బసవన్న వచనాలు-20

246

దెయ్యం పట్టినవాడి వస్త్రం
సాత్త్వికుడు కట్టుకుంటే
దెయ్యం పట్టినవాడు
సాత్త్వికుడయ్యాడు
సాత్త్వికుడు
దెయ్యం పట్టినవాడయ్యాడు.

ఈ మాట
రాజవీథిలో వినబడింది.

అయ్యా!
వదలగొడదామా
అంటే దెయ్యం లేదు.
పట్టుకుందామా అంటే
మాట లేదు.

ప్రేమించి
కూడడమెలానో
కూడలసంగముడికే
తెలుసు. (911)

శరణుని ఐక్యస్థలము

247

సత్యమిదే
సమాధానమిదే
కాని
మనసుకి
పట్టదేమయ్యా?

సర్వసమ్మత
సుఖమిదే.
కాని
మనసుకు
సోకదేమయ్యా?

నేనూ
నువ్వూ
ఒకటనే

ఘనత

కూడలసంగమదేవా
వట్టి
భ్రమేనా? (913)

248

పూజ ఉన్నంతవరకు
దైవం గురించి పాడాను

మాట ఉన్నంతవరకు
జంగముని గురించి పాడాను.

జిహ్వ ఉన్నంతవరకు
ప్రసాదాన్ని కోరుకున్నాను.

ఈ మూడూ
లేకపోయాక
కూడలసంగమదేవా
నా గురించి
నేనే పాడుకున్నాను (917)

249

అనాయాసంగా
ఇల్లు కట్టుకుని
నిరాయాసంగా
పరమసంతోషి.

రూపుచూద్దామంటే
రూపాధికుడు
చూసేటప్పుడు
చూపు గొప్పది.

సహజసంగి
ఉండే పద్ధతి
ఇలాంటిది.

కూడలసంగముడి
మనుషుల స్థితి
నీటిలో బిందువూ
ఉదయరత్నమూను. (917)

250

అవరోధం లేని నడత
అవరోధం లేని నుడి.

అవరోధం లేని
సంభాషణాసుఖం.
అవరోధంలేని
స్వానుభవసుఖం.

అవరోధం లేని మహిమ
కూడలసంగమదేవా!

నీ శరణులది
అవరోధంలేని చింతన. (920)

ఐక్యస్థలం

251

రక్కసి ఇంట్లో భోజనం చేసి
విన్నవాళ్ళకి
తృప్తి కలిగిందని
చెప్పాను.

నీటిచేతుల్లో
నిప్పుకణికలుంచినట్టు
సాయుజ్యపదవి
వాళ్ళకెలా తెలుస్తుంది?

మహాదాత
కూడలసంగన
సమరససుఖం
వాళ్ళకెలా తెలుస్తుంది? (923)

252

దేవలోకమూ
మర్త్యలోకమూ
అనే సరిహద్దు
ఉన్నంతదాకా
ఎవరైనా పూర్తిగా
శరణుడెట్లా కాగలడు?

చచ్చాక కలుస్తానంటే
కూడలసంగమదేవా
చెరకువెన్ను
నమిలినట్టే. (925)

253

ఏదైనా
సాధించవచ్చు.
ఇంకేదైనా
సాధించవచ్చు.

తానెవరో
తెలుసుకోవడం
మాత్రం
సాధ్యం కాదు

కూడలసంగమదేవుని
కరుణకలిగినవాడికి
తప్ప. (927)

254

జీవాత్మ, అంతరాత్మల
సంగతి అడిగితే
ఒక మాట చెప్తాను
విను.

అసత్యం సంకెళ్ళలో
తగులుకుని
కాచుకు కూచున్నాడొకడు

కథను కలగా చేసి
చెప్తున్నాడొకడు

పరాత్పరాలకు పోయి
పరమాత్ముడి
వార్త తెస్తున్నవాడొకడు
వాళ్ళిద్దర్నీ
తొక్కుకుంటూ
పోతుంటే

కూడలసంగమదేవా
లోకం
నిశ్చేష్టమైపోయింది. (928)

255

సమానప్రేమ
సమానకళ
సమాన సంతోషం

గురువు ఉన్నవాళ్ళ
అనుభవం
ఇలా ఉంటుంది.

అది ఎక్కువా
తక్కువా
అన్న ప్రశ్న
గురువులేని వాళ్ళది.

వాళ్ళు
కూడలసంగమదేవా!
రాళ్ళని
పరీక్షించేరకం. (929)

256

గురువుకీ
శిష్యుడికీ
మధ్య అనుబంధం
కలిగిందనడానికి
ఇదే గుర్తు.

వెనకటిది
వదిలిపెట్టాలి.
ముందు రానున్నది
పట్టుకోవాలి.

అది నిప్పులో
కట్టెని
దాచిపెట్టినట్టుండాలి.

కూడలసంగయ్యా
వినవయ్యా. (930)

257

లింగాన్ని
పూజించి
ఫలమేమిటి?

సమానప్రేమ
సమానకళ
సమానసంతోషం
కలగనంతదాకా

లింగాన్ని
పూజించి
ఫలమేమిటి?

కూడలసంగమదేవుణ్ణి
పూజిస్తే
నది నదిలో
కలిసిపోయినట్లుండాలి. (931)

ఐక్యుని ఐక్యస్థలం

258

లింగార్చన చేసే
మహాత్ములంతా
చనువుగా
లోపలకి వెళ్ళారు.

దేవా, నేను
వెలివాణ్ణి.

అసుంట, అసుంట
అనుకుంటో
దూరంగా
ఉండిపోయాను.

కూడలసంగమదేవా
నీ నామాన్ని
నమ్ముకున్న
అనామకుణ్ణి నేను. (935)

ఐక్యుని భక్తస్థలం

259

భక్తుడైతే
భక్తితో దాసోహం.

యుక్తుడైతే
యుక్తితో
దాసోహం.

ఐక్యుడైతే
మమకారం
దాసోహం.

అన్నిచోట్లా
కావలసింది
దాసోహమే.

ఈ దాసోహం
ఎలా చెయ్యాలో
ఆ సులువు
కూడలసంగయ్యకి
మటుకే తెలుసు. (937)

260

వేడుకుంటామంటారు
అందరూ

ఒక్కటి మాత్రం
వేడుకోడం
మర్చిపోతారు.

మర్త్యలోకగణాలు
ఒక్కటి మాత్రం
వేడుకోడం
మర్చిపోతారు.

కూడలసంగమదేవా
నన్ను
వేడుకోడం
మర్చిపోతారు. (939)

13-12-2023

6 Replies to “బసవన్న వచనాలు-20”

  1. నీటిచేతుల్లో
    నిప్పుకణికలుంచినట్టు
    సాయుజ్యపదవి
    వాళ్ళకెలా తెలుస్తుంది?
    ఆణి ముత్యాలవంటివి
    బసవ వచనాలు
    వాటి నిగ్గుదేలుస్తున్నాయి
    మీ అనువచనాలు

    భక్తి పారమ్యతను స్ఫటికపట్టకంలో వర్ణవిశ్లేషణ చేసినట్లుంది.

  2. గురువుగారు 256 వచనము అర్థము చేసుకున్నటకు మాకు గల IQ & EQ సామర్థ్యము సరిపోవడం లేదు గనుక కాస్త విశ్లేషించగాలరుని ఆశిస్తున్నాము 🙏

    1. ఏ ఆధ్యాత్మిక సాధన అయినా మొదట చేయవలసింది గతాన్ని పూర్తిగా వదిలిపెట్టడం. గతం తాలూకు అవశేషాలు, ముద్రలు మనసులో లేకుండా చూసుకోవడం. అప్పుడు మాత్రమే గురువుద్వారా అందే అనుగ్రహం మనకి నిరాటంకంగా అందుతుంది. నిప్పులో పెట్టిన కట్టెలాగా కట్టె రూపం ఇంక మిగలదు. అది పూర్తిగా నిప్పుగా మారిపోతుంది. ఆధ్యాత్మిక అనుభవం కూడా అటువంటిదే.

  3. కట్టే మండాలి అంటే ముందు ఎండాలి అంటారు.. 🛐

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading