పావన దర్శనం

ప్రపంచంలో ఆదినుంచీ అన్ని మతాల్లోనూ, నాగరికతల్లోనూ రెండు భావధారలు సమాంతరంగా ప్రవహిస్తో వచ్చేయి. ఒకటి, మనిషిని మరింత మానవీయంగా తీర్చిదిద్దడానికి అతనికొక సామాజికతనూ, నైతికతనూ సమకూర్చడానికి రూపొందిన సాంఘిక ధర్మం. మరొకటి, అటువంటి ప్రయత్నాలు అంతిమంగా కృత్రిమంగా తయారవుతాయనీ, అవి మనిషిని అతడి యథార్థస్వభావానికి దూరంగా తీసుకుపోతాయనీ, అందువల్ల అతణ్ణి ఏవో కొన్ని సామాజిక సూత్రాలకు విధేయుడిగా మార్చడంకన్నా, అతనిలోని ఆ యథార్థస్వరూపాన్ని అతడికి గుర్తుచేస్తే చాలనే ఆత్మిక ధర్మం.

ఉదాహరణకి భారతదేశంలో వైదిక ధర్మం మనిషిని యాగశీలతవైపు నడిపించింది. యాగం అంటే సమష్టి కృషి. సమష్టి కృషినే వేదం సమ్యక్‌ కృషి అని కూడా అంది. ఆ విరాట్‌ పురుషుడికి అనంతమైన శిరాలు, బాహువులు, పాదాలు. అక్కడ వ్యక్తి ముఖ్యం కాడు. నలుగురి శ్రేయస్సూ ప్రధానంగా నలుగురూ కలిసిచేసే ప్రతి పనీ యజ్ఞమే అక్కడ. అయితే ఆ సమష్టికర్మని ఎలా నిర్వహించాలో చెప్పడానికి బ్రాహ్మణాలు వచ్చాయి. అధికార విభజన వచ్చింది. వర్ణవ్యవస్థ వచ్చింది. హెచ్చు తగ్గులు వచ్చాయి. క్షీరసాగరమథనం జరిగినప్పుడు అమృతం కొందరికే దక్కింది, అత్యధిక సంఖ్యాకులకి విషపానం వినా మరో దారి లేకపోయింది. ఆ అవ్యవస్థను ప్రశ్నిస్తో ఉపనిషత్తులు వచ్చాయి. ఆ దారిలోనే బుద్ధుడు కూడా ప్రయాణించి యాగశీలమానవుడి స్థానంలో యోగశీలమానవుణ్ణి ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు.

సరిగ్గా ప్రాచీనా చీనాలో కూడా ఇలానే జరిగింది. అక్కడ కూడా ఒక కృతయుగం ఉండేది. అప్పుడు మనుషులకి కూడబెట్టడం తెలియదు. సొంత ఆస్తి ముఖ్యం కాదు. ఒక మనిషి మరొక మనిషిని తనకు బానిసగా మార్చుకోవడమెలా అని ఆలోచించేవాడు కాదు. ఆ రోజుల్లో పండినపంటలో వండుకుని తినగా మిగిలినదాన్ని పొలాల్లో పారబోసేవారట. కాని ఆ కృతయుగం ఎప్పుడో అంతర్ధానమై చారిత్రిక యుగం మొదలుకాగానే మళ్ళా ఆ ప్రాచీన సాముదాయక సమసమాజాన్ని ఎలా తీసుకురావడం అన్న చింత, చింతన మొదలయ్యాయి. క్రీస్తుకు ఆరు శతాబ్దాల పూర్వం కన్‌ ఫ్యూషియస్‌ అనే సజ్జనుడు మనుషులు తాము తమ కుటుంబం పట్లా, రాజ్యం పట్లా, తోటిమనుషుల పట్లా నిర్వహించవలసిన ధర్మాలు సక్రమంగా నిర్వహిస్తే ఆ ప్రాచీన జీవితాదర్శాల్ని తిరిగి ఆచరణ సాధ్యం చెయ్యగలమని భావించాడు. ఆయన ఆలోచన, బోధనలు ప్రధానంగా నైతిక కార్యాచరణకి సంబంధించినవి. దాదాపుగా మూడువేల చీనా సమాజాన్నీ, చరిత్రనీ కన్‌ ఫ్యూసియస్‌ బోధనలు గాఢంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.

కన్‌ ఫ్యూసియస్‌ ఆలోచనలు మన వైదిక ధర్మం లాంటివి అని చెప్పవచ్చు. ఆయన కూడా మనుషులు స్వార్థత్యాగం ద్వారా, సామాజిక ఒడంబడికకు కట్టుబడి ఉండడం ద్వారా ప్రాచీన సత్యయుగాన్ని తిరిగి నెలకొల్పగలమని భావించాడు.

కాని, అందుకు సమాంతరంగా, మన ఉపనిషద్వాణిలాగా అక్కడ కూడా మనిషిలోని అత్యంత యథార్థ మౌలిక స్వభావం మీద దృష్టిపెట్టమనే హెచ్చరికలాంటి భావధార కూడా వికసించింది. దాన్నే డావోయిజం అన్నారు. కన్‌ ఫ్యూసియస్‌ కన్న వయసులో పెద్దవాడు, ఆయన సమకాలికుడు అయిన లావో-జే అనే ఆయన ఆ భావధారకు మూలకర్త.

లావోజి అంటే ఒక ఋషి అని మాత్రమే అర్థం. ఆయన దక్షిణ చైనాలో పుట్టాడనీ, ఝౌ చక్రవర్తుల ఆస్థానంలో రాజపత్రాల భాండాగారాన్ని నిర్వహించేవాడనీ, ఒకసారి క్రతువుల గురించి తెలుసుకోవడం కోసం కన్‌ ఫ్యూషియస్‌ ఆయన దగ్గరకు వెళ్ళాడనీ ఒక కథ ఉంది. కన్‌ ఫ్యూషియస్‌ కన్నా వయసులో పెద్దవాడైన లావోజి కన్‌ ఫ్యూసియస్‌ ను తన డంబం, పొగరు, దురుసుతనం వదులుకొమ్మని హెచ్చరించాడని కూడా ఆ కథ చెప్తుంది. ఆయన్ను కలిసి బయటకు వచ్చిన తరువాత కన్‌ ఫ్యూషియస్‌ తన శిషులతో ‘ఆకాశంలో రెక్కలతో ఎగిరే మహాసర్పం గురించి నేనింతకుముందు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూసాను’ అని అన్నాడని కూడా ఆ ఐతిహ్యం చెప్తున్నది. కాని, లావోజి అనే ఒక వ్యక్తి ఎవరూ చారిత్రికంగా లేరనీ, కన్‌ ఫ్యూసియస్‌ కన్నా పూర్వపు కాలం నుంచీ ప్రజల్లో ప్రచారంలో ఉన్న కొన్ని వివేకసూత్రాల్ని ‘డావో డె జింగ్‌’ పేరిట సంకలనం చేసారనీ నేడు పరిశోధకులు భావిస్తున్నారు.

చాలా బలంగానూ, బిగ్గరగానూ ఒక సామాజిక నైతికత గురించి కన్‌ ఫ్యూసియస్‌ మాట్లాడుతున్న తరువాత మరొక వివేకంతో పనేమిటి? అటువంటి వివేకమంటూ ఒకటుంటే దాని అవసరమేమిటి? ఈ ప్రశ్నకి జవాబివ్వాలంటే మొత్తం మానవజాతి చరిత్రనంతటినీ మనం పర్యావలోకించవలసి ఉంటుంది. మానవ చరిత్రలో చరిత్ర యుగం మొదలై అయిదువేల ఏళ్ళు మాత్రమే.

అంతకుముందు పాతరాతి యుగంలోనూ, కొత్తరాతి యుగంలోనూ మనిషి కొన్ని లక్షల సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతడు ప్రకృతిని ఆరాధించాడు. ప్రకృతి అంటే వట్టి భూమి మాత్రమే కాదు, ఆకాశమూ, అంతరిక్షమూ, పాతాళమూ అన్నీ కలిసిన ఒక సమగ్రస్వరూపం. ఆ ప్రకృతిని ఆ కాలపు మనిషి ఒక తల్లిగా కొలిచాడు. కాని చరిత్ర యుగం మొదలుకాగానే, ఆ ప్రాచీన పృథ్వి భూమ్యాకాశాలుగా విడిపోయింది. రాతియుగం నుండి కాంస్యయుగంలో అడుగుపెట్టగానే మనిషి భూమిని ద్వితీయశ్రేణికి నెట్టి ద్యులోకదేవతలకు ప్రాధాన్యతనివ్వడం మొదలుపెట్టాడు. సుమేరులో, ఈజిప్టులో, గ్రీసులో, సప్తసింధులోయలో ప్రతి ఒక్కచోటా ఇదే జరిగింది, చివరికి చీనాలో కూడా.

కానీ ఇలా ఆకాశదేవతల్ని ముందుకు తీసుకురావడం మీద ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తిరుగుబాట్లు తలెత్తాయి. ఈ కొత్త దేవతల్ని నిరాకరిస్తూ, ప్రాచీన పృథ్వీ దేవతనే, ఆ మాతృదేవతనే ఆరాధించడంలో ఎక్కువ మానవత్వం, సమత్వం, సున్నితత్వం ఉంటాయని ఆ ఆరాధకులు భావించారు. అటువంటి ఒక ప్రాకృతిక స్థితికి మరలిపోవాలన్న ఆకాంక్షలోంచి డావో డె జింగ్‌ రూపుదిద్దుకున్నది. సృష్టికి కారణమైన ఆ శక్తిని, సూత్రాన్ని ఆ గ్రంథం ‘డావో’ అన్నది. డావో అంటే దారి, మార్గం, నడక, ఒక సూత్రం, సత్యం అని అనువదిస్తూ వచ్చారు. కాని అవేవీ కాదు కూడా. దానికి ఏ పేరుపెట్టినా దాని స్ఫూర్తిని సంకుచితపరచడమే అవుతుంది. దాన్ని ఏ పేరుతోనూ వివరించలేం కాబట్టి డావో అంటున్నాం. అది సృష్టిలో సహజంగా సంభవించే ఒక ప్రసూతి. ఆ ప్రసూతికి ఏ ప్రత్యేక ఉద్దేశ్యమూ లేదు. ఆ సృష్టి తిరిగి మళ్ళా లయమైనప్పుడు తిరిగి పునఃసృష్టిగా మారుతుంది.

నిత్యనిరంతరాయంగా సంభవించే ఒక ప్రక్రియ అది. ఆ ప్రక్రియలో మనం ఎటువంటి జోక్యం చేసుకున్నా, ఏ విధంగా సరిదిద్దాలని చూసినా అది వినాశకారిగానే మారుతుంది తప్ప మనిషికీ, సృష్టికీ కూడా ఏ విధంగానూ సహకరించదు.

మనం చూస్తున్న ప్రపంచంలో ‘పదివేలవిషయాలు’ ఉన్నాయి. కానీ ఆ పదివేల రూపాలకి కారణమైన దానికి రూపం లేదు. దాన్ని లావోజి ‘లేకపోవడం’అన్నాడు, ‘శూన్యం’ అన్నాడు. అది ఋగ్వేదంలో నాసదీయ సూక్తం లో చెప్పినట్లుగా అనస్తిత్వం. అది అన్ని రకాల ద్వంద్వాలకి అతీతం కాబట్టి దాన్ని తెలుసుకోవడం ద్వారా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని నిచ్చెన మెట్ల వ్యవస్థను తప్పించుకోగలుగుతాం.

ఒకసారి ఆ డావో ఎరుకపడ్డాక, దాన్న్ని గౌరవించడం ‘డె’. డె అనే మాటకి బలం, జీవం, ప్రాణం, ఆచరణ, నడత లాంటి అర్థాలు చెప్పవచ్చు. నిజానికి ‘డె’ అనే భావన కన్‌ ఫ్యూసియస్‌ తత్త్వశాస్త్రంలో కూడా ఉంది. దాన్ని ఆకాశం లేదా స్వర్గం మనుషులకు విధించిన శాసనం పట్ల చూపించవలసిన బాధ్యతగా ఆయన గుర్తించాడు. ఆకాశం మనుషుల పట్ల విధించిన బాధ్యత ఏమిటి?

అత్యంత ప్రాచీన, పౌరాణిక కాలంలో చీనాని పరిపాలించిన జియా రాజవంశం ప్రకృతి ఆరాధకులు. వారిని పక్కకునెట్టిన షాంగ్‌ రాజవంశం తమ అర్చాపీఠం మీద ఆకాశాన్ని ప్రతిష్టించారు. కాని ఆకాశం పేరిట, స్వర్గం పేరిట వారు తొందరలోనే నిరంకుశులుగా, క్రూరులుగా మారిపోయేరు. అందువల్ల వారి స్థానంలో ఝౌ రాజ్యపాలన తప్పలేదు. అయితే ఝౌ చక్రవర్తులకి ఒక నైతిక సమస్య ఏర్పడిరది. ఒకవేళ షాంగ్‌ చక్రవర్తులు దైవాంశ సంభూతులే అయితే, ప్రజల్ని పరిపాలించడం వారికి దేవుడిచ్చిన హక్కు అయితే, తాము ఆ పరిపాలనని తమ చేతుల్లోకి ఎట్లా తీసుకోగలరు? అందుకు సమాధానంగా వారు చెప్పుకున్నదేమంటే, దేవుడు ఏ రాజవంశానికైనా పాలనాధికారాన్ని శాశ్వతంగా ఇవ్వడనీ, ఏ రాజైనా ధర్మాన్ని పాటించినంతవరకే అతడికి పాలనాధికారం ఉంటుందనీ, ధర్మం తప్పిన మరుక్షణమే పాలనాధికారం పోతుందనీ వారు నమ్మారు. దాన్ని తియాన్‌ (ఆకాశం) మింగ్‌ (శాసనం) అన్నారు.

కాని డావో డె జింగ్‌ చేసిన పని ఏమిటంటే, మనుషులు పాటించవలసిన బాధ్యతను తియాన్మింగ్‌ నుంచి తప్పించడం. ఇంకా చెప్పాలంటే, ఆకాశాన్ని పక్కకు నెట్టి మళ్ళా భూమిని అర్చాపీఠం మీద ప్రతిష్టించడం. తియాన్మింగ్‌ స్థానంలో డావో ని తీసుకురావడం. అంటే మానవప్రయత్నాల కృత్రిమత్వం స్థానంలో ప్రాకృతిక సహజత్వానికి పట్టం కట్టడం. ఆకాశదేవతల్ని ఆరాధించే కన్‌ ఫ్యూషియస్‌ వంటివారి దృష్టిలో కాలం సరళరేఖీయం, చారిత్రికం, కాలెండరీయం. కానీ డావో ని నమ్మేవారి కాలం ఋతుపరిభ్రమణశీలం, వర్తులం. కన్‌ ఫ్యూషియస్‌ దృష్టిలో మనిషికీ, ఆకాశానికీ ఉన్న సంబంధం సామాజికం, నైతికం. డావో దృష్టిలో మనిషికీ ప్రకృతికీ ఉన్న సంబంధం తల్లికీ, బిడ్డకీ ఉన్న సంబంధంలాంటిది. అది ప్రాకృతికం, దానికి ఎటువంటి ప్రయోజనాల్నీ, పరమార్థాల్నీ అంటకట్టలేం.

ఇటువంటి భావాలతో రాసిన 81 ఖండికల సంపుటం డావో డె జింగ్‌. అయిదువేల అక్షరాలకు మించని ఆ చిన్న రచన చీనా సంస్కృతిమీద చూపించిన ప్రభావం అపారం. తర్వాత రోజుల్లో చీనా కవిత్వాన్ని, కళల్ని, చిత్రలేఖనాన్ని ప్రతి ఒక్కదాన్నీ డావోయిజం గాఢంగా ప్రభావితం చేసింది. ఇక ఆధునిక కాలానికి వస్తే, ప్రపంచ వ్యాప్తంగా డావో డె జింగ్‌ పట్ల ఆసక్తి నానాటికీ పెరుగుతూనే ఉన్నది. ఆ పుస్తకం చదివినవారికి, ప్రాచీన గ్రీకు తాత్త్వికులు హెరాక్లిటస్‌, లుక్రీషియస్‌ మొదలుకుని ఆధునికయుగంలో థోరో, గాంధీ దాకా, ఎందరో గుర్తుకు రాకుండా ఉండరు. ఎంతో భావగర్భితంగానూ, కవితాత్మకంగానూ ఉండే ఆ చిన్న చిన్న ఖండికలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో పదేపదే అనువాదమవుతూనే ఉన్నాయి.

డావో డె జింగ్‌ ఒక దర్శనం, ఒక కావ్యం మాత్రమే కాదు, ఒక రాజకీయ రచన కూడా. ఎందుకంటే ఝౌ చక్రవర్తుల పాలన బలహీనపడ్డాక ఒక ప్రశ్న ముందుకొచ్చింది. ఒక రాజు రాజు కావాలంటే అర్హత ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబుని అన్వేషిస్తూనే నూరు దర్శనాలు ప్రభవించాయి. కన్‌ఫ్యూషియస్‌, అతడి అనుయాయులు చెప్పేదేమంటే, ఒక రాజు తియాన్మింగ్‌ని పాటించినంతవరకే అతడికి రాజుగా కొనసాగే అర్హత ఉంటుంది. కాని ఆ రాజవంశంలో వారసులు లేకపోతే? అప్పుడు పాలనాధికారానికి యోగ్యులైన కుటుంబసభ్యుల్ని వెతకవలసి ఉంటుంది. విద్య ద్వారా, నైతిక శిక్షణ ద్వారా అటువంటి అర్హుల్ని మనం తయారు చేసుకోవలసి ఉంటుంది అని కన్‌ ఫ్యూసియస్‌ భావించాడు. అటువంటి శిక్షిత, సంస్కారవంతుల్ని ఆయన ‘జున్జి’ అని పిలిచాడు. మరొకవైపు మోహిస్టులనే లీగలిస్టులు దీన్ని అంగీకరించలేదు. వారి దృష్టిలో పాలనాధికారం రక్తసంబంధీకులకే చెందవలసిన పనిలేదు. ఆ అర్హత ఎవరికి ఉంటే వారు పాలకులు కావచ్చు అని వారు వాదించారు.

కాని డావో డె జింగ్‌ ఈ రెండు వాదనలనీ నిరాకరించింది. డావో ప్రతిపాదించిన రాజు ప్రధానంగా వివేకవంతుడు. అతడసలు పరిపాలించడు. ప్రజల్ని పాలితులుగా కాక అతిథులుగా భావిస్తాడు. ఎందుకంటే అన్నిరకాల ప్రగతిశీల ప్రయత్నాలు అంతిమంగా యుద్ధానికే దారితీస్తాయని అతడికి తెలుసు. అటువంటి ఎరుక కలిగిన ఆ రాజుని లావో జి ‘షెన్‌ గ్రెన్‌’ అన్నాడు. అతడు జనకుడిలాగా రాజర్షి. మార్కస్‌ అరీలియస్‌ లాగా Philosopher-King.

కాని అటువంటి ఒక పాలన ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. నిజానికి అటువంటి ఒక పాలన సాధ్యం కాదన్న నిస్పృహతోనే లావో జే, ఝౌ సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. అతడు రాజ్యం పొలిమేరలు దాటగానే అక్కడ కనుమకు కాపలా కాస్తున్నవాడు లావో జే తెలుసుకున్న సత్యాన్ని తనకు రాసిమ్మని అడిగాడట. అలా వచ్చిందే ఈ గ్రంథం. కాబట్టి ఆ ఆలోచనలు ఆచరణ సాధ్యం అయినా, కాకపోయినా నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో anti-authoritarian movements కి డావో డె జింగ్‌ స్ఫూర్తిగా నిలుస్తున్నదన్న మాట కూడా కాదనలేం.

2

ఇరవయ్యవ శతాబ్దం మొదలయ్యాక డావోయిజం పట్ల తక్కిన ప్రపంచానికి మరింత ఆసక్తి పెరిగింది. లావో-జే రాసాడని చెప్పే డావో-డె-జింగ్‌ కు విస్తారంగా అనువాదాలు రావడం మొదలయ్యింది. అయితే ప్రతి అనువాదకుడూ తనకన్నా ముందు అనువాదకులు డావోని సరిగా అర్థం చేసుకోలేదనీ, తాను మూలానికి మరింత సన్నిహితంగా పోడానికి ప్రయత్నిస్తున్నాననీ చెప్పుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకి డావో ని ఇంగ్లిషులోకి అనువదించిన మొదటి అనువాదకులు దాన్ని the way అని అనువదించారు. కాని డావో అంటే దారి కాదని డావో -డె-జింగ్‌ చదవగానే మనకి స్ఫురిస్తుంది. అసలు డావో ఏ ప్రయాణం గురించీ మాట్లాడదు. ఎక్కడికీ వెళ్ళడం గురించి చెప్పదు. డావో దానికదే ప్రయాణం. దానికదే గమ్యం. అసలు గమ్యం అనే మాట కూడా డావో దర్శనానికి విరుద్ధం. అందుకని హెన్రీ బోరెల్‌ (1869-1933) అనే ఒక డచ్‌ రచయిత 1897 లో డావో డె జింగ్‌ ని మళ్ళా అనువదించాడు. 1919 లో ఆయన Wisdom and Beauty from China అనే పుస్తకం వెలురించాడు. అందులో మూడు అధ్యాయాల ఒక కాల్పనిక రచనను కూడా పొందుపరిచాడు. ఔబ-ఔవఱ పేరిట ప్రసిద్ధమైన ఆ రచనలో ఆయన డావోయిజం స్ఫూర్తిని తన మాటల్లో ఒక కథగా పాఠకులముందు ఉంచడానికి ప్రయత్నించాడు.

ఆ కథలో రచయిత చీనా సముద్ర తీరంలో ఒక చిన్న దీవిమీద ఒక డావోయిస్టు సాధువుని కలుసుకుంటాడు. ఆయన్ని ప్రేమ గురించీ, కళ గురించీ, కవిత్వం గురించీ, సృజన గురించీ, జన్మమృత్యువుల గురించీ, జీవితపరమార్థం గురించీ ప్రశ్నిస్తాడు. ఆ సాధువు తనని కలుసుకోవడానికి వచ్చిన జిజ్ఞాసి ఒక పాశ్చాత్యుడనీ, అతడు ‘యూరపియన్‌ పండితులు అసంపూర్ణంగా చేసిన అనుచిత అనువాదాలు చదువుకుని వచ్చినవాడనీ’ గ్రహించి అతనిడికి డావో గురించి ఏ విధంగా తెలియచెప్పాలో ఆ విధంగా చెప్తాడు.

ఆ సంభాషణ సారాంశాన్ని డా.కాళ్ళకూరి శైలజగారు తన జీవితానుభవమ్మీద అర్థం చేసుకుని తిరిగి మనకీ రచనగా అందిస్తున్నారు. అలాగని ఈ పుస్తకం వూ-వెయికి అనువాదం కాదు. వూ-వెయిని ఈ రచనకు స్ఫూర్తి అనవచ్చు. మరోలా చెప్పాలంటే, డావోని తెలుసుకోవడం కోసం ఆమె ‘వూవెయి’ చెయ్యిపట్టుకుని నడిచారనీ, ఒకసారి ఆ దారమ్మట నడిచి వచ్చ్చాక, ఆ మార్గాన్ని సాకల్యంగా చూసుకున్నాక, ఇప్పుడు మనల్ని తన వెంట తీసుకువెళ్ళడానికి, ఈ పుస్తకంతో మనముందు నిలబడ్డారనీ చెప్పవచ్చు.

సత్యాన్ని తెలుసుకోదలుచుకున్నవాళ్ళు ప్రశ్నిస్తూ ఉండగా, జ్ఞానులు ఆ ప్రశ్నలకు జవాబులు చెప్తున్నట్లుగా సత్యవిచారణ చెయ్యడం ఒక ప్రాచీన ప్రక్రియ. ఉపనిషత్తులు ఇటువంటి సంభాషణల రూపంలోనే ఉంటాయి. బుద్ధుడి దీర్ఘసంభాషణలు, సోక్రటీసు సంభాషణలు కూడా ఇటువంటివే. ఆధునిక యుగంలో ఖలీల్‌ జిబ్రాన్‌ ‘ప్రవక్త ’ కూడా ఇటువంటి ప్రశ్నోత్తరరూపంలోనే సాగుతుందని మనకు తెలుసు.

హెన్రీ బోరెల్‌ తన రచనను కూడా ప్రశ్నోత్తర రూపంలోనే రాసాడు. శైలజగారు ఈ రచనను తిరిగి ప్రశ్నోత్తరాలుగా మనకి అందిస్తున్నప్పుడు ఆమె తన రచనకి ఒక సందర్భాన్ని ప్రస్తావించారు. ‘తొలి అడుగు ‘పేరిట ఆమె ప్రస్తావించిన సందర్భం ఈ రచనకు కీలకం. ఎందుకంటే, ఆమె ఇప్పుడు డావో గురించి ఎందుకు మాట్లాడుతున్నారో, మనకు ఎందుకు చెప్పాలనుకుంటున్నారో, ఆ సందర్భంలో స్పష్టంగా వివరిస్తున్నారు. ఆమె వేసుకున్న ప్రశ్న ఇది:

‘ఇంతకూ మనిషికి మరో మనిషి తోడు ఎందుకు కావాలి? అసలు అవసరమా? సంఘ జీవనవిధానంలో భాగంగానా? కాలక్షేపం కోసమా? స్నేహం కాక జీవితభాగస్వామి గురించి ప్రస్తావిస్తే ‘నాది’ అంటూ సొంతం చేసుకునేందుకా? అధికారంతో స్వార్థం వెళ్ళగక్కేందుకా? పోనీ ఓదార్పు కోసమా? కష్టసుఖాల్లో తోడుగా ఉండాలనా?’

ఇది స్పష్టంగా మనిషిలోని సామాజిక పార్శ్వం వేసుకునే ప్రశ్నలు. దీనికి జవాబు చెప్పడానికే యజ్ఞయాగాదులూ, కన్‌ఫ్యూషియసూ, సమస్త పాశ్చాత్య తత్త్వశాస్త్రమూ ముందుకొచ్చాయి. కాని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి చెప్పిన మాటలు సుప్రసిద్ధాలు. మనిషికి తన ఆత్మ ప్రియమైంది కాబట్టే, అతడు తన ఆత్మను ఎవరెవరిలో చూస్తున్నాడో వారందరినీ ప్రేమిస్తున్నాడని చెప్తాడు యాజ్ఞవల్క్యుడు.

శైలజ గారి ఈ రచన అటువంటి ఆత్మసాక్షాత్కారం దిశగా నడవడంలో ఆశ్చర్యం లేదు. ఒక అన్వేషిగా ఆమె వేసుకున్న ప్రశ్నలూ, అందుకు ఆమెకి లభించిన సమాధానాలూ ఈ అపురూపమైన రచనగా మనచేతుల్లోకి వచ్చాయి. అలాగని మనం తొందర తొందరగా ఈ పుస్తకం చదివేసి ఇది మనకు తెలిసిన విషయమే అని పక్కన పెట్టేస్తే మనం పొరబడ్డట్టే. ఇందులో అన్వేషకుడు కూడా ముందు ఆ పొరపాటే చేస్తాడు. ఆ సందర్భంగా జరిగిన ఈ సంభాషణ చూడండి:

కాబట్టి అటువంటి ‘చేటు సంభ్రమానికి’ లోను కాకుండా మనం ఈ రచనని చదవవలసి ఉంటుంది. అలాగని డావో మరొక ప్రత్యేకసత్యమని మనం భావించకూడదు. నిజానికి ఈ రచన చదువుతున్నంతసేపూ, ఉపనిషత్తుల్ని చదువుతున్నట్టుగా, జలాలుద్దీన్‌ రూమీ కవిత్వం చదువుతున్నట్టుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. మాటలు వేరుగాని, స్ఫూర్తి ఒక్కటే. ఈ మాటలు చూడండి:

ఇక మీదట నీఎదుగుదల తప్పక నీ స్వయంకృతం కావాలి. అదంతా ఏవిధంగానో నువ్వే స్వయంగా తెలుసుకోవాలి. మనసులో నెమ్మదిగా, సాధు స్వభావిగా ఉండు.అప్పుడు ఏవిధమైన ప్రయత్నం లేకనే, అంతా తెలుసుకుంటావు, ఒక చిన్నపాప పూలను కనుగొన్నంత సులభంగా.

ఒక చిన్నపాప పూలని గుర్తుపట్టినంత సులభంగా మనం మనల్ని గుర్తుపట్టగలం. అదే డావో అని అంటున్నప్పుడు గీతాంజలినీ, కబీర్‌ని చదువుతున్నట్టుగా కూడా ఉంది. అత్యంత సుకుమారమైన జెన్‌ కవిత్వం చెప్తున్నదంతా కూడా ఇదే కదా అనిపిస్తున్నది.

3

ఈ రచన తెలుగువాళ్ళకొక అపురూపమైన కానుక. డా.శైలజగారిని కవిగా, భావుకురాలిగా, సాహిత్యవిశ్లేషకురాలిగా మాత్రమే తెలిసివున్న మనకి ఈ పుస్తకం ద్వారా ఆమె ఒక ‘పావన దిజ్ఞ్మండలాన్ని’ దర్శించారనీ, ‘సంపూర్ణ నిర్మల శాశ్వతత్వం లో ఉండే అన్ని ఆత్మలకీ’ ఆమె ఒక పవిత్ర సంగమం కాగలిగారనీ తెలుస్తుంది. ఇందుకు డా.శైలజగారికి కాదు, తెలుగు పాఠకప్రపంచానికి అభినందనలు తెలుపుతున్నాను.


ఈ పుస్తకం ఈ రోజు విడుదలవుతున్నది. కావలసినవారు అనల్ప బుక్స్ ని సంప్రదించవచ్చు. వెల. రు.150/-

9 -6-2023

5 Replies to “పావన దర్శనం”

  1. Tao అంటే త్రోవ (దారి/పద్దతి/ఉపాయము)
    Dao అంటే దావ( In Rayalaseema slang) 😊

    1. చీనాభాష ఉచ్చారణ పద్ధతులు మార్చకముందు తావో అనేవారు. ఇప్పుడు దాన్ని డావో అంటున్నారు.

      1. I know sir, but it’s just for a pretty conversation with you😍✨❤🙏

Leave a Reply

%d