ప్రాచీన కాలంలో కవిత్వమంటే వర్ణన. ప్రధానంగా శబ్దాలతో చేసే వర్ణన. చిత్రలేఖకుల భాషలో చెప్పాలంటే వర్ణలేపనం. సంగీతకారుల భాషలో చెప్పాలంటే స్వరప్రస్తారం. కవి వర్ణన నెపంతో కొత్త భాషని తన శ్రోతలకి అందిస్తాడు. అది వాళ్ళకి కొత్త రెక్కలిచ్చినట్టు ఉంటుంది.
ఆషాఢ మేఘం-2
మేఘాన్ని చూడగానే భారతీయ కవికి ఏకకాలంలో ప్రేమా, దుఃఖమూ రెండూ కలుగుతాయి. వసంతాన్ని చూసినప్పుడు కలిగే భావనలు ప్రణయోద్దీపభావనలే తప్ప వాటిలో విషాదఛాయలుండవు. కానీ ఆషాఢమేఘం ఏకకాలంలో కవికి ఈ ప్రపంచం పట్ల అలవిమాలిన ప్రేమా, దీన్నుంచి తొలగిపోతున్నాననో, తొలగిపోవాలనో ఏదో ఒక గాఢనిర్వేదమూ, ఒక్కసారే ఆవహిస్తాయి.
విషాదమధుర వాక్యం
నా మానాన నా ఉద్యోగమేదో చేసుకుంటున్న నన్ను ఎంకి ఒక్కసారిగా చెదరగొట్టేసింది. ఇప్పుడు నాకు ఎన్నెలంతా నెమరేసిన ఆ యేరు, ఆ కొండ, ఆ తెల్లవారు జామున తేనెరంగు తిరిగే నెలవంక, గాలికి కూడా చోటివ్వని ఆ కౌగిలి- ఇవి కావాలనిపిస్తున్నది. అన్ని పనులూ పక్కన పెట్టేసి, ఇదిగో, ఈ పాట పదే పదే హమ్ చేయాలనిపిస్తున్నది:
