
సత్యభాస్కర్ సున్నితమైన మనిషి. గోదావరి ఒడ్డున జీవిస్తున్నవాడు. ఆ లాలిత్యాన్నీ, ఆ సౌకుమార్యాన్నీ, ఆ గోదావరి గాలినీ మూటగట్టి ఇలా కవిత్వంగా మనకు అందిస్తున్నాడు.
సత్యభాస్కర్ తో నా పరిచయం దాదాపు నలభయ్యేళ్ళ కిందటి మాట. అప్పట్లో నేను రాజమండ్రిలో టెలికమ్యూనిక్సేషన్స్ డిపార్ట్ మెంటులో పనిచేస్తున్నప్పుడు ఆయన మాకు హిందీ ఆఫీసరుగా ఉండేవారు. వారం వారం ఆయన దగ్గర హిందీ క్లాసులకి హాజరవుతుండేవాణ్ణి. ఒక సుకుమారమైన లోకం ఆయనకి తెలుసని నేను అప్పుడు ఎలా గుర్తుపట్టేనో తెలీదుగానీ, ఆయన్ని సాహితీవేదికకి ఆహ్వానించేను. వేదిక మిత్రులు ఒక కవితాసంకలనం వెలువరిస్తున్నప్పుడు దానికి కవులూరి గోపీచంద్ తో పాటు నేను కూడా సంపాదకుడిగా ఉండటంతో ఆయన్ని కూడా కవితలు ఇమ్మని అడిగాను. ఈ సంపుటిలోని ‘ఏ వేళనయినా’, ‘డిస్ప్పాయింట్ మెంట్’ ఆ సంకలనంలో చోటుచేసుకున్నవే.
నాలుగు దశాబ్దాలు గడిచిపోయేయి. రాజమండ్రిలో ఆనాడు కలిసి మెలిసి తిరిగిన మిత్రులమందరం తలోదారీ అయిపోయేం. కొందరు ఆత్మీయులు ఈ లోకాన్ని విడిచివెళ్ళిపోయారు కూడా. కానీ, ఇన్నాళ్ళకు సత్యభాస్కర్ నుంచి ఈ కవిత్వం రాగానే ఒక్కసారి గోదావరి గాలి నా ముఖాన గుప్పుమని వీచినట్టనిపించింది. మేమంతా ఇంకా అక్కడే ఉన్నామనీ, ఆ గోదావరి గట్టుమీద సాయంకాలాలు కవిత్వం గురించే మాట్లాడుకుంటూ గడుపుతున్నామనీ అనిపించింది.
అతడిది మామూలు మనుషులు చూసే లోకం కాదు. ప్రవృత్తి రీత్యా అతడు ఫొటోగ్రాఫర్ కూడా. కాని కెమేరా కూడా చూడలేని వెలుగునీ, గాలినీ ఈ కవితల్లో పట్టుకున్నాడు. అందుకనే ఈ పుస్తకం తెరవగానే ‘నదిపై తేలుతున్న కూనిరాగపు పాట’ వినిపిస్తుంది. ‘నది అంతా చెల్లాచెదురుగా రాలే వెండి దూదిపింజలు కనిపిస్తాయి. ఒక్కొక్క కవితనే చదువుకుంటూ వెళ్తుండగా ‘తేమగాలి జోలపాట’, ‘అభ్రకపు నది’ మీద ‘గాలిపాట పాడుతున్న లాంచీ’, ‘శీతగాలి పాలపిట’్ట , ‘గుడిగంట జలదరింపు’, ‘నదికి రహస్యంగా సంగీతాన్ని ధారపోస్తున్న తేమగాలి’, ‘తేనెతలపుల నీరవ రాగం’, ‘మోహనదిపై ఎర్రకలువ’, ‘వలపు నది కానుక చేసిన బాష్పభారం’, ‘గగనపు జడపాయకు చామంతి బిళ్ళలా అమరిన జాబిలి’్ల కనిపిస్తాయి, వినిపిస్తాయి.
కెమేరా లెన్సుతో మాత్రమే పట్టుకోగలిగే దృశ్యాన్ని అతడు ఈ కవితల్లో తన సమస్త జ్ఞానేంద్రియాల్తోనూ పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఫాల్గుణమాసం మామిడిచెట్టుకి పచ్చలు పొదుగుతున్నదట. మనీప్లాంట్ మంచుతో తలంటు పోసుకుంటున్నదట. చైత్రమాసం మొదలవగానే వ్యాపించే ఎండపొడ రామనవమికి కలిపిన పానకంలో మిరియాల ఘాటులాగా ఉందట. కొంగలు బకింగ్‌హాం పేలస్ గార్డుల మల్లే పగటికి కాపలా కాసే గులాబీరంగు పొడుగుకాళ్ల అందగత్తెలట! రామబాణం మొక్క వేలాది ప్రేమలేఖల్ని ఒకేసారి ఎక్కుపెట్టిందట!
కానీ ఈ కవికి కాలం గురించిన స్పృహ ఉంది. ఇప్పటి కాలం నలభయ్యేళ్ళ కిందటిలాగా లేదనీ, ఇది ‘గాజు ఆవహించిన కాలం’ అనీ అతడికి తెలుసు. ‘బొటనవేలు తప్ప శరీరమంతా నిరుపయోగమైపోయింద’ని కూడా తెలుసు. కానీ, ఆ సౌకుమార్యానికీ, ఆ ‘సరస్వతీ హ్రదపు జ్ఞాపకానికీ’ అతడు దూరం కాలేదు. అందుకనే ఇలా అనుకుంటున్నాడు:
ఏకిన బూరుగుదూదల్లే వెన్నెల విరగకాస్తున్న అడవిలో
ఎవరికీ చెప్పాపెట్టకుండా
గుర్రమెక్కి ఆ రాత్రిని వెతుక్కుంటూ
వెళ్ళాలని ఉంది
తక్కినవాళ్ళు చూడలేని ఏ సౌందర్యాన్నో చూడాలన్న ఆ కోరిక బలంగా ఉన్నందువల్లనే, దాదాపు నలభయ్యేళ్ళ తరువాత అతణ్ణి కవిత్వం మళ్లీ ముంచెత్తింది. మన మనోభూముల మీద ప్రవహించబోతున్న ఈ కొత్తగోదావరిని సంతోషంగా స్వాగతిస్తున్నాను.
పుస్తకం కావలసిన వారు నవోదయ బుక్ హౌస్ వారిని గాని లేదా http://www.telugubooks.in వారిని గాని సంప్రదించవచ్చు. వెల రు.150/-
27-7-2023
🙏🙏🙏
ధన్యవాదాలు