పుస్తకాలు ముద్రిస్తామని చెప్పి వారం తిరక్కుండానే ఈ రోజు నాలుగు పుస్తకాలూ నా ఇంటికి చేరాయి. చాలా అందంగా ముద్రించారు. ధర కూడా మరీ ఎక్కువ పెట్టారనిపించలేదు. ఆసక్తి ఉన్న మిత్రులు వెంకటనారాయణగారిని సంప్రదించవచ్చు.
ఆ బంభరనాదం
గత అయిదారేళ్ళుగా సాహిత్యం గురించి రాస్తూ వచ్చిన వ్యాసాల్ని ప్రక్రియాపరంగా విడదీసి, కవిత్వం గురించి రాసినవాటిని, తీరనిదాహం పేరుతోనూ, కథల గురించీ, నవలల గురించీ రాసిన వాటిని, కథల సముద్రం పేరుతోనూ ఈ-బుక్కులు మీతో పంచుకున్నాను. మిగిలిన వ్యాసాల్లో సాహిత్యానుభూతి, సాహిత్యప్రయాణాలు, సాహిత్యబాంధవ్యాల గురించిన వ్యాసాల్ని 'ఆ బంభరనాదం' పేరిట ఇలా పంచుకుంటున్నాను.
తూలిక
గత పదిపన్నెండేళ్ళుగా చిత్రకారుల్నీ, శిల్పుల్నీ, వివిధ చిత్రకళారీతుల్నీ అర్థం చేసుకోడంలో నాకు కలుగుతూ వస్తున్న ఆలోచనల్ని ఫేస్బుక్ ద్వారానూ, నా బ్లాగు ద్వారానూ మిత్రుల్తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచ్చాను. అలా పంచుకున్న 58 వ్యాసాల సంపుటి ఈ పుస్తకం 'తూలిక'. ఈ రంగుల పండగ సందర్బంగా దీన్ని మీతో పంచుకుంటున్నాను. ఇది నా 58 వ పుస్తకం. దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులతో పంచుకోవచ్చు.
