
ఏదైనా కవిత్వం మనకి నచ్చినప్పుడు ఎందుకు నచ్చిందో వివరించడానికి లక్షణ గ్రంథాలు పూర్తిగా పనిచెయ్యవు. నిజానికి కవిత్వం పుట్టి లక్షణ శాస్త్రాలు తర్వాత పుట్టాయి. కాబట్టే అవి కవిత్వ లక్షణాల్ని ఇప్పటికీ పూర్తిగా వివరించలేకపోతున్నాయి.
ఎవరి కవిత్వమేనా మనకి నచ్చినప్పుడు మనం స్పష్టంగా విశ్లేషించలేని అంశాలు రెండుంటాయి. ఒకటి, ఆ కవిదే అయిన అద్వితీయ వాక్కు. దాన్ని సాధారణంగా మనం శైలి అంటాంగాని, అది అంతకన్నా విశాలమైన గుణం. ప్రతి కవీ తన కవితాసామగ్రిని ఎంచుకోవడంలో, పదసంయోజనలో, ఎత్తుగడలో, నిర్వహణలో, కవిత ముగించడంలో అతనిదే అయిన ఒక విలక్షణముద్ర చూపిస్తాడు. చిత్రకారుడు రంగులు కలపడంలాగా అది ఏ కవికి ఆ కవికే సంబంధించిన జీవధర్మం. దాదాపుగా అతడి శ్వాసలాగా పూర్తి వ్యక్తిగతలక్షణం. కాని ఒకసారి మనం ఆ ప్రత్యేకముద్రకు అలవాటుపడ్డామా ఇక ఆ కవి మనల్ని ఎన్నటికీ వదలడు. అందుకనే కొందరు తమకి కాళిదాసు ఇష్టమంటే కొందరు తమకి భవభూతి ఇష్టమంటారు. ఆ ఇష్టాల్ని సమర్థించుకోడానికి వాళ్ళేవో విశ్లేషణలు చెప్తుంటారుగాని, ఆ ఇష్టాలు వివరణకు లొంగేవి కావు.
బసవన్న కవిత్వంలో కూడా అటువంటి ఒక ప్రత్యేకముద్ర కనిపిస్తుంది. అది కొన్నిసార్లు కబీరు లాగా rough rhetoric, మరికొన్నిసార్లు పువ్వులాగా సున్నితం కూడా. ఎక్కడ అతడి ఉక్తి కఠినంగా ఉంటుంది, ఎక్కడ మృదువుగా ఉంటుంది అన్నది మనం అంత సులభంగా ఊహించగలిగింది కాదు, అందుకని ప్రతి కవితా మనల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.
ఇక రెండో లక్షణం, ఆ కవి లోనయ్యే ఒక భావావేశం. చాలాసార్లు ఆ భావావేశం యుగధర్మానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఆ కవి ఎక్కువ సామాజికుడిగా ఉన్నాడని చెప్తాం. ఆధునిక కాలంలో కవులు తమ భావావేశాల్ని సామాజిక న్యాయానికీ, సామాజిక ఆగ్రహానికీ సంబంధించిన భావోద్వేగాలతో అనుసంధానపరిచి ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా సామాజిక ధర్మాల ప్రకారం వివరించలేని భావోద్వేగాన్ని కవి ప్రకటిస్తే, అటువంటి కవిని మనం mystic అంటాం. అంటే ఆ భావోద్వేగం ఎంతో సాంద్రంగానూ, నిజాయితీతో కూడి ఉన్నదిగానూ మనకి తెలుస్తుంటుందిగాని, అది ఏమిటో మనం అంత చప్పున పోల్చుకోలేకపోతాం. అటువంటప్పుడు ఆ కవిని గౌరవిస్తాంగానీ, పూర్తిగా హృదయానికి చేరువగా తీసుకోలేం.
బసవన్న కవిత్వంలో ఈ రెండు పార్శ్వాలూ కూడా ఉన్నాయి. ఆయనలో ఒక సామాజిక అసమ్మతికారుడూ, విప్లవకారుడూ ఎంతబలంగా ఉన్నాడో ఒక మిస్టిక్ కూడా అంతే బలంగా ఉన్నాడు. ఆ అనుభవాన్ని ఆయన ‘అనుభావము’ అన్నాడు. ఆ కవిత్వం మొదటచదివినప్పుడు అది మనకి కొత్తగా కనిపిస్తుందిగాని, నెమ్మదిమీద, పదే పదే మననం చేస్తూ ఉన్నమీదట, మనమొక కొత్తలోకంలోకి మేల్కొంటున్నట్టుగా గుర్తుపడతాం. ఉదాహరణకి, ఈ వచనం (2) చూడండి:
కాళి కంకాళ లీల కన్నా ముందు
త్రిపురసంహారం కన్నా ముందు
బ్రహ్మవిష్ణువుల కన్నా ముందు
ఉమాకల్యాణం కన్నా ముందు
చాలాముందు, ముందు, ముందు-
మహానుభావా
కూడలసంగమ దేవా!
నువ్వప్పటికి లేతవాడివి
నేను పాతమనిషిని.
ఇందులో చివరి వాక్యాలు అటువంటి అనుభావానికి చెందినవి. ఇవి పూర్తిగా mystical. ఈ కవిత తక్కిన వచనాలన్నిటికీ తాళంచెవి. అలాగే తక్కినవచనాలన్నీ కూడా ఈ కవితకు తాళంచెవులే.
141
దేవుడు మంచివాడనుకుని
మరీ దగ్గరగా పోకు.
నిన్ను కటకటలాడించేవాడు
మంచివాడే?
నిన్ను ఏడిపించి, నవ్వించేవాడు
మంచివాడే?
అదరకుండా, బెదరకుండా
నిన్ను నువ్వు అర్పించుకుని
తొత్తుగా మారిచూడు.
కూడలసంగమదేవుడు
తనే నీకు అర్పించుకుంటాడు. (148)
142
మనసే పాము,
దేహం బుట్ట.
పామూ, బుట్టా
కలిసే బతుకుతాయి.
అదెప్పుడు నిన్ను
కరుస్తుందో తెలియదు.
అదెప్పుడు నిన్ను
కాటేస్తుందో తెలియదు.
రోజూ మిమ్మల్ని
పూజించడం తెలిస్తే
అదే గరుడుడు
కూడలసంగముడా! (160)
143
చెంపలు పాలిపోకముందు
ముడతలు ముఖంలో ముదరకముందు
శరీరం ఎముకలగూడు కాకముందు
పళ్ళు రాలి, వెన్ను వంగి
నీవాళ్ళకి నువ్వు బరువు కాకముందు
చేతుల్తో కాళ్ళు కూడదీసుకుని
చేతికర్ర పట్టుకోకముందు
ముదిమికి నీ ముఖకళ మాసిపోకముందు
మృత్యువు ముట్టకముందు
పూజించు
కూడలసంగమదేవుని. (161)
144
నిమిషంలో నిమిషం, బో
అరనిముషంలో, బో
కళ్ళుమూసి తెరిచేలోపు, బో
సంసారం పుడుతుంది, బో
సంసారం కుంగుతుంది, బో
సంసారం నడిచే తీరే ఇది, బో
ఏమిటిది నీ మాయ
కూడలసంగమదేవా
ఏమిటీ అభ్రచ్ఛాయ? (168)
145
ఊరికే దారులమ్మట తిరక్కు
అది కొనుక్కుంటే దొరికేది కాదు.
ప్రేమతో ఒక్కసారి
శివశరణుణ్ణని చెప్పుకో
భక్తితో ఒకసారి పలకరించు
ముక్తినీదవుతుంది.
కూడలసంగముడు
భక్తిలంపటుడు (180)
146
భక్తి మామూలు
విషయం కాదు.
రంపంలాగా
పోతూ కోస్తుంది
వస్తూ కోస్తుంది.
క్రూరసర్పాన్ని
పట్టుకోబోయి
పట్టుతప్పితే
కూడలసంగమదేవా
కాటు తప్పదు (212)
147
ఈ ఆకలి ఆరదు
ఈ మోహం అణగదు
ఈ ఆర్తి తీరదు
ఈ వ్యవహారం తేలదు.
అభిషేకం చేస్తుంటాను
కాని కాయవికారిని.
అభిషేకం చేస్తుంటాను
కానీ జీవవికారిని.
అభిషేకం చేస్తుంటాను
శరణుణ్ణి కాను,
లింగైక్యుణ్ణి కాను.
కూడలసంగమదేవుడిలో
నేనొక పిశాచాన్ని (259)
148
కంచెమీద తలాడించే
బల్లిలాగా నా మనస్సు.
గడియకొకలాగా రంగుమార్చే
ఊసరవెల్లిలాగా నా మనస్సు.
గబ్బిలం చేసే
కాపురంలాగా నా మనస్సు.
రాత్రిపూట మేల్కొనే గుడ్డివాడికి
ఇంటిముంగట పొద్దుపొడిచినట్టు
లేని భక్తికి ఆశపడుతున్నానా
కూడలసంగమదేవా? (287)
149
అడుగడుగునా నా మనసుని
అడలించి చూడకు
బడుగునని నన్ను
బాధపెట్టకు.
నా ప్రభువులు నాకున్నారు
కూడలసంగముని శరణులు. (324)
150
మా అమ్మ నింబవ్వ
నీళ్ళుమోస్తుంది.
మా నాన్న చెన్నయ్య
రాజుగారి గుర్రాలకి
మేతపెడతాడు.
నాకు సొంతవాళ్లు
లేరంటావు.
మా అక్క కంచిలో
వంటలక్క.
నీ చేతులమీంచే
ఓ కూడలసంగమయ్యా
నా పూర్వీకుల పుణ్యఫలం
నాకు దక్కింది. (351)
151
వేరు చెట్టుకి
నోరు.
మొదట్లో నీళ్ళుపోస్తే
పైన చిగురిస్తుంది.
లింగము నోరు జంగం
నైవేద్యం సమర్పిస్తే
ముందు ముందు
సకల పదార్థాలూ అనుగ్రహిస్తుంది.
జంగముని హరుడని చూసి
నరుడని తలిస్తే
నరకం తప్పదు, చూడయ్యా
కూడల సంగయ్యా! (420)
152
జగమంతా తెలియాలి
నాకొక భర్త ఉన్నాడని.
నేను ముత్తైదువుని
నేను ముత్తైదువుని.
కూడలసంగమయ్య
అని
నాకో మగడున్నాడు. (504)
153
ఏమని అడుగుతారయ్యా
భక్తి రతిలో మునిగిపోయినవాణ్ణి
వ్యాకుల చిత్తుణ్ణి.
కాముకుడికి
సిగ్గూ లజ్జా ఉంటాయా?
కాముకుడికి
మానావమానాలుంటాయా?
కూడలసంగముడి మనుషుల్ని
తలచుకుంటూ
మతితప్పిపోయిన నన్ను
ఏమని అడుగుతారయ్యా? (515)
154
విష్ణువును పూజించి
వీపు కాల్చుకోడం చూసాను.
జినుణ్ణి పూజించి
దిసమొలతో తిరగడం చూసాను.
మైలారుణ్ణి పూజించి
కుక్కలా మొరగడం చూసాను.
మా కూడలసంగముడి
మనుషులై,
దేవా!
భక్తులనిపించుకోడం చూసాను (569)
155
నీళ్లు చూస్తే చాలు
మునుగుతారు
చెట్టు చూస్తే చాలు
చుట్టూ తిరుగుతారు.
ఇంకిపోయే నీళ్ళూ
ఎండిపోయే చెట్టూ
నచ్చేవాళ్ళకి
కూడలసంగయ్యా!
నువ్వెట్లా నచ్చుతావయ్యా? (580)
6-12-2023


‘రాత్రిపూట మేల్కొనే గుడ్డివాడికి
ఇంటిముంగట పొద్దుపొడిచినట్టు
లేని భక్తికి ఆశపడుతున్నానా
కూడలసంగమదేవా?’
‘ఇంకిపోయే నీళ్ళూ
ఎండిపోయే చెట్టూ
నచ్చేవాళ్ళకి
కూడలసంగయ్యా!
నువ్వెట్లా నచ్చుతావయ్యా?’
వచనం సరళం తత్త్వంసాంద్రం మిసిమికవిత్వం.
ధన్యవాదాలు సార్
ఒకే వచనం లో తన లోని భక్తి పారవశ్యాన్ని,తీవ్రతను
సమాజం లోని మృగాళ్ల పశుప్రవృత్తినీ
ఎత్తి చూపగలిగిన
కవితా వైభవం బసవన్నది
కట్టిపడేసిన కవిత్వ వచనం
వచన కవిత్వం
“ఏమని అడుగుతారయ్యా
భక్తి రతి లో మునిగిన వాణ్ణి
వ్యాకుల చిత్తున్ని
కాముకుడికి
సిగ్గూ లజ్జ ఉంటాయా?
కాముకుడికీ
మానావమానాలుంటాయా?
కూడల సంగముడి మనుషుల్ని
తలచుకుంటూ
మతితప్పి పోయిన నన్ను
ఏమని అడుగుతారయ్యా ”
శుభోదయాన అంతా శివమయం చేస్తున్న మీకు
కార్తిక శివ శుభోదయం.
ధన్యవాదాలు మాష్టారూ!
నువ్వప్పటికి లేతవాడివి
నేను పాతమనిషిని.. తాళం తీయగలరు please