ఆ రోజునుంచీ ఆమె తిరువాయిమొళి అనే సముద్రంలో మునకలేస్తూనే ఉంది. ప్రతి ఒక్క పాశురంలోని, ప్రతి ఒక్క పదబంధాన్నీ ఆమె చేతుల్లోకి తీసుకుని చూసింది. ప్రతి మాట మలుపులోనూ మునకలేసింది. భక్తుణ్ణి భగవంతుణ్ణి సంబోధించిన ప్రతి ఒక్క పిలుపునూ- పెరుమాళ్ తిరుమాళ్, మాల్, అప్పన్, అమ్మాన్, మాయోన్- ప్రతి ఒక్క పేరునూ తను కూడా బిగ్గరగా పలికి చూసింది.
చినుకులు రాలుతున్న రాత్రి
ఇప్పుడు ఈ పూర్తి తెలుగు అనువాదంలో నమ్మాళ్వారు కావ్యమహిమ ఏమిటో నాకు కొంతేనా బోధపడింది. ముఖ్యంగా ఆయన అనుభూతి గాఢతలోనూ, అభివ్యక్తిలోనూ ఎంతో అత్యాధునికంగా కనిపించాడు. రానున్న కాలంలో మళ్ళా మళ్ళా ఈ కావ్యనదీప్రవాహంలో ఎలానూ మరెన్నో మునకలు వేయబోతాను. కాని మొదటి మునకలోనే ఆ కావ్యమెంత శుభ్రవాక్కునో నాకు అనుభవానికి వచ్చిందని చెప్పక తప్పదు.