తెలుగు భాష భవిష్యత్తు

తెలుగు అత్యున్నత కావ్యభాష, తాత్త్వికభాష, సంగీత భాష. కానీ ఆ భాషను మనం గాసిప్ కో లేదా క్రూడ్ కామెడీకో మాత్రమే వాడుకునే పరిస్థితులు రావడం పట్ల నా ఆవేదనని తాను అర్థం చేసుకోగలుగుతున్నానని స్పష్టంగా చెప్పాడు.

నీరస తథ్యాల్ని తిరస్కరించడం

ఒక మనిషి తాత్త్వికంగా సత్యాన్వేషణకు పూనుకోవడమంటే 'నీరస తథ్యాల్ని' తిరస్కరించడం. 'నిశ్చల నిశ్చితాల' ని పక్కకు నెట్టేయడం. కాబట్టే, సత్యాన్వేషణ అన్ని వేళలా సంతోషానికీ, మనశ్శాంతికీ దారితియ్యకపోగా, నిరంతర ఆత్మశోధనకీ, సంశయగ్రస్తతకీ, ఆత్మవేదనకీ దారితియ్యడం ఆశ్చర్యం కాదు. అలాగని మనం సత్యాన్వేషణని ఆపలేం. పక్కనపెట్టేయలేం. 'నిత్య నిరుత్తరపు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం' అని తెలిసికూడా మన వివేచనని కట్టిపెట్టలేం.

తెలుగు జర్నలిజం, మాండలికాలు

ఇంకా చిత్రమేమిటంటే దాదాపుగా ప్రతి పత్రికలోనూ ఆయా పత్రికా సంపాదకులు ప్రతి రోజూ రాసే సంపాదకీయాల్లో కనిపించే తెలుగు పూర్తి గ్రాంథికఫక్కీలోనే ఉండటం. ఎంత మంది ఆటోడ్రైవర్లు, హోటలు సర్వర్లు, రైతుకూలీలు, చివరికి వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు తమ సంపాదకీయాలు చదువుతున్నారో తెలుసుకోడానికి ఇప్పటిదాకా ఏ పత్రికాసంపాదకుడూ ప్రయత్నించిన సంగతి నేను వినలేదు.