మందం మందం మధుర నినదైః

ఏమా అని తెరిచి చూద్దును కదా, గోదావరి గళం నుంచి ప్రవహిస్తున్నట్టు, మాష్టారి కంఠస్వరంలో కృష్ణకర్ణామృత శ్లోకాలు. అలానే వింటూ ఉండిపోయాను. సాయంకాల ప్రార్థన పూర్తయిందనిపించింది.

ఒక సంభాషణ-3

కస్తూరి మురళీకృష్ణగారు, కోవెల సంతోష్ కుమారు గారు 'స్వాధ్యాయ-కోవెల ' ఛానెలు కోసం నాతో మాట్లాడించినప్పుడు మా మాష్టారి గురించీ, పుట్టపర్తి నారాయణాచార్యుల వారి గురించీ మాట్లాడిన మాటలు ఇలా విడిగా ఒక ఎపిసోడుగా తమ ప్రేక్షకులతో పంచుకున్నారు. నారాయణాచార్యులు గారు సరస్వతీ పుత్రులు. మా మాష్టారు పుంభావ సరస్వతి. వారిద్దరి గురించి ఎంతసేపేనా తలుచుకోవచ్చు. ఆ సంభాషణని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.

మహాకావ్యపరిచయం

సాధారణంగా మనుషులు స్త్రీపట్లా, కవిత్వం పట్లా తొందరగా మాట తూలతారని భవభూతి అన్నాడని గుర్తు చేస్తూ, తన ప్రసంగసారాంశంగా ఆయన చెప్తున్నదేమిటంటే, గొప్ప కవిత్వాన్ని సమీపించడానికి, అనుభవమూ, మననమూ కావాలి తప్ప bookish knowledge కాదని. ఈ ప్రసంగమంతా విన్నాక నాకేమి అర్థమయిందంటే ఒక మహాకావ్యానికి కాలనియంత్రణ లేదని.