అమెరికాలో ఇటువంటి మూజియాలకీ, చిత్రకళాప్రదర్శనలకీ ఎంత ఆదరణ ఉంటుందో స్వయంగా చూసిన విజయసారథిగారు ఆ మూజియంలో తిరుగుతున్నంతసేపూ దిగులు పడుతూనే ఉన్నారు. ఏం చేస్తే మన ప్రజలకి ఇటువంటి విలువైన వారసత్వసంపద పైన దృష్టి మళ్ళుతుంది? ఒక మాల్ కో, మల్టీప్లెక్సుకో పిల్లల్ని తీసుకువెళ్ళడంలో సంతోషాన్ని పొందుతున్న మన కుటుంబాలకి తమ పిల్లలని ముందు ఇటువంటి మూజియంలకు తీసుకురావడం అత్యవసరమని ఎప్పుడు తెలుస్తుంది? ఇవే ఆయన నన్ను పదే పదే అడుగుతున్న ప్రశ్నలు.
