సంగీతపు రెక్కలమీద యాత్ర

ఈస్టర్ ప్రభాతం. నిన్నటి వసంతవాన చల్లదనం ఇంకా గాల్లో కమ్మతెమ్మెరగా ప్రసరిస్తూనే ఉంది. 'చైత్రము లోన చినుకు పడాలని కోరేవు ' అన్నాడు కవి. వసంతకాల వాన నింగినీ నేలనీ కలిపే రంగుల వంతెన. ఇటువంటి వేళల్లోనే ప్రాచీనా చీనా కవులు తలపుకొస్తారు. కాని నా ఎదట . మొన్ననే అభిషేక్ ముజుందార్ కానుక చేసిన గీతాంజలి ఉంది.

కవిమూలాల అన్వేషణ

ఏడెనిమిదేళ్ళ కిందట చైనాలో సిచువాన్ రాష్ట్రానికి చెందిన జియాంగ్-యూ నగరం హుబే రాష్ట్రానికి చెందిన అన్లూ నగరపాలకసంస్థకి ఒక లాయర్ నోటీస్ పంపించింది. ఎనిమిదో శతాబ్దానికి చెందిన చీనా మహాకవి లి-బాయి తమ నగరానికి చెందినవాడని అన్లూ పదే పదే టివీల్లో ప్రచారం చెయ్యడం మానుకోవాలనీ, అతడు తమ నగరానికి చెందిన కవి అనీ జియాంగ్యూ వాదన. ఆ నోటీస్ ని అన్లూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముందుపెట్టింది. వాళ్ళు న్యాయనిపుణులతో సంప్రదించి, అన్లూ ప్రభుత్వం చేస్తున్న టివి షోలు కాపీ రైటు ఉల్లంఘనకిందకు రావని తేల్చారు. 

పాతుమ్మా మేక, చిన్ననాటి చెలి

కొన్నేళ్ళ కిందటి మాట. డా.అబ్దుల్ కలాం ఆత్మకథని నేను తెలుగు చేసిన కొత్తలో, విజయవాడలో ఒకాయన ఆ పుస్తకం తీసుకుని ఎమెస్కో విజయకుమార్ ని నిలదీసాడట. ఎవరీ అనువాదకుడు, తెలుగు రాయడం కూడా సరిగా రాదే అని. ఎందుకంటే, అందులో ఒకచోట, నేను 'బాల్యకాలం' అనే మాట వాడానట.