కానీ ఒక చీనాచిత్రకారుడు సుదీర్ఘ పర్వతశ్రేణి, అనంతజలరాశి, అడవులు, గ్రామాలు, నావలు, ఋతువుల్ని చిత్రిస్తూ కూడా అపారమైన శూన్యతని తన చిత్రంలో ఇమిడ్చిపెట్టగలుగుతున్నాడు. దృశ్యాన్ని దర్శనంగా మార్చే విద్య అది.
చిత్రించగల ఆ చేతులు ఎక్కడ ?
ఆ చేతులు ధిక్కరించడానికీ, విలపించడానికీ కూడా చాతకానివి. ఆ చేతులకి మిగిలిందల్లా, ఆ దౌర్భాగ్యక్షణంలో ఒకరినొకరు పట్టుకోవడం, కలిసికట్టుగా మరణించడమే. సర్పక్రతువులో ఒకరినొకరు కావిలించుకుని హోమగుండంలో ఆహూతి కావడానికి వచ్చిపడుతున్న ప్రాణులు తప్ప వారు మరేమీ కారు.
నీటిరంగుల గాయకుడు
గొప్ప హిందుస్తానీ గాయకులు రాగాలాపన చేస్తున్నప్పుడు, రాగాన్నీ, ఆ రాగాన్ని ఆలపిస్తున్న కాలాన్నీ అనుసంధానించి తమ మనోధర్మాన్ని మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్టే, ఈ చిత్రకారులు కూడా ఏదో ఒక వేళ ఒక దృశ్యాన్ని చిత్రిస్తున్న నెపం మీద తమ మానసిక ప్రశాంతినే చిత్రిస్తుంటారు.