సుకవి

జాషువా తెలుగు పద్యానికొక కొత్త వన్నెని తీసుకొచ్చాడు. వెన్నలాగే సాగే ఒక లాలిత్యం, ఒక నైగనిగ్యం, గంగా ప్రవాహంలాంటి నిర్మల ధార జాషువా పద్యం సాధించుకుంది. అవే ఆయన్ను తెలుగు ప్రజలకు ప్రీతిపాత్రుణ్ణి చేసాయి. బహుశా బమ్మెరపోతన తర్వాత, తిరుపతి వెంకట కవుల తర్వాత తెలుగు ప్రజల నాలుకల మీద నానగలిగే లక్షణాన్ని జాషువా పద్యమే చూపించగలిగిందని చెప్పవచ్చు.

ఆ బంభర నాదం

అలా ఒక రసజ్ఞుడు ఎలుగెత్తి, మేఘగంభీర స్వరంతో పద్యాలు చదువుతోంటే, భయంతో, భక్తితో, వినమ్రతతో అట్లా ఆ రోజు రాజమండ్రి ఆ ఉద్గాత ముందు చెవి ఒగ్గినిలబడిపోయినట్టుగా ఇప్పుడు ఏ పట్టణమేనా చెవి ఒగ్గడానికి సిద్ధంగా ఉందా? ఏమై పోయింది ఆ కాలం? ఆ రసజ్ఞులు? తే వందినః? తాః కథాః?

విషాదమధుర వాక్యం

నా మానాన నా ఉద్యోగమేదో చేసుకుంటున్న నన్ను ఎంకి ఒక్కసారిగా చెదరగొట్టేసింది. ఇప్పుడు నాకు ఎన్నెలంతా నెమరేసిన ఆ యేరు, ఆ కొండ, ఆ తెల్లవారు జామున తేనెరంగు తిరిగే నెలవంక, గాలికి కూడా చోటివ్వని ఆ కౌగిలి- ఇవి కావాలనిపిస్తున్నది. అన్ని పనులూ పక్కన పెట్టేసి, ఇదిగో, ఈ పాట పదే పదే హమ్ చేయాలనిపిస్తున్నది: