అసలు ముందు ఆ ముఖచిత్రం దగ్గరే నేను చాలాసేపు ఆగిపోయాను. ఎంత రొమాంటిక్ గా ఉంది ఆ ఫొటో! లేపాక్షి శిల్పమంటపంలో కూచుని స్కెచ్ బుక్కు తెరిచిపెట్టుకుని ఒక బొమ్మ గియ్యడానికి ఉద్యుక్తుడవుతూ తన ఎదట ఉన్న శిల్పాన్ని పరికిస్తున్న్న ఆ చిత్రకారుణ్ణి చూసి ఏ కళాకారుడు మోహపడడు కనుక!
ఆ పిల్లవాణ్ణి ఎందుకు చిత్రించినట్టు?
అటువంటి ఆ దివ్యప్రసంగ ఘట్టంలో రెంబ్రాంట్ ఆ పిల్లవాణ్ణి ఎందుకు చిత్రించినట్టు? క్రీస్తు ఏ కపెర్నహోములోనో ప్రసంగిస్తున్నప్పుడు, అక్కడి దైనందిన జీవితాన్ని మనకి స్ఫురింపచేయడం కోసమా లేకపోతే ఆ పిల్లవాడి తల్లిదండ్రులెవరో వాళ్ళు అతడి ధ్యాస కూడా మర్చిపోయి క్రీస్తు బోధనల్ని తాదాత్మ్యంతో వింటున్నారని చెప్పడం కోసమా?
