నా భాగ్యం

ఈ గీతాన్ని ఆత్మీయురాలు నిర్మలకి కానుక చెయ్యడం కూడా భగవత్సంకల్పంగానే భావిస్తున్నాను. రెండువేల అయిదు వందల ఏళ్ళ యూదీయ, క్రైస్తవ, భగవద్విశ్వాసుల ఆశీస్సులు ఆమెకు ఈ రూపంలో అందుతున్నాయని నమ్ముతున్నాను. ఈ పుస్తకానికి ఆమెనే మొదటి పాఠకురాలు కూడా. ఆమె తన స్పందనను ఇలా పంచుకున్నారు. ఈ కానుకని ఆమె అంగీకరించడం నా భాగ్యంగా భావిస్తున్నాను.

ఆత్మోత్సవ గీతం-2

అమెరికన్ మేధావి కర్తవ్యం గురించి ఎమర్సన్ చేసిన ప్రసంగం వల్ల ప్రేరణ పొందిన థోరో మానవసమాజానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా జరిగితే, విట్మన్ మానవసమాజానికి దగ్గరగా జరగడమే కాదు, ఆ మానవాళి మొత్తం తనే కావాలని ఆశపడ్డాడు. అందుకనే ఇది Song of Myself గా మారింది.