కానీ, ఈ గీతం, ఇది మామూలు గీతం కాదు. జ్ఞానేశ్వరుడు, నామదేవ్, తుకారాం, ఏకనాథుడు లాంటి మహాభక్తకవిపరంపర ఆయన్ని ఆవేశించి ఈ గీతం రాయించారా అనిపిస్తుంది. ఎటువంటి గీతం ఇది! భావానికి భావం సరే, ఆ భాష! ఈ గీతరూపంలో షిరిడీలో గంగావతరణం సంభవించిందా అనిపిస్తుంది ఆ గీతం విన్నప్రతిసారీ!
ఆ మందహాసాన్ని ఒక్కసారి చూడటానికేనా
సహ్యాద్రి అంతటా వ్యాపించిన దత్తసంప్రదాయం, పండరిపురం కేంద్రంగా విలసిల్లిన విట్ఠల సంప్రదాయం, సంత్ భక్తి వాగ్గేయకారుల కీర్తన సంప్రదాయం, వార్కరి, మహానుభావ సంప్రదాయం, నాథ సంప్రదాయం, మరొకవైపు దక్కన్ ని వెలిగించిన సూఫీ సంప్రదాయం ఇవ్వన్నీ సాయిబాబాలో సంగమించించాయి.
