పోస్టు చేసిన ఉత్తరాలు -11

2-11-2023, తెల్లవారు జాము మూడింటికి

ప్రియమైన

రాత్రి నిద్రలోనూ, కలతనిద్రలోనూ కూడా ఏవేవో వాక్యాలు మనసులో అల్లుకుంటూ, తెగిపోతూ, తిరిగి మళ్లా అల్లుకుంటూ ఉన్నాయి. కొన్నిసార్లు అస్పష్టంగా నీ రూపం మనసులో కదలాడి మళ్ళా ఇంతలోనే అదృశ్యమైపోతూ ఉంది. ఒక్కొక్క క్షణం ఏదో చెప్పలేనంత ఆర్తి గాఢమైన ఉద్వేగంగా నన్ను చుట్టబెడుతూ ఉంది. అప్పుడు నేను charged గా ఉన్నాను, inspired గా ఉన్నాను అంటామే, అలాంటి క్షణాలన్నమాట. అటువంటి సమయాల్లో ఏదో ఒక మోర్సుకోడు ఎక్కణ్ణుంచో మనసుకి సందేశాలు పంపుతుంది. వాటిని ఓపిగ్గా డీకోడ్ చేసుకోవాలి. నన్ను నేను బోధపరుచుకోవాలి. ప్రేమలేఖ రాయడమంటే, ఏ స్వప్నలిపినో, ఇద్దరికీ అర్థమయ్యేభాషలోకి అనువదించుకోవడం.

ప్రేమానుభవం అంటాంగానీ, నిజానికి, మనసులో కదిలే ఆ సంచలనాన్ని చాలా సార్లు శరీరభాషలోకో, లేదా హృదయభాషలోకో కుదించడానికే మనం మొగ్గుచూపుతూ ఉంటాం. ఎందుకంటే, ఆ స్పందనల్ని unravel చేసుకోవడానికి చాలా ఓపిక కావాలి. పారిజాతపు మొగ్గలు రేకులుగా విప్పుకునే భాష అది. దానిముందు మోకరిల్లి, ఎలాంటి pre-tensions లేకుండా, చెవి ఒగ్గి వినవలసిన సంభాషణ అది. ‘పూలబాసలు తెలుసు ఎంకికి’ అని కవి ఊరికినే అనలేదు!

ఆలోచిస్తూ ఉన్నాను, ఈ వారం రోజులుగా. మొదట్లో నువ్వు నా ఇరవయ్యేళ్ళప్పుడు ఎక్కడున్నావు అని అడిగానుగాని, నువ్వు నా తొలియవ్వనకాలంలో కనిపించి ఉంటే, నేను ఈ భాష వినగలిగిఉండేవాణ్ణి కాను. అప్పుడు నా భావోద్వేగాల గుండెచప్పుడునే నీ మాటలుగా భ్రమించి ఉండేవాణ్ణి. ప్రేమపేరుమీద ఇప్పటికీ చాలామంది చేసేది ఇదే. తాము ప్రేమిస్తున్న వారి ఎదట నిలబడి, తమ మనసు చెప్తున్న మాటలే, ఎదటి వాళ్ళ హృదయం చెప్తున్నమాటలుగా పొరపడుతుంటారు. అందుకనే ఎన్నో ప్రేమలు, మొదట్లో ధగధగలాడుతూ కనిపించినవి, రోజులో, నెలలో తిరక్కుండానే వెలవెలబోడం మొదలుపెడతాయి. ఆ మొదటి crushలు infatuations గా crush అయిపోతాయి.
నువ్వు ఎంత చదువు, ఎంత రాయి, ఎంత లోకం చూసి ఉండు, కాని ప్రతిసారీ ప్రేమముందు నువ్వు నిరక్షరాస్యుడివే. దాన్ని ఎలా స్వీకరించాలో, దాన్ని ఎలా తట్టుకోవాలో తెలియకనే మనుషులు తల్లకిందులవుతారు. ఈ రహస్యం సూఫీ కవులకి బాగా తెలుసు. అందుకనే ఒక సూఫీ కవి మనుషులు నేర్చుకోవలసింది, ముందు, ప్రేమించడమెలానో కాదు, ప్రేమని స్వీకరించడం ఎలానో తెలుసుకొమ్మన్నాడు.

ఎమర్సన్ లాంటి భావుకుడు, రసహృదయుడు, ఉదాత్తమానవుడు కూడా మార్గరెట్ లాంటి ప్రేమైకజీవి తన తలుపు తట్టినప్పుడు కలవరపడిపోయాడంటే, ప్రేమవిద్య ఎంత అరుదైన విద్యనో అర్థమవుతూ ఉంది. ఆమె ఆయనకి 1836 లో పరిచయమైందని చెప్పానుకదా. మూడేళ్ళ తరువాత, అంటే 1839 నుంచీ ఆమె ఆయనకి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రెండేళ్ళు వాళ్ళిద్దరూ కలిసి Dial పత్రిక నడిపారు. ఆ రెండేళ్ళూ వాళ్ళిద్దరి జీవితాల్లోనూ కూడా గొప్ప కాలం. Most productive. డయొటిమా సోక్రటీస్ తో చెప్పిందే, నిజమైన ప్రేమికులు సౌందర్యాన్ని సృష్టిస్తారని. వాళ్ళిద్దరూ ఆ రెండేళ్ళూ సౌందర్యాన్ని, ఆదర్శాల్ని, ఉత్తేజాన్ని సృష్టించారు. ఇంకా చెప్పాలంటే కొత్త ఆకాశాన్ని సృష్టించారు. కాని ఆ సాన్నిహిత్యాన్ని, ఒకరు మరొకరిలో మేల్కొల్పుతున్న ఆ ప్రేమ సంచలనాన్ని, చుట్టూ ఉన్న మనుషుల కన్నా ముందు, వాళ్ళిద్దరే తట్టుకోలేకపోయారు. 1840 అక్టోబరుకల్లా ఎమర్సన్ ఆ స్నేహంలోని ప్రగాఢ పార్శ్వానికి తలుపులు మూసేసాడు.

అంటే వాళ్ళిద్దరూ విడిపోయారని కాదు. కాని అంతకన్నా ముందుకు పోలేకపోలేమని తెలుసుకున్నారు. తన geography లో పెద్ద చైనాగోడ ఒకటి ఉందని తనకి తెలిసిందని చెప్పాడు ఆమెకి. ఆ గోడనిదాటగలిగే శక్తి తనకు లేదని చెప్పుకున్నాడు. అయినా వాళ్ళమధ్య స్నేహం కొనసాగింది, మరి 1842 దాకా. ఆ తర్వాత ఆమె రెండేళ్ళు అమెరికా అంతా పర్యటిస్తోగడిపింది. చివరికి 1844 లో న్యూయార్క్ వెళ్ళిపోయింది. 1836 లో మొదలైన స్నేహం ఎనిమిదేళ్ళపాటు వాళ్ళిద్దర్నీ సుడిగాలిలాగా చుట్టబెట్టింది, పైకిలేపింది, పరీక్షకు పెట్టింది, పరవశుల్ని చేసింది, విహ్వలుల్ని చేసింది, చివరికి ఒకరినుంచి మరొకర్ని దూరం చేసేసింది. అలాగని వాళ్ళు ఒకరితో ఒకరు తెగతెంపులు చేసుకోలేదు. మంచి స్నేహితులుగా కొనసాగారు. చివరిదాకా ఎమర్సన్ ఆమెకొక philosopherగానూ, guideగానూ కొనసాగుతూనే ఉన్నాడు. చివరికి ఆమె మరణించాక కూడా ఆమె స్మృతిని ఒక ఉత్తేజకరమైన చరిత్రగా పదిలపర్చడానికి తాను ఎంతచెయ్యగలడో అంతా చేసాడు.

కాని ఆ అనుబంధం ఒక ప్రయోగశాల. ముఖ్యంగా ఏ ఇద్దరు జ్ఞానాన్వేషకులకైనా, వికసిస్తున్న తమ సృజనశక్తులకి పరస్పరం ప్రేరణ అందించాలనుకుని స్నేహం చేసేవాళ్ళకైనా వాళ్ళ స్నేహం నుంచి నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. అలాగని ఆ పాఠాలు నేర్చుకుంటే, మనమేదో మరింత మెరుగ్గా నడుచుకుంటామని కాదు. జీవితానుభవాలు ఏ ఒక్కరివీ మరొకరికి ఎన్నటికీ పాఠాలు కాలేవు. కాని పోల్చుకోడానికి ఉపకరిస్తాయి. మనం కూడా అలాంటి అవస్థలు దాటుతున్నప్పుడు మనల్ని మనం మరింత తేటగా పరికించుకోడానికి పనికొస్తాయి.

ఎమర్సన్ పరిపూర్ణమైన Platonist. ప్రేమానుభవం జీవితాన్ని మరింత ఉదాత్తం చెయ్యాలనీ, చేస్తుందనీ నమ్మినవాడు. ఆ మాటకొస్తే, ప్రతి ప్రేమికుడిలోనూ కూడా ఒక ప్లెటానిస్టు ఉంటాడు. చాలామంది అనుకుంటారు, ప్రేమని శారీరికసంతోషం వైపు మరల్చడం మొదలుపెట్టాకే ప్రేమ మాసిపోడం మొదలవుతుందని. కాదు. సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, ఒక చిన్న పూరిపాకలో ఏనుగు ప్రవేశించినట్టు, మనం ఆ ప్రేమోధృతికి నిలబడలేకపోడంలో మొదలవుతుంది. అది ముందు నిన్ను నీ రుటీన్ నుంచి బైటికి లాగేస్తుంది. దాంతోపాటే నీ pettiness లు అన్నింటినుంచీ కూడా. చలంగారి పురూరవలో ఊర్వశి అడుగుతుందే పురూరవుణ్ణి, ఏమి? దుస్తులు లేకుండా నువ్వు నీ పరివారం ఎదట పడలేవా అని. ప్రేమ మననుంచి మన ఆచ్ఛాదనలన్నిటినీ ఒకటీ ఒకటీ తీసెయ్యడం మొదలుపెడుతుంది. మొదట్లో ఒకటో రెండో లఘుత్వాలనుంచో, అల్పత్వాలనుంచో బయటపడటం మనకి ఉత్సాహకరంగానే ఉంటుంది. కొత్త థ్రిల్ కూడా అనుభవంలోకి వస్తుంది. కానీ అది మొదటిదశ. ప్రేమ నిన్ను చివరికి ఆ థ్రిల్ నుంచి కూడా దూరంచేసేస్తుంది. అప్పుడు ఆ ఆరుబయట, అనాచ్ఛాదితంగా నిలబడవలసివచ్చినప్పుడు, అది చావులాగా తోస్తుంది. భయమేస్తుంది. వెనక్కి పారిపోవాలనిపిస్తుంది. ఈ నూతనస్వాతంత్య్రంకన్నా మునపటి కట్టుబాట్లు ఎంతో సౌకర్యవంతమనిపిస్తాయి. ఒకరినొకరం ద్వేషించుకోడం మొదలుపెడతాం, శపించుకోడం మొదలుపెడతాం. దాదాపుగా లోకంలో ప్రతి ప్రేమ పర్యవసానమూ ఇదే.

కానీ ఒకరి ముఖం మీద మరొకరు తలుపులు మూసేసుకుని, జీవించినంతకాలం మరెన్నడూ ఒకరినొకరు చూడకూడదని ఒట్లుపెట్టుకుని, ఒకరికొకరు మరణించినట్టే తక్కిన జీవితమంతా గడిపినప్పుడు కూడా, ఆ ప్రేమానుభవం వారికి కలగడం వారి జీవితాల్లో వారికి లభించిన గొప్ప భాగ్యం అనే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే, ప్రేమకలగక ముందు వారు వేరు. కలిగిన తర్వాత వారు వేరు. ప్రేమ మనల్ని challenge చేస్తుంది. మన లోపల మనకే తెలియకుండా నిద్రాణంగా ఉన్న ఎన్నో శక్తుల్ని పైకి తీస్తుంది. వాటిని పూర్తిగా వినియోగానికి పెట్టమని కవ్విస్తుంది. అంతకుందు తెలియని కొత్త తీరాలు, కొత్త ఆకాశాలూ, కొత్త లోకాలూ కనిపిస్తాయి కాబట్టి నువ్వింకెంత మాత్రం నీ పాత జీవితాన్ని కొనసాగించలేవు. నీకు సాక్షాత్కరించిన కొత్త సత్యంతో నువ్వు జీవితం ఎదట నిలబడతావు. నీకు శక్తి ఉంటే, భాగ్యముంటే, బహుశా ఈ కొత్త యోగ్యతతో మరొక ప్రేమను స్వీకరించడానికి సిద్ధపడతావు.

ఎమర్సన్ కి జరిగింది అదే. ఆయన తన పరిమితుల్ని తెలుసుకుని ఆమె తనలో కలిగిస్తున్న అలజడిని రెండుచేతులా వెనక్కి నెట్టి, తానొక గోడవెనక ఆశ్రయం పొందినమాట నిజమే కాని, ఆ ఉధృతి అంతా తగ్గిన తరువాత, ఆ వరద తీసేసిన తర్వాత, ఆ సంక్షుభితమైన రాత్రి తెల్లవారేక, Friendship మీద ఒక వ్యాసం రాసాడు. అద్భుతమైన వ్యాసం. ఇంగ్లిషు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థీ చదవవలసిన వ్యాసం. ఆ వ్యాసం మొదలుపెడుతూనే He (a friend) stands to us for humanity. He is what we wish అని అంటాడు.

కాని ఆ వ్యాసం గురించి రాయడానికి ముందు వాళ్ళిద్దరి మధ్యా సంభవించిన స్నేహం గురించి, అటువంటి స్నేహం తమకి లభిస్తున్నదని తెలిసి కూడా వాళ్ళు దాన్ని కొనసాగించలేకపోవడంలోని అశక్తత గురించి కొంత చెప్పాలి. చెప్పాలి అంటే నీకు చెప్పాలి అని కాదు, నాకు నేను చెప్పుకోవాలి. ఆ వంకన, నా జీవితంలో నేను నిలుపుకోలేకపోయిన స్నేహాల గురించి ఒకింత నిదానంగా ఆలోచించుకోవాలి.

మన జీవితాల్లో మనకి చాలామంది మిత్రులో, సహచరులో తటస్థిస్తారు. అయినా మనం మరొక కొత్త స్నేహంకోసం అర్రులు చాస్తూనే ఉంటాం. ఎందుకు? ఎందుకంటే, నేను ముందే చెప్పానుకదా, చలంగారు చెప్పినట్టుగా, మనం మన శరీరాన్నో, బుద్ధినో, మనసునో, ఏదో ఒక్కదాన్ని మాత్రమే తృప్తి పరిచే స్నేహల దగ్గరా, అనుబంధాల దగ్గరా ఆగిపోలేం. మనం వెతుక్కునే మనిషి అవన్నీ వికసించే తావుగానో విశ్రమించే తావుగానో ఉండాలని తపిస్తాం. అన్నిటికన్నా కూడా రెండు మనసులు కలిస్తే, ఆ తర్వాత రెండు దేహాలు కలవడంకన్నా కూడా, రెండు ఆలోచనలు కలవాలనే ఒక తృష్ణ మనకు తెలియకుండానే మనల్ని దహించడం మొదలుపెడుతుంది. అందులోనూ బాగా చదువుకున్నవాళ్ళకి, సాహిత్యపిపాసులకి, కళాకారులకి, సృజనకారులకి, శాస్త్రవేత్తలకి తమ భావాల్ని, తమ చింతనని, తమ సత్యాల్ని అర్థం చేసుకోగలిగే మనిషి కావాలని అనిపిస్తూ ఉంటుంది. ఏ ప్రేమికుల ప్రేమ మనసులు కలవడంతో ముగిసిపోతుందో వాళ్ళు ఈ దృష్టిలో చూస్తే చాలా అదృష్టవంతులు. వాళ్ళు కవులో, కళాకారులో కాకపోతే మరింత అదృష్టవంతులు. వాళ్ళని అంతకుమించి నడిపించే భావోద్వేగాలేవీ ఉండవు కాబట్టి.

కానీ ఒక మార్గరెట్ లాగా సాహిత్యసముద్రాల్ని తనలో మోసుకు తిరిగే భావుకురాలికి ఒక ఎమర్సన్ స్నేహం కావాలని తప్పకుండా అనిపిస్తుంది. తాను ఫలానా పుస్తాకాలు చదివానని చెప్పడంతో మొదలయ్యే ఆ పంచుకోవడం, ఆ పుస్తకాల గురించీ, ఆ కవుల గురించీ తన మూల్యాంకనాన్ని పంచుకోవడంగా మారుతుంది. ‘నాకు ఇలా అనిపిస్తోంది. నీకేమనిపిస్తోంది?’ ఎప్పుడెప్పుడు ఈ ప్రశ్నలు అడుగుదామా, ఎప్పుడెప్పుడు ఒకరితో ఒకరు సాకల్యంగా చర్చించుకుందామా అని ఉర్రూతలాడటం మొదలవుతుంది. ఇది స్త్రీపురుషులమధ్యనే కానక్కరలేదు. నిజానికి వయసుతో, జాతితో, మతంతో పనిలేని సాహచర్యం ఇది. కావలసిందల్లా ఇద్దరి wave length ఒకటి కావడం.

పైకి చూడ్డానికి నిరపాయకరంగానూ, ఎంతో ఆరాధనీయంగానూ కనిపించే ఇటువంటి స్నేహాలు కొనసాగడానికి అడ్డేమిటి అనిపిస్తుంది, ముందు. కానీ సరిగ్గా ఈ కారణంవల్లనే సోక్రటీస్ విషపానం చెయ్యవలసి వచ్చింది. సరిగ్గా ఈ కారణానికే షమ్స్ తబ్రీజీ అదృశ్యమైపోవలసి వచ్చింది. ఇంతకన్నా కూడా infatuations పట్ల సమాజం మరింత ఔదార్యం చూపించగలదు. అక్రమసంబంధాల్ని చూసీచూడనట్టు పోగలదు. కానీ ఇద్దరు మనుషులు, వాళ్ళిద్దరూ స్త్రీలే అయినా, వాళ్ళిద్దరూ పురుషులే అయినా కూడా, తమకి తెలియని, తాము అందుకోలేని, తాము గ్రహించలేని ఏ సౌందర్యాన్నో వాళ్ళు పంచుకుంటున్నారని తెలిస్తే సంఘానికి కలిగే అసహనం అంతా ఇంతా కాదు.

అసలు ఇద్దరి దాకా ఎందుకు? ఒక్క మనిషే అయినా కూడా తనతో నిమిత్తం లేకుండా ఏదో సత్యాన్నో, శాంతినో చూడగలుగుతున్నాడంటే సమాజం ఆ మనిషిని ఎప్పటికీ క్షమించలేదు. దానికి కావలసింది ముందు తన భాష మాట్లాడటం, తన కథనాల్లో పాలుపంచుకోవడం, తాను చెప్పే narratives కి subscribe చేస్తూండటం.

సమాజం అనే మాట వాడుతున్నానుగానీ, నిజానికి మనమే మనలో ఒక సమాజాన్ని మోసుకుంటూ తిరుగుతుంటాం. ప్రేమ తాలూకు తొలి చిహ్నాలు కనిపించడం మొదలుకాగానే బయటి సమాజం కన్నా ముందు మనలోపలి సమాజం తొందరగా alert అవుతుంది. ఇక అది మనల్నీ, మనం ప్రేమిస్తున్నవాళ్లనీ కూడా హింసించడం మొదలుపెడుతుంది.

ఎమర్సన్ ఆ విషయం గుర్తుపట్టాడు. అప్పటికీ న్యూ ఇంగ్లాండ్ సమాజం ఆయన పట్లా, మార్గరెట్ పట్లా చాలా ఔదార్యం చూపించిందనే చెప్పాలి. ఆయన నడిపే ట్రాన్సండెంటల్ క్లబ్ లో మొత్తం పురుషులే సభ్యులుగా ఉండే రోజుల్లో మార్గరెట్ ఆ సభలో భాగం కావడం చిన్న విషయం కాదు.

ఎమర్సన్ జీవితానికి వస్తే అప్పటికి ఆయన మొదటిభార్య గతించింది. వారిది ప్రేమవివాహం. కాని ఆమె పెళ్ళయి రెండేళ్ళు తిరక్కుండానే ఒక శిశువుని కని మరణించింది. ఆ దుఃఖం నుంచి ఉపశమనానికి ఎమర్సన్ చాలా ప్రయత్నం చేసాడు. యూరోపు తిరిగివచ్చాడు. మళ్ళా రెండవ పెళ్ళి చేసుకున్నాడు, కానీ ఆ సంసారంలో అతడికి పూర్వపు ఆనందం కరువైంది. అలాంటి రోజుల్లో మార్గరెట్ అతడి జీవితంలో అడుగుపెట్టింది. ఆ రోజుల్లోనే తాను ప్రాణప్రదంగా చూసుకుంటున్న చిన్నపిల్లవాడు అయిదేళ్ళు నిండకుండానే ఆకస్మికంగా మరణించాడు. మామూలుగా అయితే, ఇటువంటి సంతోషరాహిత్యంలో, దుఃఖంలో మార్గరెట్ లాంటి ఒక స్త్రీ తారసపడ్డప్పుడు మరో పురుషుడెవరేనా ఎంతో ఆత్రుతతో, ఆబగా ఆ స్నేహాన్ని కైవసం చేసుకోడానికి ప్రయత్నించి ఉండేవాడు. కాని ఎమర్సన్ ని ఋషి అనేదందుకే. ఆయన తన హృదయంలో ఒక ఉన్మత్త మధుపం ఝుంకారం చేస్తున్నప్పటికీ, నిశ్చలపద్మంగా నిలబడ్డాడు. తనకీ, మార్గరెట్ కీ కూడా ఏది మంచిదో దాన్నే ఎంచుకున్నాడు.

ఆ విషయం అందరికన్నా ముందు అర్థం చేసుకున్నది మార్గరెట్ నే. అందుకనే, ఆమె 1840 లోనే తన జర్నల్ లో ఇలా రాసుకుంది:

In friendship with RWE, I cannot hope to feel that I am his or he mine. He has nothing peculiar, nothing sacred for his friend. He is not to his friend a climate, an atmosphere, neither is his friend a being organized especially for him, born for his star. He speaks of a deed, of a thought to any commoner as much as to his peer. His creed is, show thyself, let them take as much as they can.. His friendship is only strong preference and he weighs and balances, buys and sells you and himself all the time.

2-11-2023

9 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు -11”

  1. ఇట్లాంటి ఉత్తరం చదవడం ఒక వరం అనిపించింది. మీరు ఎదురుగా నిలబడి, మీ పేరు పెట్టుకుని, నా స్నేహాలు చూసుకోమని చెప్పినట్టు ఉంది. ఇప్పుడు కాదు, జీవన పర్యంతము. ఇంతకు ముందు, ఇక మీదట కూడా. వాళ్లిద్దరి గురించి చదవటం మిమ్మల్ని ఎంత కదిలిస్తోందో చాలా చోట్ల కనపడింది. అతనిలో మిమ్మల్ని మీరు చూసుకున్నారా?

    ఇది ఉత్తరం కాకపోతే, పుస్తకం అయి ఉంటే, కూడా, నేను ఇక్కడే ఆగాల్సి ఉండేది. ఎన్ని ఆలోచనలో మనసంతా రొదగా తిరుగుతున్నాయి.

Leave a Reply

%d