పోస్టు చేసిన ఉత్తరాలు-13

4-11-2023, తెల్లవారుజాము 3.30

ప్రియమైన

ఇంకా నగరం నిద్రలో మునిగిపోతూ, కలల్లో తేలిపోతూ ఉండే ఈ నిశాంతవేళల్లో ఇళ్ల బయట వెలిగే దీపాల్ని చూస్తూ ఉంటే ఏదో mysterious గా అనిపిస్తూ ఉంటుంది. వెలుతురు మొత్తం ఆ దీపాల చుట్టూ గడ్డకట్టుకున్నట్టుగానూ, ఆ లోపల గదుల్లో నిద్రిస్తున్నవాళ్ళకి ఏవో ఎక్కణ్ణుంచో వస్తున్న ఉత్తరాలు ఆ ఇంటిగుమ్మం దగ్గరే గుట్టలు పోసినట్టుగానూ అనిపిస్తుంది. తెల్లవారితే వాళ్ళకి కనిపించవు అవి. ఇప్పుడు తలుపులు తెరిచినా కనబడవు. ఆ ఉత్తరాలు వచ్చింది వాళ్ళకే గాని, ఎవరో నాలా మరీ ఇంత తొందరగా మేల్కొనేవాళ్ళకి మాత్రమే అవి చదివే అవకాశం దక్కుతుందనుకుంటాను. ఈ లోకంలో మనుషుల్లో పూర్తిగా మునిగిపోకుండా ఇంత ఎడంగా నిలబడి వాళ్ళ సుఖదుఃఖాల్ని పరికించడంలో ఏదో కావ్యానందం ఉన్నట్టుంది. గొప్ప నాటకకర్తలందరూ చేసిన పని ఇదేననుకుంటాను. ఎందుకంటే, ఆ మనుషులు మనకి తెలియనీ, తెలియకపోనీ, మన వాళ్ళవనీ, కాకపోనీ, వాళ్ల మధ్య intense గా సంభవించేది ఏదైనా సరే మనలోనూ అంతే గాఢమైన సంవేదనని మేల్కొల్పుతుంది. ఎవరి కలకలమైనా మనదే అనిపిస్తుంది, ఎవరి కన్నీళ్ళయినా మనవే అనిపిస్తాయి.

మార్గరెట్ ఎమర్సన్ పరిచయమై, స్నేహం మొదలయ్యాక, 1839-40 లో ఆమె ఉత్తరాల్లో నెమ్మదిగా చోటుచేసుకోడం మొదలుపెట్టిన ఆ సంతోషం, అతణ్ణి తన సొంతంగా భావించుకోడంలోని ఆమె అనుభవించిన హృదయోద్వేగం మనల్ని కూడా తనవైపు లాక్కుంటాయి.

చూడు, 3-1-1839 న రాసిన ఉత్తరంలో-

‘నువ్వు నన్ను చూడ్డానికి రావా? ఈ వారం నువ్వొస్తేగనక నిన్ను విల్లోకొమ్మలకన్నా అందమైనదానితో, పచ్చనైనదానితో నీ శిరసును అలంకరిస్తాను. ఇక్కడ రాళ్ళమధ్యా, బండల పగుళ్ళమధ్యా అడవి జెరేనియం విస్తారంగా పూసింది. ప్రతి కంచెమీదా హాథార్న్ తీగె విరబూసింది. నీకు నచ్చినట్టుగా వాటిని మాల కట్టి నీ మెళ్ళో వేస్తాను. కాని నువ్వు తప్పకుండా రావాలి సుమా.’

ఆ ఏడాదే నవంబరులో రాసిన ఉత్తరంలో మొదటివాక్యమే-

Your letter brought me joy:-

ఆ ఉత్తరంలో కొంత దూరంపోయాక ఇలా రాస్తోంది:

‘నువ్వు రోజంతా చదువుకుంటూ, రాసుకుంటూ ఉంటావు కాబట్టి నీకేమన్నా కాగితాలు పంపడానికి ఒకటికి రెండు సార్లు సంకోచిస్తాను. కాని మళ్ళా అనిపిస్తుంది, నువ్వు రోజంతా కూడా చదువులో గడిపేస్తూ అలిసి పోవాలనుకోవుకదా, అప్పుడప్పుడు నీ తత్త్వశాస్త్రపు రాజపథం నుంచి ఒకింత పక్కకి జరిగి ఏ తోటల్లోనో, తోపుల్లోనో విహరించాలని ఉంటుంది కదా అనుకుంటాను.’

ఈ వాక్యం చదవగానే నాకు నవ్వొచ్చింది. ఎక్కడ మొదలయ్యింది ఈ స్నేహం? చదువుకున్నవి ఒకరితో ఒకరు పంచుకోవాలనీ, కలిసి చదువుకోవాలనీ, కొత్తగా తెలుసుకోవాలనీ- కానీ మధ్యలో ఎటువైపు జరిగింది? కొంతసేపు ఆ చదువు పక్కన పెట్టి ఏ పచ్చికబయలుకో, లేదా ఏ పూలతోటకో పోవాలనిపించడం దాకా! ఇదే, స్నేహాలు ప్రేమలుగా మారే తావు. ఒకరి చదువో, ప్రతిభనో, పాఠాలో కాక, వాళ్ళ ఉనికినే అన్నిటికన్నా ముందు ఆత్మీయమనిపించే ఆల్కెమీ.

ఆ ఏడాదే డిసెంబరులో రాసిన ఉత్తరంలో మొదటివాక్యాలే చూడు:

‘ఇప్పుడు నువ్వుగానీ నా హృదయంలోకి తొంగిచూడగలిగితే నిన్ను ప్రేమించేవాళ్ళనీ, ద్వేషించేవాళ్ళనీ కూడా నీ నుంచి దూరంగా నెట్టేస్తావు. ఇప్పుడు నేనొక నిద్రిస్తున్న అగ్నిపర్వతం మీద ఉన్నాను. ఇక్కణ్ణుంచి కిందకి దిగలేను. నా మనసు చెప్పలేనంత అల్లరి చేస్తోంది. పోయిన ఆదివారం నీకో పెద్ద ఉత్తరం రాసాను. వచనమూ, కవిత్వమూ రెండు కలగలిపి మరీ. దానిలో ఉన్న సాహిత్యం కోసమేనా నీకు పంపాలని కనీసం ఇరవై సార్లేనా అనుకున్నాను. కాని, తీరా చేసి ఆ ఉత్తరం నీకు పంపిస్తే మన మధ్య సంబంధాలు దెబ్బతింటాయేమో అనిపించింది. నేను నీతో ఇలా అయస్కాంతశక్తి గురించీ, సంగీతం గురించీ మాట్లాడటం మొదలుపెడితే, మునుపటిలాగా నీతో శాంతంగా గంభీరంగానూ, గంభీరంగానూ మాట్లాడలేనేమో అనిపించింది.’

అలాగని ఆ ఉత్తరాలంతటా ఈ భావాలే ఉన్నాయనికాదు. ఎప్పట్లానే ఆ ఉత్తరాల్లో షేక్ స్పియరూ, షిల్లరూ, గొథే కనిపిస్తూనే ఉన్నారు. పుస్తకాలూ, మిత్రులూ, ప్రసంగాలూ కనిపిస్తూనే ఉన్నాయి. కానీ నిండుగా పూసిన పూలమొక్క చుట్టూ అదృశ్యంగా ఒక పరిమళం అల్లుకున్నట్టుగా, ఆ సద్గోష్ఠిని అంటిపెట్టుకుని ఒక అనురాగం కూడా నెమ్మదిగా అల్లుకోడం కనిపిస్తూంది.

ఆ అనురాగాన్ని అతడు ఏమనుకుంటాడో అనే సంకోచమూ మొదలయ్యింది. 1840 ఫిబ్రవరిలో రాసిన ఒక ఉత్తరం ముగిస్తూ ఇలా అంటున్నది:

‘అయినా నా హృదయంలోతుల్లోంచీ పలుకుతున్న ఈ ప్రగాఢసంగీతాన్ని చిన్నపిల్లల మాటల్లానో లేదా ప్రపంచం పట్ల విసుగుతో రాస్తున్నానో అనుకునే మనిషికి నేనివన్నీ ఎందుకు రాస్తున్నట్టు?’

మరొక రెండు నెలలు గడిచాయో లేదో, ఏప్రిల్లో రాసిన ఉత్తరం చూడు:

‘నేను రాసే ఉత్తరాలు నీకు నచ్చవని నాకు తెలుసు. కానీ నీకేది నచ్చుతుందో నేనెప్పటికీ చెప్పలేను. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది, అసలు నాకు నా పుట్టుకలోనే నీ స్నేహితురాలయ్యే అర్హత లేదేమోనని. కాని ఇంతలోనే మళ్లా పూలు పుయ్యడం మొదలవుతుంది. అప్పుడు, అవును, నిశ్చయంగా నీ స్నేహితురాలినే అనిపిస్తుంది.’

అప్పుడు తన చుట్టూ పూసిన పూల గురించి ఇలా రాస్తోంది. ఈ పూలపేర్లు తెలుగు చెయ్యడం కష్టం కాబట్టి, ఈ మొత్తం ఇంగ్లీషులోనే ఎత్తిరాస్తున్నాను:

I wish you could see the flowers I have before me now. A beautiful bouquet brought me this evening, multifloras, verbenas, fusias, English violets and a lemon branch of the liveliest green. There is but a very little bit of the Heliotrope. It is the flower I love best, but it is rarely given me. I suppose I do not look as if I deserved it:-When I am a Queen, if so unfortunate as to come to the throne in a northern climate, I will have greenhouses innumerable, and I will present every person of a distinguished merit with a bouquet every week and every person of a delicate sensibility with one every day. If you are there I shall only give you sweet pea or lavender because you are merely a philosopher and a farmer, not a hero, nor a sentimentalist

ఆ చివరి వాక్యంలో ఉంది ఆ ప్రేమప్రకంపన అంతా. పూలు ఇస్తుందటకానీ, రైతుకిచ్చినట్టూ, సాధువుకిచ్చినట్టూ ఇస్తుందట, వీరుడికిచ్చినట్టూ, ప్రేమికుడికిచ్చినట్టూ కాదట.

ఒక స్త్రీకి ఒకరి పట్ల అనురాగం ఉదయించాలేగాని, అది చూసేవారికి కూడా ఆకాశంలో ఒక ఇంద్రచాపాన్ని చూస్తున్నట్టే ఉంటుంది, ఏడు రంగులూ ఒక్కసారే చూస్తున్నట్టు.

దాదాపు రెండు శతాబ్దాల తర్వాత, ఇంత దూరంలో ఉన్న నాకే ఆ రంగులు కనిపిస్తూ ఉండగా, పొద్దున్నలేచి వాళ్ళని చూస్తున్నవాళ్ళకి ఆ సంతోషాలూ, ఆ సంభ్రమాలూ కనిపించకుండా ఎలా ఉంటాయి? నేననుకున్నాను, ఆమె మాత్రమే ఇలాంటి ఉత్తరాలు రాస్తూ ఉందేమో, ఎమర్సన్ చాలా పొడి పొడిగా జవాబులు రాస్తున్నాడేమో అని. కాని ఆయన ఉత్తరాలు ఇంతకన్నా రసార్ద్రంగా ఉన్నాయి.

మొత్తానికి వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారన్నది ఇద్దరికీ అర్థమయింది. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుకోడం మొదలుపెట్టారు. ఏ మాత్రం సందుదొరికినా ఇద్దరూ కలిసి అడవుల్లోకి నడుచుకుంటూపోవడం, గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండటం, సహజంగానే, అందరికన్నా ఎక్కువగా ఎమర్సన్ భార్యని కలవరపరిచింది. ఆమె ఒకరోజు తనతో సాయంకాలం నడకకి రమ్మని మార్గరెట్ ని పిలిచింది. కాని మార్గరెట్ తాను ఎమర్సన్ తో పోవాలనుకుంటున్నాని చెప్పింది. అంతే, ఎమర్సన్ భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాతి దృశ్యాలు మనం ఊహించగలిగినవే.

ఇక ఆ తర్వాత ఉత్తరాల్లో ఆ స్వప్నాలూ, ఆ సంగీతమూ పక్కకుపోయి సంజాయిషీలూ, సమర్థనలూ మొదలయ్యాయి.

1840 సెప్టెంబరులో రాసిన ఉత్తరంలో ఈ వాక్యాలు:

‘ప్రియమిత్రుడా, ఒక్క విషయంలో మాత్రం నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, జీవితాన్ని సంతోషభరితంచేసే సజీవ ఆనందాల్ని తప్ప అధికారాన్ని ఇష్టపడే దాన్ని కాదు. మనుషుల మధ్య సంబంధాల్లో ఉండే పవిత్రతని ఉల్లంఘించడానికి నేను నువ్వూహించినదానికన్న ఎంతో దూరం. నాది కానిదేదీ నేను కోరుకోను. నేను నిజంగా అనుభూతి చెందనిదేదీ నేను కోరుకోలేను. నా చూపుల్తో ఒక గంధర్వుణ్ణి కట్టిపడేసే శక్తినాకున్నా కూడా, అతడి పట్ల నా హృదయంలో ప్రేమలేకపోతే, అటువైపు కన్నెత్తి కూడా చూడను. నేనేమీ పక్కవారిసొత్తు దోచుకుపోయేదాన్నికాను. నేను అడుగుతున్నది నాకు నిజంగా దక్కవలసిందేదో దాన్ని మాత్రమే. ఒకవేళ నేను హద్దులు దాటుతున్నానని తెలిస్తే, అది ఎంత చక్కని ద్రాక్షతోట గానీ, లేదా ఎంత అందైన పూలతోటగానీ, దాన్ని దాని యజమానికే వదిలిపెట్టి పక్కకు వెళ్ళిపోతాను.’

ఈ విహ్వలత్వం, ఈ బలహీనత నిజానికి ఆమె స్వభావం కాదు. ఆమె గురించిన స్మృతుల్లో ఎమర్సన్ ఒకమాట రాసాడు. ఆమె తాను అన్నివిధాలా ప్రాచీన రోమ్‌కి చెందినదాన్ననీ, ఏ దేవతలో తీసుకొచ్చి తన తల్లిదండ్రులకి అప్పగించారనీ నమ్ముతుండేది అని. ఈ ఉత్తరంలో చివరి వాక్యాలకు వచ్చేటప్పటికి, ఆమె తనను తాను సంబాళించుకుని ఏమంటున్నదో చూడు:

‘అలాగని నేనేదో ఋషీశ్వరురాల్నో మరేదో కాదు, కాని గొప్ప ఆత్మని, తాను పుట్టినచోటుకి తిరిగివెళ్ళిపోయేలోగా మీ అందరినీ చూసిపోడానికి వచ్చినదాన్ని.’

1840 సెప్టెంబరు, అక్టోబరు నెలలు మార్గరెట్ కన్నా కూడా ఎమర్సన్ ని ఎక్కువ పరీక్షకు పెట్టాయి. ఆయన అప్పటిదాకా మాట్లాడుతున్న ఆదర్శాలు, self-reliance, transcendental spirit పెద్ద కుదుపుకి లోనయ్యాయి.

తామిద్దరూ ఒకచోటకు చేరుకున్నప్పటికీ, కలుసుకుని మాట్లాడుకుంటున్నప్పటికీ, తాము రెండు వేరే వేరే ప్రపంచాలకి చెందినవారమని ఎమర్సన్ అనుకున్నాడు. ఆమెకి ఆ సెప్టెంబరులో రాసిన ఒక ఉత్తరంలో ఇలా అంటున్నాడు:

‘మనిద్దరం దైవం తాలూకు ఒకే ఆలోచనాసీమకు చెందినవాళ్ళం కామనీ, రెండువేరు వేరు భావాలమనీ నాకు పదే పదే అనిపిస్తూంటుంది. ఒకరు భూమ్మీదా మరొకరు సముద్రం మీదా వ్యాపారం చేసే రెండు దేశాల్లాగా మన వ్యాపారాలు వేరే, వాటిని నిర్ణయించే సూత్రాలూ వేరే.’

ఒకరు భూమ్మీదా, మరొకరు సముద్రం మీదా వ్యాపారం చేసే రెండు విభిన్న రాజ్యాల్లాంటివాళ్ళం అంటున్నాడు. ఆ తర్వాత రాసిన ఉత్తరంలో స్పష్టంగా ఇలా అంటున్నాడు:

‘అలాగని పాతగోడలు హటాత్తుగా కూలిపోతాయని చెప్పుకుంటూ నన్నునేను మోసగించుకోలేను. ఈ ఆత్మీయమైన అనుబంధానిట్లానే కొనసాగించాలంటే నేను దీన్ని ఎంతో సున్నితంగా చూసుకోవాలి, దీర్ఘకాలం పదిలపర్చుకోవాలి- ఈ అనుబంధాన్ని వాడుకోడం కాదు, ఆరాధించాలి- రెండు విభిన్న స్వభావాలు కలిగిన మనుషుల్తో నా సాన్నిహిత్యం, సంభాషణలు కొనసాగించుకోడానికి నన్ను నేను సుశిక్షితుణ్ణి చేసుకోవాలి. కాబట్టి, మిత్రమా, నన్నొక మూగజీవిగా భావించు, కృతఘ్నుణ్ణికాను, కానీ మనసులో ఉన్నదేదో చెప్పలేకపోతున్నవాడిగా భావించు.’

Worship, not use it- ఇదీ ఆయన్నీ, ఆమెనీ కూడా ఆ సంక్షోభంలోంచి బయటపడేసిన మంత్రం.
తనని తాను నియంత్రించుకునే క్రమంలో ఎమర్సన్ ఆమె హృదయానికి కూడా ఎటువంటి సంయమనాన్ని అలవర్చాడో, ఆమె 1841 అక్టోబరులో రాసిన ఉత్తరంలో ఈ వాక్యాలు సాక్ష్యమిస్తాయి. అంటే వాళ్లమధ్య కల్లోలం సంభవించి సరిగ్గా ఏడాది గడిచాక-

‘నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ లైబ్రరీలో అడుగుపెట్టాలనిపిస్తుంది. అదొక పవిత్రస్థలంగా తోస్తుంది. ఏదన్నా పుస్తకం దొరుకుందేమో, దాన్ని చదువుతోంటే మరింత సజీవంగా ఉన్నట్టు అనుభూతి చెందుదామనీ,ఆ రాత్రికి సంతృప్తిగా నిద్రపోగలననీ అనుకున్నాను. కాని ఇక్కడ ఎటువంటి ఆత్మ ఉనికి గోచరమవుతున్నదంటే పుస్తకాల్తో పనిలేకుండా పోయింది. నేనిక్కడకి నీ దగ్గరకి వచ్చినప్పుడు నిన్ను నువ్వు ఇచ్చుకోలేకపోయావు, నేనూ స్వీకరించలేకపోయాను. నిష్ప్రయోజనమైపోయింది. కానీ నిన్ను కనుగొనలేకపోయినా నీ జీవితంలోని శాశ్వతసౌందర్యం నాకు అనుభవానికొచ్చింది.’

ఆ తర్వాత వాక్యాలు మరింత హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి:

‘ఇంకా ఎంత చెప్పాలనిపిస్తున్నదో కాని చెప్పలేకపోతున్నాను. నువ్వు దగ్గరున్నప్పుడు నేను నీ పట్ల ఎంత బలంగా ఆకర్షితురాలినవుతున్నానో గాని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను. నీ దగ్గరనుంచి పక్కకు జరిగాక మాత్రం ఒక సంగతి తెలుసుకున్నాను. ఇంకా అంత సహనం, అంత శ్రద్ధ, అంత పవిత్రత నాకు పట్టుబడకపోయి ఉండవచ్చుగానీ, ఈ పవిత్రస్థలంలో అడుగుపెట్టేముందు చెప్పులు తీసి పక్కనపెట్టాను.’

ఆ తర్వాత మరొక నాలుగేళ్ళు వాళ్ళు కలుసుకుంటూనే ఉన్నారు. ఆ గొడవల తర్వాతే ఆయన ఆమెని Dial పత్రిక సంపాదకురాలిగా ఉండమని అడిగాడు. 1841-42 రెండేళ్ళు ఆ పత్రికని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది. ఆమెని ఆర్థికంగా ఆదుకోడంకోసం ఆ పత్రికకి సంపాదకురాలుగా ఉండమని ఎమర్సన్ ఆమెని అడిగినప్పటికీ, ఆ రెండేళ్ళూ ఆయన ఆమెకు ఎటువంటి పారితోషికం ముట్టచెప్పలేకపోయాడు. అయినా ఆమె పనిచేసింది, ఎంతో ఇష్టంగా, శ్రద్ధగా, భక్తిగా.

1844 లో ఆమెని న్యూయార్క్ ట్రిబ్యూన్ పత్రిక సంపాదకుడు న్యూయార్క్ వచ్చి తన పత్రికలో పనిచెయ్యమని అడిగినదాకా ఆమెకీ, ఎమర్సన్ కీ మధ్య స్నేహం, సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉన్నాయి.

మిగతాది రేపు రాస్తాను.

4-11-2023

6 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు-13”

  1. అయ్యో……మధ్యలో ఆపేసారే…..మళ్ళీ రేపటి దాకా నిరీక్షణ…

  2. Sigh!

    ఎంత ఉద్వేగభరిత క్షణాలు…హృదయాన్ని బలంగా మెలితిప్పి పిండుకుంటే తప్ప రాని సంజాయిషీలు ఇవి. కానీ ఎంత మెలితిప్పినా హృదయం చీలిపోకుండా చూసుకోవడం ముఖ్యం. వాళ్ళు ఆ కాలాలను దాటడాన్ని చూడటం ఒక తెరిపి.

    ఈ రోజు మొదటి పేరా చూడగానే భలే ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా…ఆ దీపాల చుట్టూ గడ్డ కట్టుకున్న వెలుతురు …కొన్ని క్షణాల ముందే Rilke I believe in nights చదివి ఉన్నాను, మీ మాటలు చదివితే, I believe in mornings అనేవాడేమో! ❤️

  3. ‘వేదన’ అక్షరాలలో ఎంత హృద్యంగా ఒదిగిందడీ.. ఆ ఉత్తరాలలో..

Leave a Reply

%d