తక్కిన ప్రపంచం ఏ సౌందర్యం ఎదట, సిరిసంపదల ఎదట, గౌరవప్రతిష్టల ఎదట సాష్టాంగ పడిపోతుందో, వాటిపట్ల అతడికి కించిత్తు కూడా దృష్టిలేదు. ఇంకా చెప్పాలంటే వాటి పట్ల అతడికి చెప్పలేనంత ఏహ్యత. అందం, సంపద, హోదా ఉన్నవారిని భాగ్యశాలురని అతడు ఎన్నటికీ అనుకోలేడు. అసలు మానవాళిని తృప్తిపరచడం పట్ల అతడికెటువంటి ఆసక్తీ లేదు.
ప్రేమగోష్ఠి-10
కానీ, నువ్వో, నీకు వేణువు అవసరమే లేదు, వట్టి మాటలతోటే అలాంటి ప్రభావం చూపించగలవు. అతడికీ నీకూ తేడా అది. మేము మరెవరైనా వక్తని విన్నప్పుడు, అతడెంత మంచి వక్తగానీ, అతడి మాటలు మామీద ఎలాంటి ప్రభావం చూపించలేవు. అదే నువ్వయితేనా, నీ మాటలు, నీ సంభాషణాశకలాలు, అవి రెండోమనిషిద్వారా విన్నా కూడా, వాళ్ళు వాటిని సరిగ్గా చెప్పలేకపోయినా కూడా, వాటిని విన్న ప్రతి ఒక్కర్నీ, స్త్రీని, పురుషుణ్ణీ, శిశువునీ అవి సంభ్రమంలో ముంచెత్తుతాయి.
ప్రేమగోష్ఠి-9
కాని ఆ యథార్థసౌందర్యాన్ని చూడటానికి కళ్ళుండాలేగాని, ఆ దివ్యసౌందర్యం, ఆ నిర్మల, స్ఫటికస్వచ్ఛసౌందర్యం- మర్త్యత్వపు మాలిన్యాలంటని, మానవజీవితపు వన్నెచిన్నెలు, హంగుపొంగులు దరిచేరలేని ఆ సౌందర్యాన్ని చూడటానికి నోచుకోగలిగితే, సదా ఆ సరళ, సత్య, దివ్యసౌందర్యంతోటే సంభాషిస్తో ఉండిపోగలిగితే!'
