బసవన్న వచనాలనుంచి మూడువందల వచనాలు ఎంపికచేసి నేను తెలుగులోకి అనువదించి పుస్తకంగా వెలువరించిన సంగతి మీకు తెలిసిందే. కిందటి డిసెంబరులో తీసుకువచ్చిన ఆ పుస్తకం మీద ఇన్నాళ్ళకు ఒక నిండైన సమీక్ష లభించింది. ఆత్మీయులు న్యాయపతి శ్రీనివాసరావు బసవన్న పట్ల అపారమైన గౌరవంతోనూ, నా పట్ల అపారమైన అభిమానంతోనూ రాసిన ఈ వ్యాసాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.
మూడువందల వచనాలు
మీ యాభయ్యవ పుస్తకం ప్రత్యేకంగా ఉండబోతోంది కదా అనడిగారు ఒక మిత్రురాలు. అవునన్నాను. ఏమిటా పుస్తకం అనడిగారు. చెప్పలేదు. చెప్పకూడదని కాదు. చెప్పడానికి ధైర్యం చాల్లేదు. ఎందుకంటే నేననుకున్నట్టుగా ఆ పుస్తకం తేగలనా అన్న ఆందోళన నా మనసుని అంటిపెట్టుకునే ఉందిన్నాళ్ళూ. ఏమైతేనేం, భగవంతుడి దయ వల్ల, ఇదుగో, ఈ 'మూడువందల వచనాలు' నిన్ననే శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునుల చరణాల దగ్గర సమర్పించగలిగాను. ఈ పుస్తకం ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులతో షేర్ చేసుకోవచ్చు.
