బసవన్న వచనాలు-15

171

మెలకువగా ఉన్నప్పుడుగాని
కలలోగాని, నిద్రలో గాని
నిన్ను కాక మరొకర్ని తలుచుకున్నానా
తల నరుక్కుంటాను.

అబద్ధమాడానా
తలనరుక్కుంటాను.
తలనరుక్కుంటాను.

కూడలసంగమదేవా
నిన్ను కాక మరొకర్ని తలుచుకున్నానా
తలనరుక్కుంటాను
తలనరుక్కుంటాను (694)

172

సుఖం కలిగిందా
పుణ్యం ఫలించింది అనను.
దుఃఖం కలిగిందా
పాపం ఫలించింది అనను.

ఇదంతా నువ్వు చేసిందే
అని అనను
చేసినపనులకు చేసినవాడే
బాధ్యుడనీ అనను.

ఉదాసీనంగా
నువ్వే నా గతి అనను.

కూడలసంగమదేవా
నువ్వు నాకు చెప్పిన
ఈ ఉపదేశం ఊతంగా
జీవితమంతా జీవిస్తాను. (695)

173

కాయం పెట్టే కలతలకు జంకి
కాపాడయ్యా అనను.
జీవితమెట్లా గడుస్తుందోనని వెరచి
ఇవ్వండయ్యా అనను.

యద్భావం తద్భవతి.

మంటలు మండనీ,
సంపదలు కురవనీ
‘వద్దు, వద్దు’ అని
అననే అనను.

నిన్ను కోరను
నరుల్ని వేడను.

కూడలసంగమదేవా
నీమీద ఆన. (696)

174

రేపు వచ్చేదేదో
నేడే రానీ.
నేడు వచ్చేదేదో
ఇప్పుడే రానీ.

బెదిరేదెవరు?
అదిరే దెవరు?

జాతస్యమరణం ధ్రువం
అన్నారు కాబట్టి

కూడలసంగమదేవుడు
రాసిన రాత తప్పించడం
హరిబ్రహ్మాదుల తరం కూడా కాదు. (697)

175

నువ్వు దొంగతనానికి బయల్దేరావా
నీకన్నా ముందే పనిముట్లు పట్టుకెళ్తాను.
నిన్ను పట్టుకున్నారా
నీకన్నా ఒక అడుగు నీ ముందే నడుస్తాను.

మనస్సులో సంకోచించానా
భయపడ్డానా
నీ మీద ఆన
పురాతనుల మీద ఆన.

నా స్వామి చేసే పనులు
సరైన పనులు కావంటే
కూడలసంగమదేవా
నేను బంటుగా తప్పినట్టే. (698)

176

ఇన్ని జొన్నల కోసం
పనిచేసేవాణ్ణి కాను.
తరతరాలుగా
నీ బంటుని.

పనిపాడుచేసి
పారిపోయే కూలినిగాను.

వినవయ్యా
కూడలసంగయ్యా!

మరణమంటే
నాకు పెద్దపండుగ. (699)

177

ఓ సోగ్గాడా, వినవయ్యా!
నీ ఒక్కడికోసమే నేను
మగవేషం కట్టాను.

మరొకసారికి
పురుషుణ్ణి.
మరొకసారికి
తరుణిని.

కూడలసంగమదేవా!
నీకు వీరుణ్ణి.
నీ శరణులకి
వధువుని. (704)

మాహేశ్వరుని భక్తస్థలము

178

సంపదలు నాశనం చేసి
సమస్తం అల్లకల్లోలం చెయ్యనీ
నాకు పుట్టిన బిడ్డల్ని
నవఖండాలుగా నరికి పోగులుపెట్టనీ
నా కాంతని నా కళ్ళముందే చెరచనీ
నామీద పడి నన్ను తుత్తునియలు చెయ్యనీ
శూలానికెత్తనీ

అయినా మళ్ళీ మళ్ళీ
నిన్ను పూజిస్తూనే ఉంటాను.
నీ మనుషుల్ని పూజిస్తూనే ఉంటాను.
నీ అనుగ్రహానికి దూరం కాలేను.

నా మాట ఏమాత్రం తప్పినా
కూడలసంగమదేవా
నన్నిప్పుడే శిక్షించు. (706)

179

పొద్దున్నే లేచి కళ్ళు నులుపుకుంటూ
కూడూ గుడ్డకోసం
భార్యాబిడ్డలకోసం
అలమటించానా?
నా మనసే నాకు సాక్షి.

‘ఆసనే శయనే యానే సంపర్కే సహభోజనే
సంచరంతి మహాఘోరే నరకే కాలమక్షయం’
అంటో శ్రుతిని చదువుతున్నాడయ్యా!
లౌకికుడైన బిజ్జలుడిగద్దె దగ్గర కూచుని
అతణ్ణి కొలుస్తున్నాడయ్యా!
అంటారు ప్రమథులు.

వాళ్ళకి జవాబివ్వలేనా?
ఇవ్వగలను.

మాలల ఇంటివాకిటచేరి
కాయకష్టం చేసైనా
నీ కోసం తపిస్తానుగానీ
ఈ మేనికోసం తపించానా
నా తలనరుక్కుంటానయ్యా
కూడలసంగయ్యా! (711)

180

అన్న, తమ్ముడు, తండ్రి
సగోత్రు లైతే ఏమిటి?
నీ సాంగత్యం లేనివాళ్ళని
నా వాళ్ళనుకోలేను.

కూడలసంగమదేవా
బంధుప్రీతి
మామూలు నరకం కాదు. (714)

181

యజమాని లేని ఇంట్లో
వీథికుక్క పడ్డట్టు
నువ్వు లేని చోటికి
నేను పోలేనయ్యా
సంగయ్యా!

కుక్కమాసం తినేవాళ్ళైనా
నువ్వక్కడున్నావా
వాళ్ళదే
నిజమైన పుటక. (715)

182

వాడు దొంగ, బందిపోటు, ఆమె పతిత,
వాడు పాములుపట్టేవాడు
వాడు దొమ్మరోడు, ఆకులు ఏరుకునేవాడు
వాడు బంటు అనిగాని ఎంచితే
వస్తున్న నీ భక్తులంతా
నువ్వే అని అనకపోతే
అంతకు మించి ద్రోహం లేదు.

నా మాటలో చేతలో
నేను తప్పితే
చెన్నబసవన్న
మీద ఆన. (719)

183

ఎడమచేతిలో కత్తి
కుడిచేతిలో మాంసం
నోట్లో కల్లుముంత
మెడలో శివుడున్నాడా

వాళ్ళనే లింగమంటాను
సంగడంటాను.

కూడలసంగమదేవా
వాళ్ళే దేవుడిముఖమంటాను (720)

184

సమచిత్తం అనే నియమం డాలుగా
శివచిత్తమనే కత్తి ఎత్తి
శరణులకు మొక్కడమనే
సామునేర్చుకుంటే
బంటుతనం పండుతుంది.

ప్రతియోధుడైన జంగముడు
ఇంటికొచ్చినప్పుడు
ఎదురేగినడవడమే
కూడలసంగమదేవుణ్ణి
మెప్పించినట్టు సాక్ష్యం. (726)

మాహేశ్వరుని ప్రసాది స్థాలం

185

వీరుడయ్యాక మళ్ళా సాముతో పనేమిటి
దాసుడయ్యాక మళ్లా ప్రాణాలమీద తీపేమిటి
భక్తుడయ్యాక తనుమనధనాలపట్ల ఆశదేనికి?

మీ ఆదేశాలకు, హెచ్చరికలకు
జంకానా
కూడలసంగమదేవా
నా లెంకతనానికే హాని. (729)

8-12-2023

6 Replies to “బసవన్న వచనాలు-15”

  1. కుాడలసమగమదేవ🔱
    నీకు యజమానుని
    నీ జ్ఞానముకు
    బానిసను 🛐

  2. నేనెక్కడికో వెళ్లి కుటీరంలో బ్రతికే అవసరం లేకుండా ఇవి చదువుకుంటూ ఎక్కడ ఉన్నా నాకు సాధన లాగా ఉంటుంది

  3. సరళానుక్రియ. మనసు దగ్గరగా చేర్చే మాట. ఎంత దట్టంగా మనసుకు పట్టించుకుంటేనో గాని ఇలాంటి వాక్యాలు వెలువడవు. మీరు ధన్యులు. మమ్మల్ని కూడా ధన్యుల్ని చేస్తున్నారు.
    172 వ వచనం అలవడటం కష్టం . కానీ అలవడితే మాత్రం సుఖం

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading