ఒక మాట

చివరికి ఇన్నాళ్ళకి, అంటే ఈ రచన మొదలుపెట్టిన 36 ఏళ్ళ తరువాత, ఇలా పూర్తిచేయగలిగాను. నా జీవితంలో సుదీర్ఘకాలం తీసుకున్న రచనగా ఇది మిగిలిపోతుంది.

ఆ వెన్నెల రాత్రులు-30

అన్నిటికన్నా ముందు యువతీయువకుల తొలియవ్వనకాలంలో అటువంటి మనఃస్థితి ఉంటుందని గుర్తుపట్టడం ఒక విద్య. ప్రేమ విద్య. కాని మహాకవి చెప్పినట్లుగా ఆ విద్య ఇంట్లో తల్లిదండ్రులు చెప్పరు, బళ్ళో ఉపాధ్యాయులు చెప్పరు, దానికి పాఠ్యపుస్తకాలూ, సిలబస్, కరికులం ఎలా ఉంటాయో తెలియదు. ప్రేమ అంటే యాసిడ్ దాడిగానే పరిణమించే కళాశాలలు మనవి. ఇంక ప్రేమ అంటే ఏమిటో చెప్పేవాళ్ళెవరు? కవులూ, రచయితలూనా?  ప్రేమ వల్ల కాక, ప్రేమరాహిత్యం వల్లనే మనుషులు కవులుగా మారే సమాజం మనది.

ఆ వెన్నెల రాత్రులు-29

దాన్ని అంటిపెట్టుకుని ఏకంగా ఒక అడవిమొత్తం నాదాకా ప్రయాణించి వచ్చింది. దానిమీద మాఘఫాల్గుణాల వెన్నెల కురిసి ఉంటుంది. నక్షత్రధూళి రాలి పడి ఉంటుంది. ఆ పువ్వు రంగులు పోసుకుంటున్నప్పుడు ఎంతో సూర్యరశ్మి దాని ఈనెల్లోకి ప్రవహించి ఉంటుంది. అప్పటికే సగం వాడిపోతూ ఉన్న ఆ పువ్వుని చేత్తో పట్టుకున్నాను. భగవంతుడా! అతని ఉత్తరాలు, మాటలు, చివరికి ఆ కవితలు కూడా చొరలేని ఏదో తావుని ఆ తేనెమరక స్పృశించింది. అది నా గుండె మీద సన్నని గాటుపెట్టింది.