనగలను
ఆ మహా
మహిమని?

తనెవరో
మహాదాత
కూడలసంగమయ్యకే
ఎరుక. (949)

ఐక్యుని శరణస్థలము

269

పుట్టకి
ఎన్ని నోళ్ళుంటే
ఏమిటి?

పాము
ఉండేదొక్కచోటే.

భావాన్ని
భావించి
భ్రమని
దాటి చూడు.

భావాన్ని
భావిస్తే
కూడలసంగమదేవా
మిగిలేది
నిర్భావం. (953)

270

వేదాలకు
ఆవలివాడు.

ఆరురంగులు
అంటనివాడు.

ముప్ఫై ఎనిమిది
కళలకి
అందనివాడు.

ఆకాశలోకాన్ని
దాటినవాడు

మా కూడల
సంగమదేవుడు. (955)

271

విశ్వాన్ని
జయించినవాడు.
దూరాన్ని
ఛేదించినవాడు.
సర్వం
జయించినవాడు.

ఇంద్రుణ్ణి
జయించినవాడు.
మనుషుల్ని
జయించినవాడు.
భూమిని
జయించినవాడు.
అశ్వాల్ని
జయించినవాడు
తనని తాను
జయించినవాడు.

చక్కగా
బోధపడేవాడు
వేదానికీ
నాదానికీ
ఆవలివాడు.
తురీయ
పరమానందుడు.

కోటిసూర్యుల
సహస్రకిరణాల
అగ్రపటల
ప్రభలపై
వెలుగొందుతున్నాడు
కూడలసంగముడు. (956)

272

వెయ్యి శిరసులవాడు
ఆదిపురుషుడు ఒక్కడు.
వేదపురుషుడు ఒక్క పురుషుడు.
మూడుపాదాలుచాపినవాడు
ఒక పురుషుడు.
పైకి చూస్తున్నవాడు
ఒక పురుషుడు
ఉదయిస్తున్నవాడు
ఒక పురుషుడు.
లోకమంతా
ఆవరించినవాడు
ఒక పురుషుడు
మొదటిపురుషుడు
ఒక పురుషుడు
ఆకాశాన్ని ఆవరించినవాడు
ఒక పురుషుడు.

ఆపైన మరే పురుషులూ లేని
ప్రభని చూడండి.
వేదనాదాతీత
తురీయపరమానంద
నిరవయ
షట్ త్రింశత్ ప్రభాపటలపు
వెలుగు ఇదే చూడండి.

వెలుగులోపలి
మహావెలుగులోపలి
వెలుగు
కూడల సంగయ్య. (957)

273

ఘనగంభీర
మహాఘనఘనానికి
ఘనంగా
ఉన్నానయ్యా!

కూడలసంగమదేవయ్య
అనే
మహావెలుగులోపలి
వెలుగులో
ఉన్నానయ్యా!

మాటలు
మూగబోతున్నాక
మరేమి
చెప్పగలనయ్యా? (959)

274

చీకటి మొత్తం
తన మసక
దాటి పొయ్యే
చోటు చూడు.

వెలుగుకు
వెలుగు
సింహాసనమై
అమరింది.

వెలుగు
వెలుగుని
కూడుకున్న
కూటమి

కూడలసంగయ్యకి
మాత్రమే
తెలిసిన
ముచ్చట. (960)

275

అంతరంగం
బహిరంగం
ఆత్మసంగం
ఒకటేనయ్యా!

నాదబిందు
కళాతీతుడివి
ఆది ఆధారానివి
నువ్వేనయ్యా!

శిఖరాగ్రమ్మీద
కలయిక
కూడలసంగయ్యకే
తెలిసిన
సుఖం. (961)

14-12-2023

4 Replies to “బసవన్న వచనాలు-21”

  1. వేదనాదాతీత
    తురీయపరమానంద
    నిరవయ
    షట్ త్రింశత్ ప్రభాపటలపు
    వెలుగు🙏

  2. వెలుగు లోపలి వెలుగు
    మహావెలుగు
    ప్రబోధి🌞చిన
    వేళ

    మా
    పరమానందాన్ని
    దేనితో
    పోల్చేది?

    పరమాశ్రయమే తానై
    కుాడలసమగమదేవా
    చిన్న వీరభద్రుడనే
    మహా ప్రసాది
    మాటల(Words)కీ,
    చేతుల(Actions)కీ
    అతీతులమైపోయాక
    మేమేమనగలమయ్య🙏

    ఇంక మీదట
    నీతోనే మా మనుగడ
    అనగలమయ్య🙏🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading