కథ కాదు, ఒక సంస్కారం

మనుషులు కలిసి మెలిసి జీవించడంలోని సంతోషం. కలిసి బతకడం, ఒకరికోసం ఒకరు బతకడం. కలిసి పనిచెయ్యడం. వేదకాలపు మానవుడిలాగా నూరు శరత్తులు చూడాలనుకోవడం, హీబ్రూ ప్రవక్తలాగా, మనిషి ఒక సామాజిక ఆత్మతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడని నమ్మడం. రెండవప్రపంచ యుద్ధకాలంలో సోవియెట్ రచయితల్లాగా మనుషులు కలిసి పోరాటం చెయ్యడం ద్వారానే మానవాళిని బతికించుకోగలరని నమ్మడం.

ప్రసంగకళని దాటిన మధురనిశ్శబ్దం

కవిత్వం మొదటిదశలో ప్రసంగం, రెండవ దశలో పద్యం. కాని మూడవ దశలో ప్రార్థనగా మారాలి. ప్రసంగదశలో కవి ఉన్నాడు, ప్రపంచముంది. రెండవ దశలో కవి ఉన్నాడు, ప్రపంచం లేదు, కాని కవి అంతరంగముంది. మూడవ దశలో కవి కూడా అదృశ్యమై కేవలం అంతరంగమొకటే మిగలవలసి ఉంటుంది. అప్పుడు, అటువంటి దశలో, పలికిన మాటలు మంత్రాలవుతాయి.