ఒక కొత్త ద్వీపాన్నో, ఒక శిఖరాన్నో, ఒక కొత్త సముద్రాన్నో వెతుక్కుంటో ప్రయాణాలు చేసిన సాహసికుల గురించి విన్నాంగాని, ఋతుపవనాల వెంబడి అవి సాగే దారిన తాను కూడా సాగాలని కోరుకున్నవాళ్ళెవరయినా ఉంటారా?
ఆకాశాన్ని కానుకచేసే ఋతువు
ఆహా! ఇంకా చాతకం బతికే ఉన్నది, నిప్పులు కక్కిన వేసవి మొత్తం ఆ ఉగ్రమధ్యాహ్నాల్ని అదెట్లా సహించిందోగాని, ఒక్క వానచినుకుకోసం, ఒక్క తేమగాలి తుంపర కోసం అదెట్లా ప్రాణాలు గొంతులో కుక్కుకుని ఇన్నాళ్ళూ గడిపిందోగాని, వానకోయిలకీ, కారుమబ్బుకీ ఉన్న ఈ అనుబంధం ఇన్ని యుగాలైనా ఇంకా చెక్కుచెదరకుండా ఉండటం నాకు ధైర్యానిస్తున్నది.
