లలితకళా వాచకం

లలితకళలపైన, సాహిత్యవేత్తలపైన, సంగీతకారులపైన ఎల్. ఆర్.వెంకటరమణ రాసిన 48 వ్యాసాల సంపుటం ఈ ‘కళాప్రపంచం’, సంజీవదేవ్ తర్వాత ఇంకా, ఇలా చిత్రకళనీ, సాహిత్యాన్నీ కలిపి అధ్యయనం చేస్తున్న రసస్వాదకుడు తెలుగులో ఒకరున్నారని ఈ ప్రతి పుటలోనూ సాక్ష్యమిస్తుంది.

ఈయన అరుదైన రసజ్ఞుడనీ, నిరంతర కళారాధకుడనీ ఇందులో ప్రతి వ్యాసం మనకి గుర్తు చేస్తుంది.
తెలుగులో సాహిత్యసృజనని చరించేవాళ్ళూ, విమర్శించేవాళ్ళూ తక్కువేమీ కాదు. ఎన్నో వాదవివాదాలతో, ఉద్యమాలతో తెలుగు సాహిత్యరంగం ఎప్పుడూ సంచలనశీలంగా ఉంటుంది. కాని అదే స్థాయిలో చిత్రకళ, శిల్పం, సంగీతం లాంటి తక్కిన లలిత కళలపైన రాసేవారూ, మాట్లాడేవారూ చాలా అరుదు. అడవి బాపిరాజు, బుచ్చిబాబు, శీలా వీర్రాజు, చలసాని ప్రసాదరావు, మోహన్ వంటి వారు అటు సాహిత్యాన్నీ, ఇటు చిత్రకళనీ సమానంగా పరామర్శిస్తూ వచ్చినప్పటికీ, సాధారణ తెలుగు పాఠకుడికి సాహిత్యంతప్ప తక్కిన లలిత కళల్తో చెప్పుకోదగ్గ పరిచయం లేదనే చెప్పాలి. ఒకప్పుడు సామల సదాశివ, ఇప్పుడు ఎలనాగ వంటివారు సంగీత ప్రశంసని ఒక సాధనగా కొనసాగిస్తున్నవాళ్ళున్నారు. కాని అది కూడా ఎవరో ఒకరిద్దరు వేళ్ళమీద లెక్కపెట్టగలిగే వాళ్ళు మాత్రమే. అలాగే సమకాలిక తెలుగు లోకంలో చిత్రకళా ప్రశంస చేసేవాళ్ళు కూడా ఒక గణేశ్వరరావు, ఒక అన్వర్, ఒక పి.మోహన్ వంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. కాని పదకొండుకోట్ల మంది తెలుగు మాట్లాడే ప్రజ ఈ ఇద్దరు ముగ్గురు రసజ్ఞుల కృషి ఎంత మాత్రం సరిపోదని చెప్పవచ్చు.

లలిత కళల్లో ప్రతి ఒక్క కళనీ అభ్యసించడం ఒక ఎత్తు అయితే, ఆ కళాసృష్టిని ఆస్వాదించడం మరొక ఎత్తు. ఉదాహరణకి ఒక చిత్రలేఖనాన్ని ఎలా చూడాలో, ఒక ఖండకావ్యాన్ని చదివినట్టుగా ఒక చిత్రలేఖనాన్ని ఎలా చదవాలో చెప్పేవారు లేకపోవడం వల్ల తెలుగులో చిత్రలేఖన కళకి తగిన ఆదరణ దొరకడం లేదని చెప్పవచ్చు. అలాగే సంగీతం కూడా. సంప్రదాయ కర్ణాటక సంగీతాన్ని ఎలా ఆస్వాదించాలో, ఒక కచేరీలో గాయకుడు చూపిస్తున్న ప్రతిభను, మనోధర్మాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పేవాళ్ళు లేనందువల్లనే, అత్యధికసంఖ్యాకుల సంగీతావసరాలు సినిమాపాటల దగ్గర ఆగిపోతున్నాయి.

కళకీ, లలితకళకీ తేడా ఉంది. ఏదైనా కుశలంగా చెయ్యడం కళ. కాని కౌశల్యమొక్కటే లలిత కళ కాదు. ఏ నైపుణ్యమైనా గాని హృదయాన్ని మెత్తబరచకపోతే, నీ అనుభూతిని సుకోమలం చెయ్యకపోతే, నీ తోటిమనిషిపట్ల, సమస్తప్రాణుల పట్ల ప్రేమ కలిగించకపోతే, ఆ కళ లలితకళ కాదన్నమాట. లలితం అనే మాటలోనే సారాంశమంతా ఉంది. మనిషి మానసికంగా, ఆత్మికంగా ఉన్నతస్థాయిని చేరుకుంటున్నాడు అనడానికి లలిత కళాసృజన, లలిత కళాస్వాదన కొలమానాలు. నువ్వు కవి, గాయకుడివీ, చిత్రకారుడివీ కాకపోయినా పర్వాలేదు, కాని వాటిని ఆనందించే రసజ్ఞత కొరవడితే మాత్రం, నీతిశతకకారుడు చెప్పినట్లుగా ఆ చదువు నిరర్థకం.

ఒకప్పుడు యూరోప్ సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో విద్య అంటే లలితకళలు నేర్చుకోవడం, ముఖ్యంగా వాటిని ఆస్వాదించడం నేర్చుకోవడం. కానీ సైన్సు, టెక్నాలజీ వికసించడం మొదలుపెట్టాక, కొత్త ఉద్యోగావకాశాలకు చదువు ఒక సాధనంగా మారాక, లలితకళలకు వెనకపీట వెయ్యడం మొదలయ్యింది. ఇప్పుడు మళ్ళా ప్రపంచ వ్యాప్తంగా లిబరల్ ఆర్ట్స్ పేరిట లలితకళల అధ్యయనం సాంకేతిక విజ్ఞానంతో సమానమైన స్థానాన్ని సంపాదించుకుటున్నట్టుగా వింటున్నాం.

కాని లలితకళల్ని ఆస్వాదించడం పాఠశాలల్లోనో, కళాశాలల్లోనో మొదలయ్యేది కాదు. అక్కడ మహా అయితే ఒక గంట లేదా రెండు గంటలు కేటాయించగలుగుతారు. కాని మన చిత్తవృత్తిని మార్చేంతగా లలితకళారాధన జరగాలంటే అది ముందు ఇళ్ళల్లో మొదలవ్వాలి. తల్లిదండ్రులే పిల్లలకి గురువులుగా మారాలి.

ఇళ్ళు లలితకళలకై ఊయెలతొట్లుగా మారాలంటే ముందు ఆ తృష్ణ కలగాలి. అభిరుచి కల్పన ఒక ఉద్యమంలాగా జరగాలి. మన సంస్కృతిలో, మన దేశ సంస్కృతిలో, ప్రపంచవ్యాప్తంగా కళాకారుల కృషి గురించీ, వారి తపన గురించీ, తపస్సు గురించీ తెలియాలి. మన చర్చల్లో అవి భాగం కావాలి. ఒకసారి తల్లిదండ్రుల్లోనూ, పిల్లల్లోనూ ఆ దృష్టి మొదలయ్యాక వాటి గురించి విస్తారంగా తెలుసుకోడానికి నేడు కొన్ని వేల రిసోర్సులు అందుబాటులో ఉన్నాయి. నాకు తెలిసిన ఒక ఉపాధ్యాయ మిత్రుడు, రిటైరయిన తర్వాత వేణుగానం నేర్చుకున్నాడు. ఎవరిదగ్గర నేర్చుకున్నారని అడిగితే యూట్యూబు చూసి నేర్చుకున్నానని చెప్పాడు!

లలిత కళల పట్ల ఇటువంటి జాగృతిని కలిగించడం కోసమే వెంకటరమణ వంటి జిజ్ఞాసులు, తపస్వులు నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ పుస్తకం అటువంటి అధ్యయనానికి ఒక ప్రాథమిక వాచకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చిత్రకారులు, చలనచిత్రకారులు, కవులు, కళాకారులు ఎందరో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరిగురించి మనం మరింత లోతుగా తెలుసుకోడం మొదలుపెట్టినా అది మన జీవితదృక్పథాన్నే సమూలంగా మార్చేయగలదు.

ఈ వ్యాసాల్లో రచయిత తాను పరిచయం చేస్తున్న ప్రతి కళకారుడి గురించీ ప్రాథమిక సమాచారంతో పాటు, ఆయన లేదా ఆమె జీవనతాత్త్వికతను కూడా స్థూలంగా పరిచయం చేసారు. కళలో వారు సమాజానికి అందించిన ఉపాదానం గురించి సారాంశప్రాయమైన వాక్యాలు రాసారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యాసం చంద్రుణ్ణి చూపించే వేలు అని చెప్పవచ్చు.

ఇటువంటి పుస్తకాలు చదవడమే కాదు, చదివాక, ఇందులో ప్రస్తావించిన కళాకారుల గురించి మరీ మరీ మాటాడుకోదగ్గవి. మిత్రులకి కానుకగా పంపదగ్గవి. పిల్లలకు బహుమతిగా ఇవ్వదగ్గవి. కళాశాలల అధ్యాపకులు, అంతకన్నా ముందు, కళాశాలల యాజమాన్యాలు అత్యవసరంగా చదవదగ్గవి.

వెంకటరమణ ఈ కృషి మరింత విస్తృతంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. రసజ్ఞతా రాహిత్యంతో ఎండిపోతున్న తెలుగులత పాదులో ఇటువంటి సాహిత్యజలధారలు ఎన్ని వొంపినా ఇంకా ఆ అవసరం మిగిలే ఉంటుంది.


పుస్తకం కావలసిన వారు రచయితను 9866158908 పైనగాని లేదా l.r.venkataramana@gmail.com మీద గాని సంప్రదించవచ్చు. వెల రు.250/-

19-5-2023

4 Replies to “లలితకళా వాచకం”

  1. కీ.శే. గాన గంధర్వులు SP బాల సుబ్రహ్మణ్యం గారి లాంటి ఒక గురువు గారు ఎవరికి లభించినా వారందరూ అదృష్టవంతులౌతారు. సంగీత సాహిత్యాల విశ్లేషణ లో, వింగడింపు లో వారు ద్రష్ట.

Leave a Reply

%d