పాల్కురికి సోమన రాసిన బసవపురాణంలో ముగ్ధ భక్తుల గురించిన ప్రసంగాల్లో రెండవ రోజు ప్రసంగం బెజ్జమహాదేవి గురించి. వాత్సల్య భక్తికి ఉదాహరణగా కృష్ణ భక్తి సాహిత్యంలో ఒక పెరియాళ్వారు, ఒక సూరదాసు మనకు కనబడతారు. కానీ ఒక తల్లి హృదయంతో శివుని పసిబిడ్డగా భావించి లాలించి పెంచుకున్న ఒక ముగ్ధ మాతృమూర్తి కథ ఇది. భారతీయ భక్తి సాహిత్యం లోనే ఇటువంటి కథ మరొకటి లేదు.
సూరసముద్రం
నువ్వట్లా ఆ సముద్రం ఎదట నిలబడ్డప్పుడు, ఆ కెరటాలు సుదూరనీలం నుంచీ నీ దాకా ప్రవహించి నీ ఎదటనే ఎగిసిపడుతున్నప్పుడు, తక్కినవన్నీ మరిచి నువ్వా అఖండ నీలిమనే ఎట్లా సందర్శిస్తూ ఉంటావో, ఎట్లా సంభావిస్తో ఉంటావో, అట్లా నీ జీవితాన్ని పక్కన పెట్టి, నువ్వు విలువైనవీ, ముఖ్యమైనవీ అనుకుంటున్నవన్నీ పక్కన పెట్టి ఆ సముద్రానికి నిన్ను నువ్వు పూర్తిగా ఇచ్చేసుకోవాలి.
