అవధూత గీత

కిందటి అక్టోబరు-నవంబరు నెలల్లో అవధూత గీతకు నా తెలుగు అనువాదాన్నీ, ఆ గీతను ఉపదేశించిన దత్తాత్రేయుల దర్శనం పైన కొన్ని ఆలోచనల్నీ మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ అనువాదాన్ని ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఇలా పుస్తక రూపంలో మీతో పంచుకుంటున్నాను. ఈ అనువాదాన్ని గాణ్గాపురంలోని శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి నిర్గుణపాదుకలముందు సమర్పిస్తున్నాను. ఇది నా 57 వ పుస్తకం.

ఇంకొంచెం సూర్యకాంతి

ఒకప్పుడు మో తన జీవితంలో అమూల్యమైన క్షణాల్ని 'బతికిన క్షణాలు 'అని పుస్తక రూపంలో తీసుకొచ్చాడు. ఇన్నాళ్ళకు నేను కూడా కొంచెం సూర్యకాంతి నా జీవితాన్ని వెలిగించిన క్షణాల్ని ఇలా మూటగట్టి మీతో పంచుకుంటున్నాను. ఇది నా 56 వ పుస్తకం. దీన్ని మా బంగారు తల్లి అమృతకి కానుక చేస్తున్నాను.

వికసించిన విద్యుత్తేజం

ప్రతి ఏడాదీ ఫిబ్రవరి నెలపొడుగునా అమెరికాలో, కెనడాలో జరుపుకునే నల్లజాతి చరిత్ర మాసోత్సవాన్ని పురస్కరించుకుని 2018 లో ఆఫ్రికన్‌-అమెరికన్‌ సాహిత్యం పైన కొన్ని పరిచయ వ్యాసాలు రాసాను. వాటిలో డగ్లస్‌, డన్‌బార్‌, లాంగ్‌స్టన్‌ హ్యూస్‌, పాల్‌ రోబ్సన్‌ మీద వ్యాసాల్ని ఇప్పుడు కొద్దిగా విస్తరించాను. వారితో పాటు ఫిల్లిస్‌ వీట్లి, జార్జి మోజెస్‌ హోర్టాన్‌, రిచర్డ్‌ రైట్‌ల మీద కొత్తగా రాసిన వ్యాసాలు ఈ సంపుటిలో చేర్చాను. ఇప్పుడు ఈ పదిహేను వ్యాసాల్నీ 'వికసించిన విద్యుత్తేజం' పేరిట ఈ ఫిబ్రవరి నల్లజాతి చరిత్ర మాసోత్సవం సందర్భంగా ఇలా విడుదల చేస్తున్నాను. ఇది నా 55 వ పుస్తకం. ఆఫ్రికన్‌-అమెరికన్‌ సాహిత్యం వైపు నా దృష్టి మళ్ళించిన నా ఆత్మీయుడు కన్నెగంటి రామారావుకు ఈ పుస్తకాన్ని ప్రేమతో కానుక చేస్తున్నాను.