ఆ క్షణాల్లో అత్యంత భీరువు కూడా అత్యంత వీరోచితంగా మారిపోతాడు. సాహసవంతుడైపోతాడు. అటువంటి క్షణాల్లో ప్రేమ అతణ్ణి ఉత్తేజితుణ్ణి చేస్తుంది. కొందరు వీరుల ఆత్మల్లో దేవుడు సాహసాన్ని ఊపిరులూదుతాడని హోమర్ అంటాడే అలా ప్రేమికుడు తన ప్రేమస్వభావాన్నే తన ప్రేమికుడిలో ఊపిరులూదుతాడు.
ప్రేమగోష్ఠి-2
'ఒక సంపూర్ణమానవుడు తాకితేచాలు ఒక బోలుమనిషిలోకి వివేకం ప్రవేశించేమాట నిజంగా నిజమైతే ఎంతబాగుణ్ణు' అన్నాడు సోక్రటీస్, అగధాన్ కోరుకున్నట్టే అతడి పక్కన కూచుంటో. 'నిండుకలశంలోంచి ఖాళీపాత్రలోకి నీళ్ళు వడగట్టినట్టు, అలా వివేకం ప్రవహించే మాటనే నిజమైతే, నీ పక్కన కూచునే అదృష్టానికి నేనెంత సంతోషిస్తానని!'
ప్రేమగోష్ఠి-1
'సింపోజియం' ప్లేటో రచనలన్నిటిలోనూ అత్యుత్తమ రచన. కావ్యత్వాన్ని అందుకున్న రచన. విద్యావంతుడైన ప్రతి ఒక్కడూ చదివితీరవలసిన రచన.
