పోస్టు చేసిన ఉత్తరాలు -10

31-10-2023, సాయంకాలం 7.15

ప్రియమైన

నీకు పొద్దున్న రాసిన ఉత్తరంలో ఇంకా మరెన్నో వాక్యాలు జలధారలాగా ప్రవహిస్తూనే ఉన్నాయిగాని, ఆ ఉత్తరాన్ని అక్కడే ఆపేయటంతో అవి రోజంతా నా హృదయంలో సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. కాంతిపోగుల్తో వస్త్రం నేసుకున్నట్టుగా ఆ వాక్యాలతో రోజంతా నీకు ఉత్తరం రాస్తూనే ఉన్నాను. అసలు ఇలాంటి లేఖల్ని మాటల్తో కాదు, మిలమిలల్తో రాయాలి. ‘పూర్వకాలం కన్యలు లేసు అల్లినట్టుగా రాసాడు ఆయన ఆ కథని’ అని అంటాడు టాల్ స్టాయి చెహోవ్ రాసిన ఒక కథ గురించి. నేను కూడా ఈ ఉత్తరాల్ని అట్లా ఒక కన్య హృదయంతో లేసు అల్లినట్టుగా రాయాలి. లేదా నా చిన్నప్పుడు మా బామ్మగారు మధ్యాహ్నాలవేళ ఇంత దూది చేతుల్లోకి తీసుకుని ఒత్తులు చుట్టినట్టుగా నా వాక్యాల్ని మలుచుకోవాలి.

ఒక ఎమిలీ డికిన్ సన్, ఒక మార్గరెట్ ఫుల్లర్, ఒక ఎలిజబెత్ బ్రౌనింగ్, ఒక తోరూదత్, ఒక రేవతీదేవి -వీళ్ల గురించి తలుచుకోవడమన్నా, రాయడమన్నా ఒక జలపాతాన్ని ఒక ఉత్తరంగా మార్చడం. వాళ్ళ జీవితాల్లో వాళ్లు చూసిన వెలుగు, వాళ్ళ జీవితాల్ని దహించివేసిన ఒక తపన, లోకాతీతమైన ఏ సౌందర్యమో తమని నిలనివ్వకుండా నడిపించిన ఒక అనంత నీలిమ- వాటిని మళ్లా మన జీవితాల్లోకి వడగట్టుకోవడం. ఎమర్సన్ వేరొక సందర్భంలో చెప్పినట్టుగా మల్బరీ ఆకులు పట్టు వస్త్రంగా మారే ప్రక్రియ.

పద్ధెనిమిదో శతాబ్దం age of electricity అనుకుంటే, పందొమ్మిదో శతాబ్దం age of electro-magnetism. వట్టి అయస్కాంతమూ, వట్టి విద్యుత్తూ కాదు, విద్యుదయస్కాంత శక్తి. మార్గరెట్ ఫుల్లర్ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకొక విద్యుదయస్కాంతక్షేత్రాన్ని సంభావిస్తున్నట్టుగా ఉంది.

ఆమె జీవించిఉండగా ఆమె పట్ల ద్వేషంగానూ, ఆమె ఈ లోకాన్ని వదిలిపెట్టిన తరువాత విస్మృతిగానూ సమాజం ఆమె పట్ల తన అసహనాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. కాని ఆ పొల్లు అంతటినీ పక్కకు తోసి మరీ చూడక్కర్లేకుండానే, ఆ జాజ్వల్యమానమైన ప్రతిభ, ఆ సాధికారికత, ఆ ఓజోమయ వ్యక్తిత్వం మనకి, ఇన్నేళ్ళ తరువాత కూడా కనబడుతుండటమేకాక, తన సమకాలికులకి కనిపించినదానికన్నా మరింత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.

1-11-2023, తెల్లవారు జాము 3.30

మార్గరెట్ ఫుల్లర్ తండ్రి తిమోతి ఫుల్లర్ మసాచుసెట్స్ లో కేంబ్రిడ్జ్ పోర్ట్ లో లాయర్. కాంగ్రెస్ మేన్ కూడా. మార్గరెట్ అతడి పెద్దకూతురు. ఆమెకి మూడున్నర ఏళ్ళ వయసునుంచే ఆయన తన కాలంలో సాధారణంగా ఏ బాలికకీ దొరకని అత్యున్నత స్థాయి క్లాసికల్ విద్యని అందించాడు. అందువల్ల మార్గరెట్ అయిదో ఏటికల్లా లాటిన్ లో ప్రావీణ్యం సంపాదించి వర్జిల్ ని చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరుకుంది. ఎనిమిదో ఏటికల్లా, షేక్ స్పియర్, సెర్వాంటిస్, మోలియర్ లు తన స్నేహితులని చెప్పుకోగలిగింది. లాటిన్ తో పాటు, ఫ్రెంచ్, ఇటాలియన్ లలో కూడా ప్రావీణ్యం లభించడంతో హొరేస్, టాసో, పెట్రార్క్, డాంటే వంటి మహాకవుల్ని స్వయంగా చదువుకోవడమే కాదు, వాళ్ళ కావ్యలోకాల్లో విహరించడం కూడా మొదలుపెట్టింది. గ్రీకు కూడా కొంత నేర్చుకుందిగాని, ఆమెది ప్రధానంగా లాటిన్ ప్రపంచం. ఆమె మానసిక ప్రపంచంలో పూర్తిగా రోమన్ గా మారిపోయింది. తొమ్మిదో ఏట తండ్రి స్కూల్లో చేర్పించాడు. అయిదేళ్ళ తరువాత గ్రోటన్ అనే చోటకి పంపించాడు. అక్కడ రెండేళ్ళు చదువుకున్నాక మళ్లా కేంబ్రిడ్జికి చేరుకుంది. కాని అప్పటికే ఆమె తన కాలం నాటి పిల్లల కన్నా ఎంతో ఎక్కువ చదువుకోవడంతో తన ఈడు పిల్లల్తో కలవలేకపోయేది. ఆ తర్వాత జర్మన్ స్వయంగా నేర్చుకుని గొథే, షిల్లర్, నొవాలిస్ లాంటి జర్మన్ రొమాంటిసిస్టుల్ని చదవడం మొదలుపెట్టింది. బాల్యంలో లాటిన్ లాగా యవ్వనంలో జర్మన్ ఆమెని పూర్తిగా ఆవహించింది. గొథే ఆమె అభిమాన కవిగా మాత్రమేకాక, ఆమెమీద జీవితకాల ప్రభావంగా మారిపోయేడు.

ఆ పసితనంలో ఆ మహాకవుల్ని చదువుతూ తన మనసులోనే ఒక రోమ్ నగరాన్ని నిర్మించుకుని అక్కడి నుండి దూర పర్వత పంక్తులు చూస్తూ ఉంటే కన్నీళ్ళతో తన చెంపలు తడిసిపోయేవనీ, చెప్పలేని విషాద మాధుర్యం ఒకటి తనని ఆవహించేదనీ ఆమె రాసుకుంది. ఆమె బాల్యం గురించి చదువుతున్నంతసేపూ నాకు నా బాల్యమే గుర్తొస్తుంది కాబట్టి ఆమె అవస్థ ఎటువంటిదో నేను ఏదో ఒక మేరకు అర్థం చేసుకోగలిగాను.

అలాగే అంత చిన్నతనంలోనే అంత అత్యున్నత సాహిత్యం చదవడం వల్ల తనకు సాహిత్య ప్రమాణాలు నిర్దిష్టంగా ఏర్పడిపోయాయనీ, తన తర్వాత జీవితంలో ఆ ప్రమాణాల నుంచి ఒక్కింత కూడా పక్కకు జరగలేకపోయాననీ రాసుకుందామె. ఆమె జీవితంలోని గొప్ప సౌందర్యమూ, గొప్ప విషాదమూ కూడా ఈ అంశం చుట్టూనే అల్లుకుని ఉన్నాయి.

గొథే ఆలోచనలవల్ల కొంతా, తనకి చిన్నప్పుడే అపారమైన సాహిత్యపరిజ్ఞానం, మహారచయితలతో మానసిక సాన్నిహిత్యం కలగడం వల్ల కొంతా ఆమెకి పెళ్ళి పట్ల ఆసక్తి లేకపోయింది. తన యవ్వనం తొలిరోజుల్లో డేవిస్ అనే యువకుడి పట్ల అభిమానం పెంచుకుందిగాని అతడు ప్రతిస్పందించలేదు. జేమ్స్ ఫ్రీమన్ క్లార్క్ అనే యువకుడితో స్నేహం మొదలయ్యింది. కానీ అతడు న్యూ ఇంగ్లాండ్ వదిలిపెట్టడంతో అతడితో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగించింది. ఆ రోజుల్లో ఆమె ఆలోచనల గురించీ, జీవితం గురించీ, అధ్యయనం గురించీ తెలుసుకోడానికి ఆ ఉత్తరాలే చాలావరకూ ఆధారం.

ఈలోపు తండ్రి ప్రాక్టీసు దెబ్బతినడంతో కుటుంబం మళ్లా గ్రోటన్ కు మారింది. కాని ఆమె ఇరవై అయిదో ఏట, అంటే 1835 లో తండ్రి హటాత్తుగా మరణించాడు. అతడేమీ వీలునామా రాసి ఉండకపోవడం చేతా, పెద్దగా ఏమీ మిగల్చకపోవడంవల్లా కుటుంబం మొత్తం ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయింది. తండ్రి చనిపోకముందు మార్గరెట్ యూరోప్ వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంది. తాను పుస్తకాల్లో చదివిన యూరోప్ ని స్వయంగా చూడాలనీ, అధ్యయనం చెయ్యాలనీ ఎన్నో కలలు కంది. కాని తండ్రి మరణంతో ఆ పర్యటన రద్దైపోయింది. ఇప్పుడామె తన తల్లినీ, నలుగురు తమ్ముళ్ళనీ పోషించడంకోసం ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకోవలసి వచ్చింది.

మొదట్లో ఆమెకి బోస్టన్ లో బ్రాన్సన్ ఆల్కాట్ అనే ఆయన నడుపుతున్న స్కూల్లో ఉపాధ్యాయినిగా ఉద్యోగం వచ్చింది. అక్కడ ఎలిజబెత్ పీబడి అనే పండితురాలి పరిచయం కూడా లభించింది. అల్కాట్ ఆమెకి ఉద్యోగమయితే ఇవ్వగలిగాడుగాని, తగిన జీతం ముట్టచెప్పలేకపోయాడు. దాంతో ఆమె ప్రావిడెన్స్ లో హిరమ్ ఫుల్లర్ అనే ఆయన నడుపుతున్న స్కూల్లో చేరింది. ఏడాదికి వెయ్యి డాలర్ల జీతం. అంటే ఆ రోజుల్లో యూనివెర్సిటీ ప్రొఫెసర్లకి సమానమైన జీతం అన్నమాట. 1836 లో ప్రావిడెన్స్ లో చేరినప్పుడే ఆమెకి ఎలిజబెత్ పీబడి ద్వారానో లేదా మార్టినేవు అనే మరొక రచయిత్రి ద్వారానో ఎమర్సన్ పరిచయం లభిచింది. అప్పుడు ఎమర్సన్ కంకార్డ్ లో ఉండేవాడు. కంకార్డ్ ను ఒక ఏథెన్సుగా మార్చి, న్యూ ఇంగ్లాండ్ కు ఒక ప్రవక్తగా అమెరికన్ సంస్కృతికి రూపురేఖలిస్తూ ఉన్నాడు.

ఆ రోజుల్లో ఆమె అన్నా బార్కర్ అనే అమ్మాయితో ప్రేమలో పడింది. మరోవైపు శామ్ వార్డ్ అనే యువకుణ్ణి కూడా గాఢంగా ప్రేమించింది. అన్నా, శామ్, మార్గరెట్, కరోలిన్ స్ట్రగిస్ లతో కలిసి ఎమర్సన్ ఒక ఆదర్శవంతమైన మిత్రబృందంగా ఏర్పడ్డారు. కాని ఈలోపు అన్నా, శామ్ పెళ్లిచేసుకున్నారు. తమ పెళ్ళయ్యేదాకా ఆ విషయాన్ని మార్గరెట్ నుంచి రహస్యంగా అట్టేపెట్టారు. అంటే అప్పటికి మార్గరెట్ కి మూడో సారో నాలుగో సారో ప్రేమ భగ్నమైందన్నమాట.

ఆమె ప్రావిడెన్స్ లో ఉద్యోగం వదిలిపెట్టేసి బోస్టన్ లో ప్రసంగాలు మొదలుపెట్టింది. ప్రసంగాలంటే తాను మాట్లాడటం కాదు. మాట్లాడించడం. Conversations పేరిట ఆమె మొదలుపెట్టిన ప్రయోగం గొప్ప సంచలనం సృష్టించింది. స్త్రీలను చైతన్యవంతుల్ని చెయ్యాలంటే వాళ్ళముందు ప్రసంగించడం కాదు, వాళ్ళతో మాట్లాడించడం అని ఆమె నమ్మి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. ఇప్పటి మన రచయితలూ, ఉద్యమకారులూ శ్రోతల్ని వెతుక్కుంటూ ఉంటే ఆమె రెండు శతాబ్దాల కిందట వక్తల్ని వెతుక్కుందనీ తాను ఎవరికోసం పనిచేస్తున్నదో వాళ్లతో మాట్లాడించడం ముఖ్యమని భావించిందనీ తెలియడం చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు.

ఆమెకి ఆర్థికంగా నిలదొక్కుకోడానికి అవకాశమిచ్చినట్టవుతుందని, ఎమర్సన్ Dial అనే పత్రిక ప్రారంభించి దానికి ఆమెని సంపాదకురాలిగా ఉండమని కోరాడు. 1840 నుంచి రెండేళ్ళపాటు ఆమె ఆ పత్రికని ఒంటిచేత్తో నిర్వహించింది. ఆ పత్రికలో ఆమె రాసే వ్యాసాలు, విమర్శ న్యూ ఇంగ్లాండ్ దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాయి. మరోవేపు తన తొలిప్రేమల గాయాలనుంచి ఎమర్సన్ స్నేహంలోనూ, సాంగత్యంలోనూ స్వస్థపడుతూ, నెమ్మదిగా ఆయనతో ప్రేమలో పడింది.

చిన్నప్పణ్ణుంచీ చదువులోనే గడిపినందువల్ల మార్గరెట్ కంటిచూపులో ఒక మెల్లలాంటి అస్తవ్యస్తత ఉండేది. అందుకని మాటిమాటికీ కళ్ళార్పి చూస్తుండేది. అలాగే మరీపసితనంలోనే గంటలతరబడి మెడ వంచి పుస్తకాలు చదువుకుంటూ గడిపినందువల్ల ఆమె వెన్ను ముందుకు వంగిపోయినట్టు ఉండేది. ఈ రెండు అవలక్షణాలతో పాటు ఆమె ధాటీగా మాట్లాడటం, ఎంతటివాళ్ళతో నైనా సరే వ్యంగ్యంగా మాట్లాడటం వల్ల ఆమెని మొదటిసారి చూసినప్పుడూ ఎవరూ ఇష్టపడేవారు కాదు. ఎమర్సన్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఆమెని మొదటిసారి చూసినప్పుడు ఆమె చాలా repelling గా ఉందనుకోడమే కాక ఈ పరిచయం ఇంతకన్నా ముందుకు పోయేదికాదని కూడా అనుకున్నాడట.

ఏళ్ళ తరువాత, ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించాక, ఎమర్సన్ మరికొంత మంది మిత్రులు కలిసి ఆమె స్మృతుల్ని పుస్తకరూపంలో వెలువరించారు. మూడు సంపుటాలు. అందులో ఆమె కంకార్డ్ జీవితం గురించి ఎమర్సన్ చాలా విపులంగా రాసాడు. ఆ స్మృతుల్లోంచి కొన్ని వాక్యాలు చూడు:

‘ఆమె కంకార్డ్ కి వచ్చేటప్పటికే ఆమె ప్రపంచం స్నేహితులతోనూ, సుసంపన్నజీవితానుభవాలతోనూ, సంస్కృతితోనూ పొంగిపొర్లుతూ ఉంది. ఆమె అప్పటికే ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్ సాహిత్యాలను మథించి ఉంది. లాటిన్లోనూ, కొంత గ్రీకులోనూ కూడా ప్రావీణ్యం సంపాదించి ఉంది. మోలియర్, రూసోలతో పాటు ఫ్రెంచి సాహిత్యం, చరిత్రలు, నవలలు విస్తృతంగా చదివి ఉంది. డాంటే, పెట్రార్క్ లను ఎంతో లోతుగా అధ్యయనం చేసి ఉంది. జర్మన్ సాహిత్యాన్నైతే ఆమెలాగా చదివినవాళ్లెవరూ లేరు. అయితే ఇంగ్లిషు సాహిత్యం మాత్రం పూర్తిగా చదివిఉండలేదు. షేక్ స్పియర్ నూ పూర్తిగా చదివిందని చెప్పలేను. అందువల్ల ఆమెకి ఛాసర్, బెన్ జాన్సన్, హెర్బర్ట్, చాప్ మన్, ఫోర్డ్, బూమంట్, ఫ్లెచర్, బేకన్, థామస్ బ్రౌన్ ల ను పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది. నేనామెకన్నా ఏడేళ్ళు పెద్దవాణ్ణి. అప్పటికే ప్రాచీన ఇంగ్లీషు సాహిత్యం బాగా చదివి ఉండటంతో అందులో ఆమెకి కొంత దారి చూపించగలిగాను. కాని తన అభిరుచి ప్రధానంగా దక్షిణ యూరపియన్ సాహిత్యాలపట్లనే లగ్నమై ఉండేదని ఆమె భావిస్తూ ఉండేది.’

‘ఆమె జీవితానుభవాలు విస్తృతమైనవి. ఆమె అప్పటికే డా.పార్క్ స్కూల్లో పండితురాలు. గణితంలోనూ, భాషల్లోనూ ప్రవీణురాలు. ఆ రోజుల్లోనే గతించిన ఆమె తండికి ఆమెని చూస్తే ఎంతో గర్వంగా ఉండేది. అతడు ఆమెను మనసారా ప్రోత్సహించాడు. ఆమె కేంబ్రిడ్జిలో ఉండగా ఎందరో ఉత్సాహవంతులైన యువతీయువకుల్ని ఆకర్షించింది. ఆమెను ఒక ‘అద్భుతం’ గా భావించే యువతుల బృందం ఒకటి ఆమెచుట్టూ ఉండేది. తనకి ఏ ప్రతిభావంతుడైన యువకుడు లేదా యువతి తారసపడ్డా కూడా ఆమె ఆకర్షణకు లోనుకాకుండా ఉండలేకపోయేవారు. వాళ్ళ ప్రేమలు, జీవితానురాగాలు ఒకర్తో ఒకరు రహస్యంగా పంచుకునేవారు, పెంపొందించుకునేవారు, ఎంతో ఇష్టంగా కలిసి మెలిసి జీవించేవారు.’

‘ఆ పరిచయాలూ, స్నేహాలూ ఎంత తొందరతొందరగా జరిగిపోయేవంటే, ఆమె ప్రేమతాలూకు ఉదయాల్నీ, మధ్యాహ్నాల్నీ, అస్తమయాల్నీ కూడా అప్పటికే ఎన్నోసార్లు అనుభవించేసింది…’

‘ఆమె నాకు పరిచయమయ్యేటప్పటికి ఈ స్నేహితుల్ని ఒక వజ్రాలహారంలాగా తన కంఠసీమలో అలంకరించుకుని కనబడింది. వాళ్ళు ఒకరికొకరు ఎంత సన్నిహితంగా ఉండేవారంటే, వాళ్ళందరికీ ఆమెనే ప్రతినిధిలాగా కనిపించేది. ఆమె ఒక్కతె తెలిస్తే చాలు వాళ్లందరితోనూ పరిచయం దొరికినట్టుగానే ఉండేది. వాళ్ళు ఆమెలో పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది, ఆమె కూడా అలానే ఉండేది. ఎప్పుడూ చాలా చురుగ్గా ఉండేది. ఆమె సాహచర్యం, ఆమెతో ఉత్తరప్రత్యుత్తరాలు నడపడం ఎంతో ఉత్తేజకరంగా ఉండేవి. ఆ రోజుల్లో మొత్తం కళలు, చింతన, న్యూ ఇంగ్లాండ్ కి సంబంధించిన ఉదాత్త సంస్కృతి అంతా కూడా ఆమెకి సంబంధించినవిగానే కనబడేవి. ప్రతి ఒక్కచోటూ ఆమెకి స్వాగతం పలుకుతుండేది. పట్టణాల్లోనూ, పల్లెటూళ్ళల్లోనూ కూడా స్నేహితుల బంధువుల గృహద్వారాలు ఆమెకోసం తెరిచి ఉండేవి. ఆమెకి ఆతిథ్యం ఇవ్వడంకోసం ప్రతి ఒక్కరూ ఇష్టంగా ఎదురుచూసేవారు. ఆమె వస్తోందంటే ఆ రోజు ఒక సెలవురోజులాగా ఉండేది. ఆమె ఉన్నచోట ఒక పండగలాగా ఉండేది. ఆమె ఒక్కొక్కసారి కొన్నిరోజులు, లేదా వారం, లేదా అప్పుడప్పుడు నెలరోజులపాటు ఉండిపోయేది. ఆమె ఉన్నంతకాలం మనం వాయిదా వెయ్యగలిగిన పనులన్నీ వాయిదా వేసుకోడం తప్ప మరో దారి ఉండేదికాదు. ఆమెతో కలిసి నడవడం లేదా స్వారీ లేదా పడవప్రయాణాలు ఏదో ఒక రూపంలో ఆమెతో కలిసి గడపడం కోసం తక్కిన పనులన్నీ పక్కన పెట్టేసేవాళ్ళం. సంతోషంతో తుళ్ళింతలాడే ఆ అతిథి తనతో పాటు కథలు, పిట్టకథలు, ప్రేమకథలు, విషాదకథలు, భవిష్యత్తు గురించిన జోస్యాలు ఎన్నెన్నో వెంటబెట్టుకొచ్చేది. సున్నితమైన, సంస్కారవంతమైన తన స్నేహాలతో ఆమె ప్రేమశాసనసభను పాలించే రాణిలాగా కనిపించేది. అందరి రహస్యాలూ ఆమె చేతుల్లోనే ఉన్నట్టుండేది. ప్రతి ఒక్కరూ తమ ప్రతి ఒక్క సమస్యనీ చిట్టచివరికి ఆమెకే నివేదించుకోవాలి అని ఎదురు చూశేవారు.’

ఇలా ఆయన పేజీలకు పేజీలు రాసుకుంటూ పోయేడు. అదంతా ఎలానూ తెలుగు చేయలేనుగానీ, ఒక్క మాట చెప్పు, అలాంటి మిత్రుడుగానీ, మిత్రురాలుగానీ మన జీవితాల్లో తారసపడితే బాగుణ్ణు అనిపిస్తోంది కదూ!

1-11-2023

10 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు -10”

 1. ఇట్లాంటి స్త్రీలు వచ్చి వెళుతూ ఉండబట్టి కదా ఈ లోకం ఇలా అయినా ఉన్నది. నేనూ ఆమెను వెదుక్కుంటూ ఉన్నాను ఆమెను నిన్నంతా. రేపటి ఉత్తరం కోసం అప్పుడే ఎదురు చూపులు మొదలు…

 2. ఆ ఎండుటాకులు, పువ్వులు (paintings lo) చాలా బాగున్నాయి.

  “కాంతిపోగుల్తో వస్త్రం నేసుకున్నట్టుగా”, “బామ్మగారి చేతులు నేర్పుగా చుట్టిన వత్తుల్లా”,
  మీ ఉత్తరాల్లోని వాక్యాల్లో
  మార్గరెట్ ఫుల్లర్ పరిచయం, మీరన్నట్లుగానే జలపాతంలో తడిసినట్లులా వుంది.
  🙏🏽

 3. గతజన్మలోని అద్భుత సాధనకి తదుపరి జన్మలో
  కొనసాగింపు వుంటుందంటారు.
  మార్గరెట్ అటువంటి అపూర్వ వ్యక్తి అనిపిస్తోంది సర్.

 4. భూర్లోక భువర్లోక అన్నట్టు సాహిత్యలోకం చూపిస్తున్నారు.

Leave a Reply

%d