గత ఆరేడేళ్ళుగా కథలమీదా, కథకులమీదా, నవలల మీదా నేను రాస్తూ వచ్చిన వ్యాసాల్ని కథల సముద్రం పేరిట సంకలనం చేసి ఈ-బుక్కుగా మీతో పంచుకున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు ఆ ఈ-బుక్కును ఎన్నెలపిట్ట ప్రచురణసంస్థ తరఫున శెషు కొర్లపాటి పుస్తకంగా తీసుకొచ్చేరు. ఈ రోజు బషీర్ బాగు ప్రెస్సు క్లబ్బులో జరిగిన రావిశాస్త్రి పురస్కార ప్రదాన సభలో ఈ పుస్తకాన్ని మహమ్మద్ ఖదీరు బాబు ఆవిష్కరించేరు. పుస్తకాన్ని డా.కొర్రపాటి ఆదిత్య అద్భుతంగా పరిచయం చేసారు.
ఆత్మోత్సవ గీతం
వాల్ట్ విట్మన్ రాసిన Song of Myself ను ఆత్మోత్సవ గీతం పేరిట తెలుగు చేసి ఈ-బుక్కు రూపంలో గతంలో మీతో పంచుకున్నాను. ఆ పుస్తకాన్ని ఇప్పుడు అనల్ప పబ్లికేషన్స్ బలరాం గారు పుస్తకగా తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని ఈ రోజు ఇలా విడుదల చేస్తున్నాము.
కథలు ఎలా పుట్టాయి
చాలా సంతోషంగా ఉంది. పదిహేనేళ్ళ కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టులో మొదటిభాగాన్ని ఇప్పటికి సంతృప్తిగా పూర్తిచేయగలిగాను. 'కథలు ఎలా పుట్టాయి: ప్రాచీన కథారూపాల పరిచయం' అనే ఈ పుస్తకాన్నిలా ఈ-బుక్కుగా మీ చేతుల్లో పెట్టగలుగుతున్నాను.
