నీరస తథ్యాల్ని తిరస్కరించడం

ఒక మనిషి తాత్త్వికంగా సత్యాన్వేషణకు పూనుకోవడమంటే 'నీరస తథ్యాల్ని' తిరస్కరించడం. 'నిశ్చల నిశ్చితాల' ని పక్కకు నెట్టేయడం. కాబట్టే, సత్యాన్వేషణ అన్ని వేళలా సంతోషానికీ, మనశ్శాంతికీ దారితియ్యకపోగా, నిరంతర ఆత్మశోధనకీ, సంశయగ్రస్తతకీ, ఆత్మవేదనకీ దారితియ్యడం ఆశ్చర్యం కాదు. అలాగని మనం సత్యాన్వేషణని ఆపలేం. పక్కనపెట్టేయలేం. 'నిత్య నిరుత్తరపు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం' అని తెలిసికూడా మన వివేచనని కట్టిపెట్టలేం.

మనసులో మాట

ఈ ప్రపంచంలో ఇంకా అమ్మకం సరుకుగా మారనిదంటూ ఉంటే అది కవిత్వం మాత్రమే. చదువుతారా, చదవరా, పుస్తకాలు కొంటారా, కొనరా లాంటి లెక్కల్తో పనిలేకుండా ఉన్నది ప్రస్తుతం కవిత్వం మాత్రమే. తన మనసులో మాట తాను ఎలాంటి మసకలూ లేకుండా చెప్పుకోగలిగేనా లేదా అన్నదానిమీదనే ఎప్పుడూ కవి దృష్టి ఉండాలి తప్ప, తన మాటలు ఎంతమంది ఆలకిస్తున్నారన్నదాని మీద కాదు.