ఆషాఢమేఘం-12

కాని ప్రాచీన ప్రాకృత కవిత్వం చేతుల్లోకి రాగానే ఆ వానాకాలపు నేరేడు చెట్ల అడివి నా కిటికీ దగ్గరకు వచ్చినట్టనిపించింది. అంతదాకా నా జీవితంలో చదువుకుంటూ వచ్చిన ఆధునిక విమర్శ ఆ రసరమ్య ప్రాచీన ప్రపంచాన్ని నాకు తెలియకుండా దాచి ఉంచిందనీ, అప్పటికే నేనెంతో పోగొట్టుకున్నాననీ అనిపించింది.

అమృతం ప్రాకృతకావ్యం

పొద్దున్నే పాత కాగితాలు సర్దుకుంటుంటే ఎప్పుడో అనువాదం చేసిన ఈ ప్రాకృత కవితలు కనబడ్డాయి. ఇవి వజ్జాలగ్గంలోవి. క్రీస్తు శకం ఏడెమినిది శతాబ్దాల కాలంలో జయవల్లభుడనే జైనసాధువు సంకలనం చేసిన ప్రాకృత కవితకవితాసంకలనమది. 

మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే

మామిడిచెట్టు ఏడాదిలో ఆరునెలలు నిద్రపోతుంది. ఆరునెలలు పరిపూర్ణంగా జీవిస్తుంది. పూర్తి ఉత్సాహంతో, మహావైభవంతో జీవిస్తుంది. మాఘమాసంలో పూత, ఫాల్గుణంలో పిందె, వైశాఖంలో రసాలూరే ఫలాలు-ఇంత త్వరత్వరగా పుష్పించి, ఫలించే ఈ వైనం ఒక సంస్కృతకవికి ప్రేమవ్యవహారంలాగా అనిపించింది