పుస్తక పరిచయం-51

పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా ఈ రోజు అవధూత గీత పైన ప్రసంగిమను. దత్తాత్రేయులు రాసారని భావించే ఈ గీత, భారతీయ తాత్త్విక సాహిత్యంలో, అత్యుత్తమ కృతుల్లో ఒకటి. స్థితప్రజ్ఞుడు ఏం మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు, దేని వల్ల నిలబడగలుగుతాడు అన్నదానికి భగవద్గీత ఒక వివరణ అయితే, విముక్తమానవుడు ఎలా ఉంటాడు, ఎలా భావిస్తాడు, ఎలా మాట్లాడతాడు అన్నదానికి అవధూత గీత ఒక నిరూపణ. ఈ పుస్తకం మీద నా ప్రసంగం ఇక్కడ వినవచ్చు.

అవధూత గీత

కిందటి అక్టోబరు-నవంబరు నెలల్లో అవధూత గీతకు నా తెలుగు అనువాదాన్నీ, ఆ గీతను ఉపదేశించిన దత్తాత్రేయుల దర్శనం పైన కొన్ని ఆలోచనల్నీ మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ అనువాదాన్ని ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఇలా పుస్తక రూపంలో మీతో పంచుకుంటున్నాను. ఈ అనువాదాన్ని గాణ్గాపురంలోని శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి నిర్గుణపాదుకలముందు సమర్పిస్తున్నాను. ఇది నా 57 వ పుస్తకం.

అవధూత గీత-18

గురుశిష్యులనే ఆలోచన తొలగిపోతుంది ఉపదేశం గురించి చింతన తొలగిపోతుంది శివుణ్ణీ, సర్వోన్నత సత్యాన్నీ నేనేకాగా అక్కడ అభివందనమెవరికి? ఎలాగ?