ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యాన్ని పరిచయం చేస్తూ నేను వెలువరించిన 'వికసించిన విద్యుత్తేజం' పుస్తకానికి ఇప్పటిదాకా ఒక్క సోమశేఖర్ నుంచి మాత్రమే ప్రతిస్పందన లభించింది. ఆ పుస్తకంలో మూడు నాలుగు కొత్త వ్యాసాలున్నాయి. కాబట్టి మిత్రులు వాటిని ఇక్కడైనా చదువుతారని ఇలా అందిస్తున్నాను.
కాంతికోసం తెరుచుకుని
ఎన్నాళ్ళుగానో ఓ కోరిక, ఓ కల, తెల్లవారగానే ఇంటిముంగిట్లో ఒక తామరపూల కొలను కనబడాలని,కనీసం ఒక తొట్టెలోనైనా ఒకటిరెండు తామరపూలేనా వికసిస్తుంటే చూడాలని.
అద్దె ఇల్లే కానీ, ఇన్నాళ్ళకు ఈ కల నిజమయ్యింది, ఆదివారం తెచ్చి ఒక తామరతీగ తొట్టెలో నాటానా, రాత్రి కురిసిన రహస్యపు వానకి, తెల్లవారగానే-
'చూసావా, పువ్వు పూసింది' అన్నాడు ప్రమోద్.
