ప్రేమభాషా కవి

యుద్ధమధ్యంలో, 'మండే ఇసుకలో నెత్తురోడుతో డేక్కుంటో ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ కి వెళ్ళవలసిన జీవితం మధ్య' వాళ్ళు ప్రేమకోసం, శాంతికోసం తపించారు. సుఖంగా, సౌకర్యంగా జీవిస్తో మనం మన భాషని 'ద్వేష భాష' గా మార్చుకుంటున్నామని తెలియవలసి రావడంలో ఉన్న విషాదం చెప్పలేనిది.

దివ్యప్రేమగీతం-1

ఈ ఉద్యానంలో దేవుడి ప్రస్తావన లేదు, నిజమే, కాని సైతాను కూడా లేడు. మనిషికీ, మృగానికీ మధ్య విరోధం లేదు. ఆధిపత్యం లేదు, ఒకరినొకరం అణచివేసుకోడం లేదు. కాబట్టి ఆ ఉద్యానమే ఒక దైవం. దేవుడి ప్రస్తావనలేని దైవానుభవం ఈ గీతం.