ఒక శతాబ్దం గడిచిపోయేక, ఇప్పుడు ఓ హెన్రీ కథలు చదువుతుంటే, అతడిలోని సామాజిక విమర్శకుడు చాలా ప్రస్ఫుటంగా దర్శనమిస్తున్నాడు. ముఖ్యంగా, న్యూయార్కు నగరజీవితం మీద అతడు రాసిన కథలు. ఇరవయ్యవ శతాబ్దపు తొలిరోజుల్లో విస్తరిస్తున్న ఒక మహానగరపు రథచక్రాల కింద నలిగిపోతున్న అధోజగత్సహోదరుల యథార్థ గాథల్ని అతడు ఎంతో ప్రతిభావంతంగా చిత్రించాడు. ఒక మహానగరజీవితాన్ని దాని విస్మృత పార్శ్వాలనుంచి ఇంత కథనకౌశల్యంతో పట్టుకున్న కథకుడు మనకి మరొకరు కనిపించరు.
హెమింగ్వే సూత్రాలు
హెమింగ్వే వాక్యాల్లోని గాఢత, క్లుప్తత, తీవ్రత ఆయన ఏళ్ళ తరబడి చేసిన సాధన వల్ల ఒనగూడిన విలువలు. ఆయన జీవించిన జీవితం కూడా సామాన్యమైంది కాదు. కానీ కొత్తగా రచనలు మొదలుపెడుతున్నవాళ్ళకే కాదు, ఏళ్ళ తరబడి రాస్తూ ఉన్నవాళ్ళకి కూడా హెమింగ్వే నుంచి నేర్చుకోవలసింది చాలానే ఉంది.
రిచర్డ్ రైట్
కమ్యూనిస్టుగా, ఆ తర్వాత ఫ్రాన్సులో సార్త్రేకి, సైమన్ డి బోవాకి స్నేహితుడిగా, చివరికి ఫ్రాన్సు వదిలిపెట్టి ఇంగ్లాండులో తనకి ఆశ్రయం వెతుక్కున్నవాడిగా, కమ్యూనిజంతో తెగతెంపులు చేసుకుని, ఆసియా, ఆఫ్రికా దేశాల వైపు చూపు సారించినవాడిగా, రైట్ ప్రపంచమంతా చేసిన ప్రయాణం అతణ్ణి పాల్ రోబ్సన్ వంటివారి కోవలో నిలపగలిగేదని నిశ్చయంగా చెప్పగలం.
