న్యూ బాంబే టైలర్స్

నలభయ్యేళ్ళ కిందటి మాట. గెర్టార్ట్ హౌప్ట్ మన్ అని ఒక జర్మన్ నాటక రచయిత ‘ద వీవర్స్’ అని ఒక నాటకం రాసాడని విన్నాను. ఎలాగేనా ఆ పుస్తకం సంపాదించి చదవాలని కోరికగా ఉండింది. ఈ రోజుల్లోలాగా ఒక బటన్ నొక్కితే ప్రపంచ సాహిత్యమంతా ఇంటర్నెట్ మీద దొరికే రోజులు కావు. మొత్తానికి ఎలాగైతేనేం గౌతమీ గ్రంథాలయంలో Sixteen Famous European Plays దొరికింది. ఆతృతగా తెచ్చుకుని చూద్దును కదా, అందులో వీవర్స్ నాటకం వరకూ పేజీలు కత్తిరించేసి ఉన్నాయి! ఎవరో ఆ నాటకం ఒకటీ చింపేసుకుని ఆ పుస్తకం అలమారులో పెట్టి వెళ్ళిపోయారు! ఎన్నో ఏళ్ళ తరువాత, The Methuen Drama Book of Naturalist Plays(2010) దొరికేదాకా ఆ నాటకం చదవలేకపోయాను.

The Weavers (1892) ఒకప్పుడు జర్మనీలో, ఇప్పుడు పోలాండ్ లో భాగంగా ఉన్న సైలీషియాకు చెందిన నేతపనివాళ్ళ కథ. పారిశ్రామిక విప్లవం వల్ల మరమగ్గాలు మొదలయ్యాక చేనేతమగ్గాల మీద ఆధారపడ్డ జీవితాలు ఎలా చితికిపొయ్యాయో ఆ విషాదమంతా కళ్ళకు కట్టినట్టు చిత్రించిన నాటకం. పందొమ్మిదో శతాబ్ది యూరోపు లోని వర్గసంఘర్షణని అంత వాస్తవికంగానూ, అంత సహజత్వంతోనూ చిత్రించిన నాటకాలు అరుదు అని చెప్తారు. పందొమ్మిదో శతాబ్ది భారతీయ నాటకాల గురించి రాస్తూ, డా.యు.ఏ.నరసింహమూర్తి ఆ నాటకాన్ని, కన్యాశుల్కంతో పోల్చారు. రెండు నాటకాలూ, ప్రపంచపు రెండు కొసల్లో, ఇద్దరు మహానాటకకర్తలు ఒక్క ఏడాదే రాసారు. ఆ నాటకం చదివాక నాకు వెంటనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి కొంతకాలంగా సంభవిస్తూ వస్తున్న నేతకార్మికుల అత్మహత్యలు గుర్తొచ్చాయి. ఒకప్పుడు కన్యాశుల్కం లాంటి దురాచారాన్ని నాటకంగా మలచగలిగిన తెలుగు నాటకకర్త నేతకార్మికుల జీవితాల్లోని సంక్షోభాన్ని ఒక వీవర్స్ నాటకంగా ఎందుకు రాయలేకపోతున్నాడా అనుకునేవాణ్ణి.

నిన్న రాత్రి రంగభూమిలో, కిక్కిరిసిపోయిన ప్రేక్షకుల మధ్య, బి-థియేటర్స్ ప్రదర్శించిన ‘న్యూ బాంబే టైలర్స్’ చూసాక నా అసంతృప్తి చాలా వరకూ తీరింది.

మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన న్యూ బాంబే టైలర్స్ కథ నేను చదవలేదు. కానీ ఆ కథని నాటకీకరించారనీ, చాలా చక్కటి ప్రజాదరణ దొరికిందనీ విన్నాను. అయిదారునెలలకిందట శామీర్ పేట్ దగ్గర ఆ నాటకం వేస్తున్నారంటే పనిగట్టుకుని వెళ్ళానుకానీ, చూడలేకపోయాను. ఆ సంగతి గుర్తుపెట్టుకుని మరీ ఖదీర్ ఈ సారి ప్రదర్శనకి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించేడు.

న్యూ బాంబే టైలర్స్ గ్లోబలైజేషన్ నేపథ్యంలో గ్రామీణ, చిన్నపట్టణ వృత్తులు ఎలా చితికిపోతున్నాయో చెప్పే కథ. కావలికి చెందిన పీరూభాయి అనే టైలరు కథ. ఉన్న ఊళ్ళో టైలరు దగ్గర నేర్చుకున్నదానితో తృప్తి చెందక పీరూభాయి బొంబాయి వెళ్ళి పనినేర్చుకుంటాడు. అక్కడ తనని పేరుపెట్టి పిలవడం లేదని సేఠ్ తో గొడవపడి కావలి తిరిగివచ్చేస్తాడు. తాను బాంబేలో పనిచేయడం కాదు, బాంబేనే కావలి తీసుకువస్తాడు. బాంబే టైలర్స్ పేరిట దుకాణం తెరుస్తాడు. కొలతలని బట్టి దుస్తులు కుట్టడం కాదు, మనిషిని బట్టి కుట్టాలనేది పీరూ భాయి మోటో. తొందరలోనే అతడొక పెద్ద టైలరుగా మారిపోతాడు. అతడు కుట్టిన చొక్కా వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగం వస్తుందని నమ్మేరోజులొస్తాయి. అతడు ఎప్పుడు పెళ్ళి దుస్తులు కుట్టి ఇస్తే అప్పుడే పెళ్ళి ముహూర్తం పెట్టుకోవచ్చనుకునేలాగా అతడి హవా నడుస్తుంది. అతడికి దుస్తులు కుట్టడం ఒక కూలి పని కాదు, కళ, సృజన. అది తొందర తొందరగా చేసేది కాదు, మనసుపెట్టి చేసేది. ఇంతలో కాలం మారింది. కావలిలో ఒక రెడీమేడ్ దుస్తుల ఫాక్టరీ మొదలయ్యింది. ఆ తర్వాత అతడి జీవితంలో ఎటువంటి సంఘర్షణ సంభవించిందో అదంతా రంగస్థలమ్మీద చూస్తాం.

సిటీబస్సులు రాగానే గుర్రబ్బండికి ఎలా పనిలేకుండా పోయిందో చెప్పే ఒక అమరావతి కథాలాంటిదే ఇదీను. కానీ ఇందులో నోస్టాల్జియా, సెంటిమెంటు, సంఘర్షణ మాత్రమే లేవు. ఖదీర్ బాబు ‘దర్గామిట్ట కథలు’ లో కనవచ్చే ఒక నైతిక పార్శ్వం ఈ నాటకంలో కూడా ఉంది. అదే ఈ నాటకాన్ని విషాదాంతం కాకుండా చేసింది. మనిషి ఒక పనిముట్టుగా, ఒక కూలీనంబరుగా మారిపోకుండా నిలబడాలని చెప్పే ఈ కథ ఈ నాటకాన్ని ఆశావహంగా ముగించింది.

అతి తక్కువ వనరుల్తో, కనీస రంగాలంకరణతో దాదాపుగా ఒక జీవితకథని నాటకీకరించిన వైనం నిజంగా ప్రశంసించదగ్గది. పీరుభాయి బాల్యం, యవ్వనం, నడివయసు -మూడు దశల్లోనూ సమాంతరంగా సన్నివేశాల్ని చూపించడం, ఫ్లాష్ బాక్, పారలల్ కట్ లాంటి ఎడిటింగ్ టెక్నిక్స్ ని వాడుకున్న తీరు నాటకాన్ని రసోద్విగ్నం చేసింది. ముప్పై నలభై ఏళ్ళ కిందటి కావలి ని మనముందుకు తీసుకొచ్చింది. నాటకం పూర్తయ్యేటప్పటికి, నెల్లూరు యాసలో జరిగే సంభాషణలు వింటూనే ఎక్కడో ముప్పై నలభయ్యేళ్ళ కిందట కావలికి చెందిన ఒక పీరూభాయ్ తో ప్రేక్షకుడు మమేకం కాగలుగుతాడు.
నాటకం పూర్తయ్యాక తనికెళ్ళ భరణి, ఇంద్రగంటి మోహన కృష్ణ, ఝాన్సీ మరికొందరు సినిమా ప్రముఖలతో పాటు నా స్పందన కూడా చెప్పమని అడిగారు. నేనీ విషయాలే చెప్పాను. వారందరితోబాటు నేను కూడా ఖదీర్ నీ, దర్శకుడు బషీర్ నీ, నటీనటుల్నీ, సంగీతం సమకూర్చిన అనంతునీ మనఃపూర్వకంగా అభినందించాను. ఇండ్ల చంద్రశేఖర్ ని మరింత ప్రత్యేకంగా అభినందించాలి. నిన్నటి ప్రదర్శన పందొమ్మిదో ప్రదర్శన అనీ, త్వరలోనే విశాఖపట్టణంలోనూ, అనంతపురంలోనూ కూడా ప్రదర్శనలు ఉండబోతున్నాయనీ నిర్వాహకులు చెప్పారు.

అయితే, న్యూ బాంబే టైలర్స్ ని The Weavers తో పూర్తిగా పోల్చలేను. The Weavers లాంటి నాటకం ఒకటి ఇంకా ఆ ప్రమాణాల్తో తెలుగు రంగస్థలం మీద అవతరించవలసే ఉంది. అటువంటి రోజు ఒకటి రాగలదని ‘న్యూ బాంబే టైలర్స్’ నాకు నమ్మకం కలిగించిందని మాత్రం చెప్పగలను.

11-11-2023

4 Replies to “న్యూ బాంబే టైలర్స్”

  1. అద్భుతమైన విమర్శ! ఆ నాటకం ఎప్పుడు చూడగల్గతానా అని వుంది!

  2. 60 వ దశకం నాటి వరంగల్ లో మా నాన్న పేరున్న రంగస్థల నటుడు. 50-60 లలో తెలుగు నేల మీది వరంగల్ వంటి నగరాలలో నాటకం ఎంత దేదీప్యమానంగా వెలుగులీనేదో మా నాన్న మాటల్లో విన్నప్పుడంతా ఆశ్చర్యానికి లోనవుతాను. ఇక అటువంటి రోజులు చూసే భాగ్యం కలుగదేమో అనుకుంటున్నపుడు ఒక చిన్న ఆశను కల్పించిన నాటకం న్యూ బాంబే టైలర్స్. జర్మన్ నాటకం గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. తెలుగులో నాటక కళ పునరుజ్జీవనం పొందితే, మీరు ప్రస్తావించినట్టు కొత్త తరం నాటకాలు వస్తాయేమో!

Leave a Reply

%d