బసవన్న వచనాలు-14

లూకా సువార్తలో మేరీ, మార్తా అనే అక్కచెల్లెళ్ళ కథ ఉంది. ఇద్దరికీ క్రీస్తు అంటే ప్రేమ, ఆయన కోసం ఎదురుచూస్తుంటారు. కాని ప్రభువు వచ్చినప్పుడు ఆయనకీ, ఆయన పరివారానికీ రొట్టెలు తయారుచేయడంలో, గిన్నెలు కడగడంలో, వాళ్ళు బసచేయడానికి ఏర్పాట్లు చూడటంలో మార్తా నిమగ్నురాలైపోతే, మేరీ తక్కిన పనులన్నీ పక్కనపెట్టి ఆయనతో సంభాషిస్తో కూచుంటుంది. యుగాలుగా క్రైస్తవ సాధువులు అయితే మార్తాగానో లేదా మేరీగానూ ఉంటూ వచ్చారు. కొందరు భగవంతుడికి సేవచెయ్యడం, భగవంతుడి పేరుమీద తోటిమనుషులకి సేవ చెయ్యడం ముఖ్యం అనుకున్నారు. కొందరు పనులన్నీ పక్కనపెట్టి భగవంతుడితో సంభాషించడమే ముఖ్యమనుకున్నారు. అంటే కొందరు కార్యశీలురు, కొందరు ధ్యానశీలురు అన్నమాటా. కాని అవిలాకు చెందిన స్పానిష్ సన్న్యాసిని తెరేసా ఈ విభజనని తుడిచిపెట్టేసింది అని రాసాడొక బోధకుడు.

క్రైస్తవ మిస్టిక్కులలో అగస్టైన్ సాధువు తర్వాత గుర్తొచ్చేది తెరేసమ్మ పేరే. ఆమె భగవంతుడికి ఎంత చేరువగా గడిపిందో, తోటిమనిషికి కూడా అంతే దగ్గరగా గడిపింది. తన జీవితకాలంలో భగవంతుడి సందేశాన్నీ, ప్రేమనీ మనుషులకు అందించడానికి ఆమె అహర్నిశలు పనిచేసింది. అంతేకాదు, ఆమె రచయిత, కవి కూడా. తన ఆధ్యాత్మిక అనుభవాల్ని ఆత్మకథగా, డైరీగా, ఉత్తరాల రూపంలో, మరెన్నో రచనలుగా ఆమె పంచుకుంది.

ఇప్పుడు ఆమెని ఎందుకు తలుచుకుంటున్నానంటే, Thus Spake Basava (1965) పేరిట బసవన్న వచనాలు కొన్నింటిని ఇంగ్లిషులోకి అనువదించిన ఇద్దరు పండితులు బసవన్నకీ, థెరేసమ్మకీ మధ్య పోలికలు చూసారు. ఆ పోలిక నన్ను ఆశ్చర్యపరచడమేకాక, సంతోషపరిచింది కూడా. పనికీ, ప్రేమకీ మధ్య ఉండే హద్దులు తుడిచెయ్యడం వల్లమాత్రమే కాదు, ఇద్దరిలోనూ కనవచ్చే మరొక గుణం కూడా ఉంది. ఇద్దరూ కూడా భగవత్సేవకుల్ని ఎక్కువచేసి, తమని తాము తక్కువచేసుకోవడంలో ముందుండేవారని కూడా చెప్పవచ్చు.

మనకి కూడా భక్తి, జ్ఞాన, కర్మ, వైరాగ్య యోగాలని ఉన్నాయి. ఉదాహరణకి మనం గాంధీగారిని కర్మయోగిగా చెప్పుకుంటాం, రమణమహర్షిని జ్ఞానయోగిగానూ, రామకృష్ణపరమహంసని భక్తియోగిగానూ చెప్పుకుంటాం. కాని గాంధీగారి జీవితంలో భక్తికి ఉన్న స్థానాన్ని తక్కువ చెయ్యగలమా? ‘ప్రార్థన లేకపోయుంటే నేను ఉన్మాదినై ఉండేవాణ్ణి’ అని రాసుకున్నారు ఆయన ఒకచోట. అలాగే రమణులు కర్మయోగి కారని చెప్పగలమా? ఆయన దినచర్య మొదలవడమే ఆశ్రమంలోని వంటశాలలో పొయ్యి వెలిగించడంతో మొదలయ్యేదట.

అలాగని కర్మయోగం గొప్పదని భగవంతుడితో జీవించగల తక్కువ మార్గాలు తక్కువని అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. తెరేసమ్మనే ఒక చోట ఇట్ల రాసుకుంది:

In regular prayer we are taking the lead with God’s help. In perfect contemplation, God does everything. It is not easy to explain.

కన్నడ వచన కవుల్లో అల్లమప్రభువు పూర్తి ఆధ్యాత్మిక అనుభవాన్నీ, చెన్నబసవన్న షట్-స్థల ప్రయాణం గురించీ రాస్తే, బసవన్నలో సామాజిక అవ్యవస్థ మీద ఆగ్రహం ప్రకటించడం ముఖ్యంగా కనిపిస్తుందని కూడా కొందరు రాసారు. కాని అది కూడా ఆయన కవిత్వాన్ని పాక్షికంగా చూడటమే. కబీరును సామాజిక సంస్కర్త అనడం ఎలానో బసవన్న సామాజిక అసమ్మతి కారుడు అనడం కూడా అలానే. ఇద్దరిలోనూ కూడా భగవంతుడి అనుగ్రహాన్ని మైమరచి పాడుకోవడం కనిపిస్తుంది. ‘శివసుఖం’ అని అన్నాడు ఒక వచనకారుడు దాన్ని. ఆ శివసుఖం గురించిన ప్రత్యక్ష అనుభూతి, బసవన్న మాటల్లో ‘అనుభావం’ లేకపోయుంటే, ఆయన కేవలం ఒక సామాజిక అసమ్మతికారుడు మాత్రమే అయి ఉంటే, నా మటుకూ నాకు బసవన్న నన్నిట్లా అయస్కాంతంలాగా పట్టుకుని ఉండేవాడు కాడు.


156

మారి మసని అంటూ వేరే లేవు
చూడండి.

మారి అంటే ఏమిటి?
కళ్ళుమూసుకుపోతే మారి.
నోరు జారి మాటాడితే మారి.

కూడలసంగముడి తలపు
మర్చిపోతే మారి. (630)

157

గజారోహణాల వెంటపడ్డారు మీరు
అశ్వారోహణాల వెంటపడ్డారు మీరు
కస్తూరీ కుంకుమా
పూసుకు తిరిగారు మీరు.

అన్నలారా!
సత్యమెక్కడుందో
తెలుసుకోలేకపోయారే
అహంకారమనే మదగజాన్నెక్కి
విధితోద్రోపులు తప్పించుకోలేకపోయారే!

మన కూడలసంగమదేవుణ్ణి
తెలుసుకోకుండా
నరకానికి పోయారే
మీరంతా!

158

ప్రభువులు తమ ఇంటికి తీసుకుపోయినప్పుడు
వారి స్త్రీలని దొంగచూపులు చూడకు.

చూడన్నా!
పెళ్ళైన స్త్రీలతో సరసాలు తగవు
నువ్వు తిన్నది తలకెక్కి
రాణివాసంతో సరసమాడకు.

కూడలసంగముడు
బహునిర్దయుడు. (641)

159

పరికించకు
పలకరించకు
పరస్త్రీల దగ్గరకు పోకు

గొర్రె వెనకపడ్డ
కుక్కలాగా పరుగెత్తకు

ఒక్క ఆశకు
కూడలసంగముడు
వెయ్యేళ్ళు నరకంలో
ముంచేస్తాడు (642)

160

మాటల్లో మేల్కొని
చేతల్లో తప్పితే
అరచేతిలో లింగమే
మహాసర్పమవుతుంది.

ఊరికే మాట్లాడొద్దు
నడవడి తప్పొద్దు.
దైవమే ప్రమాణం

పేదవానికోపం
పెదవికిచేటుతెచ్చినట్టు
నీ చేతలనుంచి
నువ్వు తప్పించుకోలేవు

చూడయ్యా
కూడలసంగయ్యా. (646)

161

మిమ్మల్ని
నమ్మీ నమ్మని
డాంబికులకి,

పాపికి
భక్తి రమ్మంటే
వస్తుందా?

కూడలసంగమదేవా!

కుక్కకి
కొబ్బరికాయ
అరుగుతుందా? (649)

162

కోపిష్టివాడు అభిషేకం చేస్తే
అది రక్తపుధార.
పాపిష్టివాడు పూలతో పూజిస్తే
అది చురకత్తిపోటు.

నిజమైన కూర్మికలవాళ్ళని
ఎవరినీ చూడలేదు
ఒక్క మాదిగ చెన్నయ్యని తప్ప.
నిజమైన కూర్మికలవారిని
ఎవరినీ చూడలేదు
ఒక్క డొక్కల కక్కయ్యను తప్ప.

నిజంగా పనిచేసేవాడంటూ ఉంటే
అది మా మడివాలు మాచయ్య.

నిన్ను ఆపదల్లో కాచేవారు
వీరేనయ్యా
కూడలసంగయ్యా (650)

163

గురువులు చెప్పే మాట
మంత్రవైద్యం.

జంగములు చెప్పే మాట
శస్త్రవైద్యం.

బతుకు జ్వరం తగ్గే
మార్గం తెలుసుకోండి.

శరణుల అనుభావం
మడివాలు కాయకం. (654)

164

భ్రమలు తొలగినవాడికే
శివచింత, శివజ్ఞానం.

కూడలసంగమదేవుని
మనసా పూజించినవాళ్ళకి తప్ప

తక్కిన వాళ్ల
ఆచారం, శివాచారం
వాళ్ళనే దోచేస్తాయి. (656)

165

కుక్కమాంసం తినేవాడైతే ఏమిటి
శివభక్తుడైతే కులంలో పుట్టినట్టే

నమ్మీ నమ్మనివాడు సందేహి.
చూడు, కడితే ఏమిటి
ముడితే ఏమిటి? పూస్తే ఏమిటి?
మనసుతో ముట్టనంతదాకా?

భావశుద్ధి లేకపోతే
భక్తి పట్టుపడదు.

కూడలసంగమదేవుడు
ఇష్టపడితే తప్ప పట్టుపడదు. (657)

166

చూలు కావటమే
తేలుకి తుది.

గెలవెయ్యడమే
అరటికి తుది.

పోరున వెన్నివ్వడమే
భటునికి తుది.

కూడల సంగమదేవా!

మనసు చెదరడమే
భక్తునికి తుది. (665)

167

జంబూద్వీప నవఖండ పృథ్విలో
వినండయ్యా
ఉన్నవి రెండే మాటలు:

కూలుస్తాను అనే మాట
దేవుడిది
గెలుస్తాను అనే మాట
భక్తుడిది.

సత్యమనే కత్తి దూసి
సద్భక్తులు గెలుచుకున్నారు
కూడలసంగమదేవుని. (678)

168

శివభక్తుడై
తనని పట్టుకోబోతే
మన్ను చేస్తాడు
మసి చేస్తాడు
నుగ్గు చేస్తాడు
నుసి చేస్తాడు.

అయినా ఆ సంగయ్యనే
నమ్ముకున్నావా
చివరికి నిన్ను
తనంతవాణ్ణి చేస్తాడు. (686)

169

మనసున మనసై
ధనమున ధనమై
నువ్వు ప్రేమించిన ప్రేమ
అచ్చొత్తినట్టుండాలి.

ప్రాణానికి ప్రాణమైనా
శుభసూచనలు ఒకటి కానప్పుడు
ప్రేమ తీరం చేరుతుందా?

తల తెగిపడనీ
పేగులు కుప్పకూలనీ
సమస్తవస్తుసంపద నశించనీ

మనసు, బుద్ది, చిత్తలతో
ప్రేమ ఒకటై విడిపోకపోతే
అప్పుడు మెచ్చుతాడు
మన కూడలసంగముడు. (691)

మాహేశ్వరుని మాహేశ్వర స్థలము

170

నన్ను ఎండగట్టి అస్థిపంజరం చేసినా
ప్రాణాలున్నంతవరకూ
నిన్ను తలుచుకోడం మానలేను.

శరణు, శరణు అనడం
విడిచిపెట్టలేను.

కూడలసంగమయ్యా
నువ్వు నా శవం మీద
కంచం పెట్టుకుని భోంచేసినా
నిన్ను వదల్లేను
వదులుకోలేను. (693)

6-12-2023

2 Replies to “బసవన్న వచనాలు-14”

  1. కుక్కకి కొబ్బరికాయ అరుగుతుందా!
    డాంబికులకి భక్తి అభుతుందా ?
    🙏👌👌👌👌👌🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading