కాంతికోసం తెరుచుకుని

ఎన్నాళ్ళుగానో ఓ కోరిక, ఓ కల, తెల్లవారగానే ఇంటిముంగిట్లో ఒక తామరపూల కొలను కనబడాలని,కనీసం ఒక తొట్టెలోనైనా ఒకటిరెండు తామరపూలేనా వికసిస్తుంటే చూడాలని. అద్దె ఇల్లే కానీ, ఇన్నాళ్ళకు ఈ కల నిజమయ్యింది, ఆదివారం తెచ్చి ఒక తామరతీగ తొట్టెలో నాటానా, రాత్రి కురిసిన రహస్యపు వానకి, తెల్లవారగానే- 'చూసావా, పువ్వు పూసింది' అన్నాడు ప్రమోద్.

పూలాజీ బాబా సన్నిధిలో

గురువారం పొద్దున్నే ఫూలాజీబాబాని చూడాలని పట్నాపూర్ వెళ్ళాం. ఉట్నూరునుంచి ఆసిఫాబాదువెళ్ళే దారిలో లోపలకీ ఉండే ఒక గిరిజన కుగ్రామం. పత్తిచేలమధ్య, సోయాపొలాలమధ్యనుంచి ప్రయాణం. ఇరవయ్యేళ్ళకిందట మొదటిసారి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎవరో నాతో ఇక్కడొక సిద్ధపురుషుడున్నాడని చెప్తే ఆయన్ను చూడటానికి వెళ్ళాను. సద్గురు ఫూలాజీ బాబా ఆంథ్ తెగకు చెందిన గిరిజన రైతు. నేను వెళ్ళేటప్పటికి ఆయన తన జొన్నచేలో కంచె కట్టుకుంటున్నాడు. నాతో చాలా ఆదరంగా మాట్లాడేడు.

అమృతానుభవం చెంత

సంత్ జ్ఞానేశ్వర్ రాసిన అమృతానుభవాన్ని తెలుగులోకి అనువదించమని గంగారెడ్డి చాలాకాలంగా అడుగుతున్నాడు. ఆ పుస్తకాన్ని ఎవరైనా మరాఠీ పండితుడి ద్వారా ఒక్కసారైనా విని ఆ పనికి పూనుకుంటానని చెప్తూ వచ్చాను. నిన్నటికి ఆ అవకాశం దొరికింది. మాకోసం పల్దెప్రసాద్ అదిలాబాదులో ఒక మరాఠీ పండితుణ్ణి వెతికి పెట్టాడు. నిన్న పొద్దున్న రవీంద్రకుమారశర్మగారి కళాశ్రమంలో చావర్ డోల్ గిరీష్ అనే పండితుడు తానే స్వయంగా మా దగ్గరకొచ్చి అమృతానుభవం లోంచి కొన్ని ఓవీలు వినిపించి వాటి ప్రతిపదార్థ తాత్పర్యం వివరించాడు.