
ఆ మధ్య పద్మ ఇంట్లో పుస్తకాల బీరువాలో ‘కోసక్కులు’ నవల కనబడింది. తీసి చూసాను. 1982 లో ప్రచురణ. ఆర్వియార్ అనువాదం. ఏడు రూపాయల వెల. అర్థరూపాయికీ, పావలాకీ కూడా మహత్తరమైన సోవియెట్ సాహిత్యం రోడ్ల మీద గుట్టలుగా పోసి అమ్ముతున్న కాలంలో ఏడురూపాయలు చిన్న మొత్తం కాదు. అయినా ఆ నవల ఒకటో రెండో కాపీలు ఆ రోజుల్లోనే కొనుక్కున్నాననీ, కానీ చదవకుండానే ఎవరికో ఇచ్చేయడమో లేదా ఎవరొ పట్టుకుపోవడమో జరిగిందనీ గుర్తొచ్చింది. ఆ రోజుల్లో టాల్ స్టాయి ని ‘అనా కెరినినా’, ‘యుద్ధము-శాంతి’ నవలలు రాసిన రచయితగానే ఆరాధించేవాణ్ణి కాబట్టి, పైగా ఈ పుస్తకం తొలిరోజుల్లో పుస్తకం అన్న కారణం వల్ల కూడా అప్పట్లో చదవనే లేదు. Sebastopol stories, Childhood Adolescence and Youth కూడా తొలిరోజుల పుస్తకాలేగాని, అవి ఇంగ్లిషులోనే కూడబలుక్కుని చదివినవాణ్ణి, ఈ తెలుగు అనువాదం కొనుక్కుని కూడా ఎందుకు చదవలేకపోయానో తెలియదు. కాని పద్మ దగ్గర్నుంచి ఆ పుస్తకం తెచ్చుకున్నవెంటనే చదువుదామని మొదటి పుట తెరిచినవాణ్ణి మొత్తం 260 పేజీలూ ఆపకుండా చదివేసాను. ఆ పుస్తకం చదవకపోవడం ద్వారా నా యవ్వనకాలానికి నేను చాలా అన్యాయం చేసుకున్నానని అనిపించింది, చివరి పుట మూసేసాక.
అప్పణ్ణుంచీ ఆ పుస్తకం గురించి రాద్దామని అనుకుంటూనే ఉన్నానుగాని, కాకసస్ పర్వతశ్రేణి రష్యన్ ఇమేజినేషన్ నీ, సాహిత్యాన్నీ దాదాపు రెండు శతాబ్దాల పాటు ఏ విధంగా ఆవహించిందో తెలిసాక, ఆ పూర్వరచనలన్నీ మళ్ళా చదవడం మొదలుపెట్టాను. ముఖ్యంగా లెర్మంటోవ్ ‘మనకాలం వీరుడు.’ సమస్య ఎక్కడొస్తుందంటే, ఇలాంటి పుస్తకాలన్నీ చిన్నప్పుడు కథకోసం చదువుకుంటూ పోతాం. ఆ కథ మాత్రం ఆ వయసులో మనకేమి అర్థమవుతుందని? బహుశా ఒక మనిషి అరవయ్యేళ్ళొచ్చాక, మళ్ళా తాను చిన్నప్పుడు చదివిన పుస్తకాలన్నీ మరోసారి చదవడం మొదలుపెట్టాలేమో. అప్పుడు కాని ఆ కథలు ఏం చెప్తున్నాయో నిజంగా అర్థం కాదు.
ఉదాహరణకి పుష్కిన్ , లెర్మంటోవ్ లు కాకసస్ గురించీ, కోసక్కుల గురించీ ఎటువంటి రొమాంటిక్ ఇమేజినేషన్ ని రష్యన్ మనస్సుకి అలవాటు చేసారో మనం అర్థం చేసుకుంటే తప్ప, టాల్ స్టాయి ముప్ఫై నాలుగేళ్ళ వయసులో (1863) రాసిన ఈ చిన్న నవల ఎంత రష్యన్ మనోప్రక్షాళనకు పూనుకుందో మనకి అర్థం కాదు. ఇవేవీ తెలియకుండా నా ఇరవయ్యేళ్ళప్పుడు ఈ నవల చదివి ఉంటే నేనేమి అనుభూతి చెందేవాణ్ణా అని ఆలోచించాను. ఈ సామాజిక-రాజకీయ చరిత్ర తెలియకపోయినా కూడా ఒక నిర్మలత్వమేదో నా మనసుని ఆవరించి ఉండేదని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే, టాల్ స్టాయి రచనలన్నిటిలోనూ ఇంత కవితాత్మకమైన రచన మరొకటి లేదు కాబట్టి.
రొమేరోలా ‘కోసక్కులు’ నవలని కావ్యం అన్నాడంటే ఆశ్చర్యం లేదు. టాల్ స్టాయి మీద రాసిన మోనో గ్రాఫులో మొదటి అధ్యాయంలో ఆయనిలా రాస్తున్నాడు:
‘ఈ మొత్తం రచనలన్నిటి కన్నా (తొలిదశలో రాసిన రచనలు), ఈ ప్రథమపర్వతశ్రేణిలో శిఖరాయమానంగా, టాల్ స్టాయి కలం నుంచి వెలువడ్డ అత్యంత సంగీతమయ ప్రేమకథ, ఆయన యవ్వన గీతం, కావ్యం అని చెప్పదగ్గ కోసక్కులు నిలబడుతుంది. ప్రకాశవంతమైన అకాశం నేపథ్యంగా ఉదాత్తమైన, గంభీరమైన తమ అంచుల్ని ప్రస్ఫుటింపచేసే హిమపర్వతాల వైభవం ఈ మొత్తం కృతిని సంగీతంతో నింపేసింది. అతడి ప్రతిభ అప్పుడప్పుడే వికసిస్తున్న కాలానికి చెందినందువల్ల ఈ పుస్తకాన్ని అద్వితీయం అని చెప్పవచ్చు. సర్వశక్తిమతుడైన యవ్వన దేవత కి చెందిన ఆ కాలం మరెన్నటికీ తిరిగి రాదని టాల్ స్టాయే రాసుకున్నాడు. ఎటువంటి ఊటబుగ్గ! ఎంత ప్రేమపొంగిపొర్లింది ఆ రచన నిండా!’
ఈ మాటల్లో అతిశయోక్తి రవ్వంత కూడా లేదు. కానీ గమనించవలసిందేమంటే, కోసక్కుల్లో టాల్ స్టాయి యవ్వనసంగీతాన్ని మాత్రమే కాదు, తన తర్వాతి జీవితానికి మూలాధారంగా నిలబడ్డ ఒక నైతికదర్శనాన్నికూడా, అదెంత అస్పష్టంగానేనా ఉండనివ్వు, కనుగొన్నాడని చెప్పవచ్చు.
యూరపియన్ రొమాంటిక్ కవులకీ, రచయితలకీ ఆల్ప్స్ పర్వతశ్రేణి ఎలానో రష్యన్ రొమాంటిసిస్టులకి కాకసస్ పర్వతశ్రేణి అలా. అది వారికొక oriental space. వాళ్ళ రహస్యోద్రేకాల్నీ, స్వైరప్రవృత్తినీ, ఆక్రమించుకోవాలనే ఒక దాహాన్నీ ప్రేరేపించే ఒక స్వాప్నిక భూమి. నిన్ననో మొన్ననో వార్తల్లో చూసాను, ఉక్రెయిన్ తర్వాత, ఇజ్రాయిల్-పాలస్తీనా తర్వాత ఇప్పుడు వెస్ట్-రష్యా-చైనా లకు తదుపరి యుద్ధభూమి కజకస్తాన్ కాబోతున్నదని. ఇప్పుడే కాదు, మూడు వందల ఏళ్ళుగా కజక్ సీమ మీదనుంచి రష్యా తన దృష్టి ఎప్పుడూ పక్కకి తిప్పింది లేదు. ఒకప్పుడు అడవుల కోసం, ఆ తర్వాత అణుపరీక్షకీ, ఇప్పుడు గనుల కోసమూనూ.
తన పూర్వపు రొమాంటిక్ రచయితల దారిలోనే టాల్ స్టాయి కూడా కాకసస్ పట్ల ఒకరొమాంటిటిక్ భావోద్వేగాన్ని పెంచుకున్నాడు. కాని పుష్కిన్, లెర్మంటోవ్ లకు సాధ్యంకాని పరివర్తన టాల్ స్టాయి కి సాధ్యపడింది. కాకసస్ ఆయనలోని మాస్కోవైట్ లోని డొల్లతనాన్ని ఆయనకు ఎరుకపరిచింది. కాకసస్ లో ఒక సైనికుడిగా పోరాడటానికి వచ్చినప్పటికీ, అక్కడి జీవితానుభవాలు ఆయనకు రైతుగా, గ్రామీణుడిగా, నిష్కల్మషమైన బాలుడిగా జీవించగల ఒక ఆదర్శాన్ని చూపించాయి. తదనంతరకాలంలో, అంటే, వార్ అండ్ పీస్ నవల రాయడం పూర్తిచేసాక, 1869 లో ఆర్జమాస్ లో ఒక రాత్రి చెప్పలేని భయాందోళనకు లోనయి, టాల్ స్టాయి టాల్ స్టాయియన్ గా మారడం మొదలుపెట్టాక, ఆయన చేసిందల్లా తనలోని మాస్కోవైట్ ని పూర్తిగా త్యజించి ఒక గ్రామీణుడిగా, ఇంకా చెప్పాలంటే ఒక కోసక్కుగా మారడానికి ప్రయత్నించడమే. నాకు తెలిసి ఇటువంటి పరివర్తన ఏ భారతీయ రచయితలోనూ ఏ గిరిజన ప్రాంతమూ తీసుకురాలేదని చెప్పగలను. ఇది ఒక వాల్డెన్ ఒక థోరో లో తెచ్చిన పరివర్తనలాంటిది, ఒక బోయర్ యుద్ధం ఒక గాంధీలో తెచ్చిన పరివర్తనలాంటిది.
ఈ పరివర్తన టాల్ స్టాయిలో ఎంత దూరం సాగిదంటే, చివరికి ఆయన హాజీ మురాద్ నవల్లో పూర్తిగా జార్ పక్షం వదిలి చెచెన్ల పక్షాన నిలబడేటంతదాకా. కోసక్కులు నవల్లో రష్యన్ దళం ఒక చెచెన్ ని చంపడం ఒక ముఖ్యసంఘటన. 1863 లో రాసిన ఆ సంఘటన నుంచి 1904 లో పూర్తి చేసిన హాజీమురాద్ నవల నాటికి టాల్ స్టాయి తనలోని రష్యన్ సామ్రాజ్యవాద అవశేషాలనుంచి పూర్తిగా బయటపడ్డాడు. నాకు తెలిసి ఇంత మానసిక విముక్తిని సాధించిన రచయిత, చలంగారు కాక, మరొకరు కనబడరు.
ఇన్నాళ్ళకు కోసక్కులు చదివేక నాకు అర్థమయిందేమంటే, తనలోని ఈ విముక్తి అవసరాన్ని ఆయన కాకసస్ లోని తొలిరోజుల్లోనే గుర్తుపట్టాడని. పూర్వరచయితల్లాగా ఆ ప్రకృతిని ఒక సుందరసీమగా మాత్రమే ఆయన చూడలేకపోయాడు. అక్కడ స్వతంత్రంగా జీవించే మనుషులున్నారనీ, నువ్వు నిజంగా ఆ సీమని ప్రేమిస్తే, నువ్వు చెయ్యవలసింది ముందు వాళ్ళల్లో ఒకడివి కావడమేననీ ఆయన గుర్తుపట్టాడు.
కోసక్కులు నవలలో ఒలేనిన్ కాకసస్ వెళ్ళి పాడయిపోతాడేమో అని ఆందోళనగా మాస్కోనుంచి వస్తున్న ఉత్తరాల గురించి రాస్తూ ఒలేనిన్ ఇలా అంటున్నాడు:
‘ అబ్బా, యెంత అసహ్యంగా, దీనంగా కనిపిస్తారు మీరందరూ నాకు! మీకు ఆనందమంటే యేమిటో తెలీదు! జీవితాన్ని సహజసిద్ధమైన సౌందర్యంలో ఆస్వాదించాలి! నా ముందు ప్రతి రోజూ నేను యేం దర్శిస్తున్నానో చూసి అర్థం చేసుకోవాలి యెవరేనా, యెన్నటికీ సమీపించలేని ఆ హిమశిఖరాలు, సృష్టికర్త హస్తాలనుంచి రూపు తీసుకున్న ఆదివనిత ఆదిమసౌందర్యంతో అలరారే ఒక రాజతేజస్సుగల స్త్రీ, అప్పుడు అర్థమవుతుంది యెవరు పతనమవుతున్నారో, యెవరు నిజంగా బతుకుతున్నారో, యెవరు మృషా జీవనులో,-మీరో నేనో, మీ భ్రమల్లో మీరు నాకు యెంత అసహ్యకరంగా, దీనంగా కనిపించేదీ మీకు తెలిసి ఉంటే! నా యింటికి, నా అడవులకి, నా ప్రేమకి బదులుగా ఆ కచ్చేరీలూ, సుగంధ తైలాలు రాసుకుని జుట్టుని దొంగ ఉంగరాలు తిప్పుకునే ఆడవాళ్ళూ, అసహజంగా ఇకిలించే పెదాలూ, దాచిపెట్టుకుని నీరసంగా వంకర్లు పోయిన అవయవాలూ, యెందుకొచ్చిన పీడరా అన్నట్టుండే అతిథుల గది సంభాషణలూ-ఆ మాటకే అవి తగవు-నా మనసులో చిత్రించుకున్నప్పుడు భరించలేనంత వికారంగా అనిపిస్తాయి నాకు..’
ఇంకా ఇలా రాస్తున్నాడు:
ఆందమంటే ప్రకృతితో కలిసి వుండటం, ప్రకృతిని చూడ్డం, ప్రకృతితో మాట్లాడ్డం. ‘వాడా మాటకొస్తే ఓ సామాన్య కోసక్ పిల్లని పెళ్ళి కూడా చేసుకోవచ్చు (అన్యాయం ప్రతిహతమగుగాక) నాగరిక సమాజానికి పూర్తిగా దూరమైపోవచ్చు.’ వాళ్ళు పాపం నా గురించి యెంతో సానుభూతితో అనడం నేను వూహించగలను! కాని నేను కోరేదేమంటే, ఆ మాటకి మీ అర్థంలోనే ‘పూర్తిగా నాశనమైపోవడం.’ ఒక సామన్య కోసక్ పిల్లని పెళ్ళాడాలని అనుకుంటున్నాను. కాని నేను సాహసించలేను. యెందుకంటే, అది నా యోగ్యతకి మించిన ఆనంద శిఖరం.’
కాని చాలా కాలం తర్వాత వెర్రియర్ ఎల్విన్ ఈ పని చేయగలిగాడు. మధ్యభారతదేశంలోని గిరిజనుల జీవితాల్ని అధ్యయనం చేయడానికి వచ్చిన్ బ్రిటిష్ యాంత్రొపాలజిస్టు ఎల్విన్ ఒక గోండుమహిళను పెళ్ళిచేసుకుని ఇక్కడి గిరిజనుల్తో మమేకం కాగలిగాడు.
సాధారణంగా మన గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగరీత్యానో, వ్యాపారరీత్యానో మరే కారణాల వల్లనో కొన్నాళ్ళు ఉండటానికి వచ్చేవాళ్ళల్లో చాలామంది చేసే పని ఆ గిరిజనస్త్రీలను ఉంపుడుగత్తెలుగా మార్చడం. ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఆ గిరిజనస్త్రీలను పెళ్ళి చేసుకునేవాళ్ళు కనిపిస్తారు. కోసక్కులు నవలలో టాల్ స్టాయి మనః స్థితి తన పూర్వపు రొమాంటిక్ రచయితల్లాగా తాక్తాలిక సంతోషాల్నీ, సుఖాల్నీ కోరుకోడం మీదలేదు. అతడు లెర్మంటోవ్ వర్ణించిన ‘మనకాలం వీరుడు’ కావాలనుకోలేదు. అతడు నిజంగానే ఒక కోసక్కుగా, ఒక సామాన్య గిరిజనుడిగా మారిపోవాలనుకున్నాడు. కాని కోసక్కులు నవలలో ఆ తెగ ఒలేనిన్ ని తమ మనిషిగా స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఈ అనువాదానికి ముందుమాట రాసిన విమర్శకుడు నిజజీవితంలో టాల్ స్టాయి వాళ్ళతో కలవగలిగాడనీ, వాళ్ళు కూడా ఆయన్ని దగ్గరకు తీసుకున్నారని రాసాడు. కాని టాల్ స్టాయికి తెలుసు, తాను ఆ నవల రాసినప్పటికి తనలోని మాస్కొవైట్ ఇంకా పచ్చిగా, బలంగానే ఉన్నాడని. తాను ఒక సాధారణ కోసక్కు మహిళకు భర్తకాగలిగే మానసిక యోగ్యత తనకు పూర్తిగా సిద్ధించలేదని.
కాని మరొకవైపు తనలోని ఈ నైతిక సంక్షోభం,ఈ పరిత్యాగం ఇవన్నీ కూడా తాను కోరుకుంటున్న ప్రేమని తనకి దక్కకుండా చేస్తున్నాయా అన్న విచికిత్స కూడా టాల్ స్టాయికి లేకపోలేదని ఒలేనిన్ మాటలు మనకి పట్టిస్తున్నాయి. ఆయన ఎటూ తేల్చుకోలేకపోయాడు. కాని చివరికి నవల్లోనూ, జీవితంలోనూ కూడా టాల్ స్టాయిలోని పరిత్యాగిదే పైచేయి అయ్యింది.
ఏ విధంగా చూసినా, కోసక్కులు, అత్యంత సంగీతమయం మాత్రమేకాదు, అత్యంత శీలసంపన్నమైన నవల కూడా. అనాకెరినినా, వార్ అండ్ పీస్ రాసిన టాల్ స్టాయి రష్యన్ సమాజానికి చెందిన టాల్ స్టాయి. దాన్ని ప్రేమిస్తూ, శపిస్తూ, జాలిపడుతూ, ఏవగించుకుంటూ గడిపిన మానవుడు. కాని కోసక్కులు రాసిన టాల్ స్టాయి నిర్మల మనస్కుడైన యువకుడు. కోసక్కుకావాలని కలలుగన్నవాడు. హాజీ మురాద్ రాసిన టాల్ స్టాయితన అంతరంగంలో ఒక చెచెన్ గా మారగలిగినవాడు. పూర్తి ఋషిగా మారగలిగిన విప్లవకారుడు. ఈ రెండు నవలలూ చదివినతర్వాతనే ఎవరేనా టాల్ స్టాయి నా అభిమాన రచయిత అని చెప్పుకునే హక్కు సాధిస్తారు.
11-11-2023
నిజమే చిన్నప్పడు చదివినవి ఇప్పుడు చదివితే వేరే అర్థాలు తెలుస్తాయి. పాఠకుల స్థాయి బట్టి నవల అర్థం మారుతుందన్నది నిజం.
శుభోదయం. దీపావళి శుభాకాంక్షలు.
ధన్యవాదాలు. శుభాకాంక్షలు.
బహుశా ఒక మనిషి అరవయ్యేళ్ళొచ్చాక, మళ్ళా తాను చిన్నప్పుడు చదివిన పుస్తకాలన్నీ మరోసారి చదవడం మొదలుపెట్టాలేమో. అప్పుడు కాని ఆ కథలు ఏం చెప్తున్నాయో నిజంగా అర్థం కాదు.
అవును
దీపావళి శుభాకాంక్షలు సార్
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.