ఆ ప్రథమ క్షణాలు, తను ఏకకాలంలో వ్యక్తిగానూ, గణంగానూ, సమస్త పృథ్విగానూ ఉండే క్షణాలు, ఆ క్షణాల్లోని ఎల్లల్లేని ఆ ఐక్యభావన, తాను 'అవిభక్త కుటుంబీ, ఏకరక్త బంధువు 'అని స్ఫురించిన ఆ క్షణాలు, అవే తొలిమానవుడి సైన్సు, దర్శనం, కవిత్వం.
ఇప్పుడు నీ కళ్ళకు అంజనం పూస్తాను
ఆ ముందుమాటతో కలిపి ఆ పుస్తకం ఒక జీవితకాల పారాయణ గ్రంథం. నీ జీవితపు ప్రతి మలుపులోనూ నువ్వు ఆ పుస్తకం తెరవాలి. నీ ప్రయాణంలో నువ్వెప్పుడో వదిలిపెట్టేయవలసిన బరువులింకా మోస్తూ ఉంటే ఆ పుస్తకం చెప్తుంది, నిన్ను ఎప్పటికప్పుడు తేలికపరుస్తుంది, శుభ్రపరుస్తుంది.
ఆ ఋషులందరిదీ ఒకటే భాష
అది బషొ అయినా, హాఫిజ్ అయినా, బ్లేక్ అయినా, జిడ్డు కృష్ణమూర్తి అయినా ఋషులందరిదీ ఒకే ప్రపంచం, ఒకటే భాష. ఈ ప్రపంచాన్ని వాళ్ళు పరికించే తీరు ఒక్కటే. ఈ ప్రపంచానికి ఆవల ఉన్న లోకాల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు వాళ్ళంతా చెప్పే కొండగుర్తులు కూడా దాదాపుగా ఒక్కలాంటివే.
