
31-10-2023, తెల్లవారు జాము 3.24
ప్రియమైన
నగరం నిద్రపోతూ, దేవతలు మాత్రమే మేల్కొని ఉండే ఈ వేళల్లో నీతో మాట్లాడటానికి కూచున్నప్పుడు, అడవుల్లో, కొండవాగుల్లో అల్లుకునే తేటదనంలాంటిదేదో మనసులో అల్లుకుంటుంది. ‘ఆయన చదువుకుంటున్నంతసేపూ ఒక దేవదూత ఆ గుమ్మం బయట వేచి ఉండేవాడు’ అని తలుచుకున్నాడు ఒక మిత్రుడు ఎమర్సన్ గురించి. నేను అంత మాట చెప్పలేనుగానీ, ఈ వేళల్లో ఒక దేవదూత పైన పారిజాతం మొక్క దగ్గర కునికిపాట్లు పడుతూ ఉంటాడని మాత్రం తెలుసు. నేను నీకు ఉత్తరం రాయడం మొదలుపెట్టగానే ఆయన లేచి కళ్ళునులుముకుంటూ ‘టైమెంతయింది?’ అనడుగుతాడు. వీథుల్లో మనుషుల అలికిడి మొదలయ్యేలోపే ఈ ఉత్తరం పూర్తి చేయాలి. అప్పటిదాకా మటుకే ఆయన ఆ మొక్కనీడన కూచుని ఉంటాడు.
ఎలా మొదలుపెట్టను? ఎక్కడ మొదలుపెట్టను? తన జీవితకాలంలో ఏ దశలోనైనా కనీసం వందమంది మిత్రులుండేవారట, మార్గరెట్ ఫుల్లర్ కి ఉత్తరాలు రాయడానికి. సన్నిహితులు, తన హృదయాన్ని విప్పి పరుచుకోడానికి. వారంలో ఒకరోజంతా ఆ ఉత్తరాలు రాయడానికే కూచునేదట. ఆమె ఆరోగ్యం సహకరించేదికాదు. గంటసేపు పనిచేస్తే రోజంతా మళ్లా మంచం మీద మేనువాల్చక తప్పేది కాదు. దానికి తోడు భరించలేని తలనొప్పులు, చలంగారికి మల్లే. అయినా రాస్తూనే ఉంది ఉత్తరాలు. ఆరు సంపుటాల ఉత్తరాలు. దాదాపు రెండువేల పేజీల అంతరంగ కథనం, మథనం.
ఆశ్చర్యంగా ఉంది, కానీ సంతోషంగా కూడా ఉంది. నాకన్నా నూటయాభై ఏళ్ళు ముందు పుట్టిన ఒక భావుకురాలి గురించి, ఆమె రాసిన ఉత్తరాల గురించి దాదాపు రెండుశతాబ్దాల తర్వాత నీలాంటి భావుకురాలితో ముచ్చటించుకోవడం.
పందొమ్మిదో శతాబ్ది అమెరికాని వెలిగించిన ఇద్దరు స్త్రీమూర్తుల్లో ఒకరు ఎమిలీ, రెండోవారు ఫుల్లర్ మాత్రమే అని రాసారు చరిత్రకారులు. ఆమె అమెరికాలో మొదటి ఫెమినిస్టు. Woman in the Nineteenth Century (1843) అనే groundbreaking పుస్తకం రాసిన రచయిత్రి. ఎమర్సన్ ప్రారంభించిన Dial అనే పత్రికకి సంపాదకత్వం వహించిడంతో మొదటి మహిళా సంపాదకురాలు కూడా. ఇలాంటివి ఆమె సామాజిక, సాహిత్య రంగాల్లో చేసిన మొదటిపనులు చాలాఉన్నాయి. గొప్ప పనులు మరెన్నో ఉన్నాయి. కానీ ఈ ఉత్తరాల్లో నేను రాద్దామనుకుంటున్నది వాటి గురించి కాదు.
చలం గారు తన ‘స్త్రీ’ (1930) కి రాసుకున్న ముందుమాటలో ‘స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకి మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకి హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి…’ అని రాసిన వాక్యాలు అందరం చదివినవే. చదవగానే నిజమే కదా అని అనిపించే వాక్యాలే. ఆయన ఆ వాక్యాలు రాయడానికి సరిగ్గా వందేళ్ళ ముందు ఫుల్లర్ తన శరీతం, మెదడు, హృదయాలన్నిటి పరిపూర్ణ వికాసంతో తన fullness of being ని ఎలా సాధ్యం చేసుకోవడమా అన్నదే ధ్యేయంగా జీవించింది.
అయితే, ఆ జీవితం గురించి తెలుసుకునేకొద్దీ, ఆమె ఉత్తరాలు చదివే కొద్దీ నాకు రెండు భావాలు కలుగుతూ ఉన్నాయి.
మొదటిది, చలం గారు దాదాపు వందేళ్ళ కిందట రాసిన ఈ వాక్యాలు, స్త్రీలకు సరే, మగవాళ్ళకి మాత్రం ఏ మేరకు ఆచరణసాధ్యమయ్యాయి అని. ఎంతమంది మగవాళ్ళు తమ దేహాల్నీ, బుద్ధినీ, హృదయాన్నీ వికసింపచేసుకోడం మీదనే నిజంగా దృష్టిపెడుతున్నారు? నా చిన్నప్పటి సంగతేమోగానీ, నా సమకాలిక ప్రపంచంలో మాత్రం, తమకి జీవితం ప్రసాదించిన ఈ వరాల్ని, అంటే మనసునీ, శరీరాన్నీ, తెలివితేటల్నీ పూర్తిగా వినియోగించుకునే మగవాళ్ళు దాదాపుగా కనిపించడం లేదనే చెప్పాలి. ఆ మధ్య నవీన్ నూనె తన వాల్ మీద ఒక మాట రాసాడు. ఈరోజు అమెరికాలో తమ ఇళ్ళల్లో ఎలక్ట్రానిక్ సౌకర్యాలవల్ల గాని, ఇతర సాంకేతిక సాధనాల ద్వారాగాని లభిస్తున్న సదుపాయాల్ని ఒకవేళ మనుషులే అందించవలసి ఉంటే, కనీసం ఇరవైమంది బానిసలు అవసరమయి ఉండేవారని. సాంకేతికత వల్ల, ఒక్కొక్క ఇల్లూ కనీసం ఇరవై మంది మనుషుల్ని బానిసలుగా మార్చే దురాగతం నుంచి తప్పించుకోగలిగాం. కాని లభిస్తున్న ఆ సౌకర్యాలతో, ఆ తీరికతో మనమేం చేస్తున్నాం? రీల్స్ చూడటం తప్ప అని అడిగాడు నవీన్. ఆ మాట చదవగానే నాకు కడుపులో తిప్పినంత పనయ్యింది. అవును కదా, ఈ సాంకేతికత, మన జీవితాల్ని మరింత వెలిగించగల, మరింత సార్థకం చెయ్యగల సాంకేతికత వచ్చిన తరువాత, మనం మనకి ఒక శరీరం ఉందనీ, దానికి వ్యాయామం ఇవ్వాలనీ, మనకొక మెదడు ఉందనీ, దానికి జ్ఞానం ఇవ్వాలనీ, మనకీ హృదయం ఉందనీ, దానికి అనుభవం ఇవ్వాలనీ పూర్తిగా మర్చిపోయేం కద!
కానీ ఫుల్లర్ ని చదువుతుంటే నాకు కలిగిన ప్రశ్న: నిజంగానే ఎవరేనా, స్త్రీయే గానీ, మగవాళ్లేగానీ, తమ శరీరాన్నీ, మనసునీ, బుద్ధినీ పూర్తి వికాసం వైపుగా నడిపించడం మొదలుపెడితే, ఈ ప్రపంచం, ఈ సమాజం ఆమెకి లేదా అతడికి ఎంత వరకూ సానుకూలం? అసలు అటువంటి జీవశక్తిని చుట్టూమనుషులు భరించగలరా? తోటలో నిండుగా పూలుపూసే మొక్కచుట్టూ కంచెకట్టి కాపాడుకున్నట్టుగా అటువంటి జీవవికాసం వర్ధిల్లే మనుషుల్ని తమ చేతులడ్డుపెట్టి కాపుకాచుకోగలరా?
తాను దర్శిస్తున్న ‘అమెరికన్ స్కాలర్’ ఎలా ఉంటాడో వివరిస్తో ఎమర్సన్ చెప్పిన ఈ మాటలు రెండుశతాబ్దాలుగా ప్రపంచమంతా వినబడుతూనే ఉన్నాయి. ఆయనిలా అంటున్నాడు:
‘..and that you must take the whole society to find the whole man. Man is not a farmer, a professor or an engineer, but he is all. Man is priest, and scholar , and statesman, and producer, and soldier.
ఒక మనిషి నిజమైన మనిషి కావాలంటే ఇవన్నీ కలిసిన ఒక పరిపూర్ణమానవుడు కావాలని ఆయన కోరుకున్నాడు. అటువంటి స్థితికోసం తపించే మనిషిని ఆయన ManThinking అన్నాడు. Scholar అంటే అతడు. The scholar is that man who must take up into himself all the ability of the time, all the contributions of the past, all the hopes of the future అని కూడా అన్నాడు.
సరిగ్గా ఆ రోజుల్లోనే ఫుల్లర్ కూడ ఒక ఉత్తరంలో ఇలా రాసింది: From a very early age I have felt that I was not born to the common womanly lot. ఈ మొత్తం పేరాని తెలుగులో రాస్తున్నాను, చూడు:
‘మామూలు ఆడవాళ్ళలాగా బతకడం నా ధ్యేయంకాదని మరీ చిన్నప్పణ్ణుంచే నాకనిపించేది. నా అంతరాత్మను గుర్తుపట్టగల మనిషి ఎవరూ నాకు ఎప్పటికీ కనబడరని కూడా నాకు తెలుసు. నిశ్చింతగా వాళ్ళమీద నా భారం పెట్టగలిగేవాళ్ళు, సదా వాళ్ళనుంచి నేను నేర్చుకోగలిగేవాళ్లు దొరకరని తెలుసు. నేను ఎప్పటికీ ఈ భూమ్మీద ఒక బాటసారిగానే, ఒక యాత్రికురాలుగానే జీవించవలసి ఉంటుందని కూడా తెలుసు. చివరికీ పశుపక్ష్యాదులకి కూడ తలదాచుకోడానికి ఒక చోటంటూ ఉంటుంది, నాకు తప్ప. కానీ నా లాంటి వాళ్ళకి తలదాచుకోడానికి కావలసింది హృదయాలు. ఇలాంటి ఆలోచనవల్ల నాకు కొన్నిసార్లు బాధగా ఉండేది, కొన్నిసార్లు గర్వంగా ఉండేది. నాకు జీవితం తాలూకు పూర్తి అనుభవం ఎప్పటికీ సంప్రాప్తం కాదేమో, నా అస్తిత్వంలో అంతర్లీనంగా ఉన్న సుసంపన్నతని నేనెప్పటికీ అనుభవానికి తెచ్చుకోలేనేమో అని బాధ. కాని నన్ను నేను కఠినాతికఠిన మార్గంలో నడిపించుకోగలననీ, ఎప్పటికైనా నన్ను నేను చేరుకోగలననీ, నేనే నా పూజారినీ, శిష్యురాలినీ, తల్లినీ, శిశువునీ, భర్తనీ, భార్యనీ కాగలననీ ఒక గర్వం. చాలామందికి సోదరిని కాగలిగాను-మరెందరికో సోదరుణ్ణి కాగలిగాను- ఇంక ఎంతమందికి పరిచర్యచేసే నర్సు కాగలిగానో చెప్పలేను… ఈ విశ్వమనే మహాకావ్యాన్ని చదివి అర్థం చేసుకోడానికే ప్రతి ఒక్కరూ నాకు సహాయపడ్డారని చెప్పగలను.’
ఈ వాక్యాలు నాకు ఆమె పట్ల ఎంత గౌరవం కలిగించాయో నా పట్ల నాకు అంత సిగ్గు కూడా కలిగించాయి. నిజంగా ఎప్పుడో చిన్నప్పుడు తప్ప మళ్లా ఎప్పుడేనా నేనిట్లా తపించేనా? నా సర్వశక్తులూ వికసించే తావులకోసం కలగన్నానా?
సారా మార్గరెట్ ఫుల్లర్ తన నలభయ్యేళ్ళూ అలా జీవించిందని చెప్పడానికి ఆమె జీవితంలో ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్కరోజు, ప్రతి ఒక్క ఏడాది సాక్ష్యమిస్తాయి. లేకపోతే, శారీరికంగా అర్భకురాలు, ఆర్థికంగా నిరుపేద, రాజకీయంగా అనామకురాలు- కాని ఒక ఎమర్సన్ ని, ఒక థోరోని, ఒక హాథార్న్ నీ, ఒక కార్లైల్ నీ, ఒక మాజినీని ప్రభావితం చెయ్యగల్గిందంటే ఎలా సాధ్యపడుతుంది?
కానీ, ఆమెని నిజంగా ప్రపంచం స్వీకరించగలిగిందా? ఆమెకు ఇవ్వవలసిన భద్రత, సంతోషం, మానసిక శాంతి ఇవ్వగలిగిందా? ఆమె జీవశక్తిని చూసి ఆమె చుట్టూ ఉన్న మనుషులు బెదిరిపోకపోయి ఉంటే, ఆమె అంత చిన్నవయసులో అంత దుర్మరణం పాలై ఉండేదా?
‘Those who seem overladen with electricity frighten those around them’ అని రాసిందామె ఒక ఉత్తరంలో. కాని గమనించవలసిందేమంటే, ఎమర్సన్ ManThinking గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె WomanThinking గురించి మాట్లాడింది, మాట్లాడటమే కాదు, అలా జీవించడం మొదలుపెట్టింది. ఎప్పుడు? ఇంకా కళాశాలలు, ఇంకా యూనివెర్సిటీలు స్త్రీలకి తమ తలుపులు తెరవని రోజుల్లో. చదువుకోడం అలా ఉంచు, కనీసం లైబ్రరీల్లోకి కూడా స్త్రీలని అడుగుపెట్టనివ్వని కాలం అది.
ఆ రోజుల్లో చదువుకున్నా, చదువుకోకపోయినా ఆడవాళ్ళకి ఒకటే డెస్టినీ. పెళ్ళి. చదువుకుంటే దొరికే ఏకైక వృత్తి టీచరుగా పనిచెయ్యడం. ఈ పరిమితప్రపంచం మీద ఆమె చేసిన పోరాటం నేను ప్రపంచ చరిత్రలో చదివిన గొప్ప పోరాటాలకి ఏ మాత్రం తీసిపోనిదని చెప్పగలను.
కానీ ఈ పోరాటాలూ, ఈ ప్రయత్నాలూ వీటివెనక ఆమె హృదయం ఒక చిన్నపిల్లలాగా ఒక ఓదార్పుకోసం, తాను ఆనుకోడానికి ఒక భుజం కోసం ఎంతలా అల్లాడిందో, అది, నన్ను పదే పదే నిలిపేస్తున్నది. మనుషులు తమ విమోచనకోసం పోరాడే యోధులూ, వీరులూ, మహాత్ములూ అతీతశక్తులు కలిగినవాళ్ళూ, దైవసమానులూ అని అనుకుంటారుగానీ, వాళ్ళూ తమలాంటి మనుషులే, ఒక్కొక్కప్పుడు తమకన్నా దుర్బలమైన మనుషులు అని మర్చిపోతారు. వాళ్ల జీవితాల్లోని అత్యంత కీలకక్షణాల్లో ఆ ప్రాణవాయువు వారికి అందకుండా స్తోత్రపాఠాల్తోనో లేదా శాపనార్థాలతోనో చుట్టూ మూగిపోతారు.
నీకు తెలుసా? 1948 జనవరి 30 ముందు రాత్రి మహాత్ముడు మనూగాంధి ఒళ్ళో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడని? ‘నేను మహాత్ముణ్ణేనా?’ అని అడిగాడట ఆ పిల్లని. ఆయన తన జీవితం మొత్తంలో తనని తాను మహాత్ముడిగా సంబోధించుకున్న ఏకైక క్షణం అది. అది ఆయన తాను మహాత్ముడు అవునో కాదో తెలుసుకోడానికి కాదు, ఆ క్షణాన, దేశం రెండుగా చీలి, మనుషులు ఒకరినొకరు నరుక్కుంటున్నవేళ, ఇరు దేశాల నాయకులూ కొత్తగా లభించిన అధికారంలోకి అత్యవసరంగా కుదురుకుంటున్నవేళ, తనకి కనీసం ఒక్క చిన్న మాట, ఒక్క ఓదార్పు, ఒక్కింత నమ్మకం ఇచ్చే ఏ మనిషీ కనిపించని అంధకారంలో ఆ చిన్నపిల్ల ఎదట విహ్వలుడై అడిగిన మాట అది.
కానీ ఫుల్లర్ జీవితం గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఆమె జ్ఞాపకాలూ, ఉత్తరాలూ చదువుతున్నప్పుడు, ఈ ప్రశ్నలైతే కలుగుతాయిగాని, నిరాశ కలగదు. మనిషి, స్త్రీగానీ, పురుషుడుగానీ, తన సకల జీవశక్తులూ వికసించాలని కోరుకున్నప్పుడు, ఆ కఠినాతికఠినమైన మార్గం మీద ప్రయాణం మొదలుపెట్టినప్పుడు, ప్రపంచం ఆమె చేతుల్లో చేయి కలిపి నడవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. అడుగడుగునా ఒక నిరాశ, నిస్పృహ నిన్ను వెంటాడుతూనే ఉండవచ్చు. కానీ అది కూడా ఒకలాంటి martyrdom అనే ఫుల్లర్ భావించింది. నీ ఇంద్రియాలూ, చైతన్యమూ, అనుభూతీ మేల్కొంటున్నాయని తెలిసాక, నీ engaged thought నువ్వు కొనసాగించవలసిందే, ఆపడానికి నీకు నైతికమైన హక్కులేదు. నీతో కలిసి నడవగలిగినవాళ్ళు నడవగలిగినంత దూరం నడుస్తారు. వాళ్ళు ఆగిపోవచ్చు, కానీ కాలాంతరంలో మరెవరో మరెక్కడో నిన్ను చూసి తమ ప్రయాణానికి ధైర్యం తెచ్చుకుంటారు.
జీవితంలో అన్ని రకాల ఉత్పత్తులూ ఉన్నట్టే, అర్థాన్ని ఉత్పత్తి చేసే కార్యకలాపం కూడా ఒకటి నడుస్తూ ఉంటుంది. Production of meaning for life. ప్రతి మనిషి ముందూ జీవితం రెండు దారులు పెడుతుంది. నువ్వు producer గా ఉంటావా? consumer గా ఉంటావా అని. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం, మరీ ముఖ్యంగా భారతీయ సమాజం consumer గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతోంది. ప్రతి వస్తువుకీ కొత్తమోడళ్ళు, యూట్యూబ్ లో కొత్త పాటలు, సోషల్ మీడియాలో కొత్త రీళ్ళు, ఓటిటిలో కొత్త సీరియళ్ళు- కన్సూమరులుగా మన దాహానికి అంతులేదు. ఈ రోజు ప్రపంచంలో భారతదేశానికి ఉన్న విలువ కొనుగోలుదారుకి ఉండేవిలువ మాత్రమే.
కాని నిజానికి మనం చెయ్యవలసిన పని జీవితానికి అర్థం కనుగొనడం కదా. ‘నేను మార్గరెట్ ఫుల్లర్ ని అంటే ఎవరు?’ అని ఆమె తనని తాను పదే పదే ప్రశ్నించుకుంది. ఇదే కదా, మనం ప్రతి ఒక్కరం చేయవలసింది: మన మన జీవితాలకి అర్థం వెతకడం. కానీ అర్థం వెతుక్కోవటం ఎవరికి వారు వారి ఒక్క జీవితం తోటే చేయగలిగే పని కాదు. ఎవరైనా తమ జీవితానికి అర్థం చెప్పుకోవాలంటే తమని ప్రేమించే వాళ్ళో, ద్వేషించేవాళ్లో తప్పనిసరి.
చిట్టితల్లీ, ఒక మనిషి ఒక మనిషిని నిజంగా ప్రేమిస్తే, ఇవ్వవలసిన నిజమైన కానుక, ఈ కాగడా తప్ప మరేమీ కాదు. తాను ఆమెని ప్రభావితం చెయ్యడం కాదు, ఆమెనే తనని ప్రభావితం చేసిందని గుర్తుపట్టాడు కాబట్టే ఎమర్సన్ ఆమెని the queen of the parliament of love అన్నాడు.
31-10-2023
పసితనం మాత్రమే ఇవ్వగలిగిన ఆశ, నమ్మకం, తపనలను ఈ ఉత్తరం అక్షరాల్లో చుట్టు చుట్టి తెచ్చినట్టుంది. ఎక్కడ ధారపోస్తున్నాం శక్తుల్ని? అనుకుంటే క్షణంలోనే ఒళ్ళు జలదరించినట్లయ్యింది. అన్ని శక్తులు పరిపూర్ణంగా వికసించాలనే ఆ యవ్వన దినాల తపనలన్నీ ఎటు పోయాయోనన్న ప్రశ్న ఒకటి ఉత్తరం మధ్యలోనే మొదలై ఎటో తిప్పి తీసుకు వచ్చింది. జీవితం పట్ల తృప్తి ఉండే కాలం మంచిది. కానీ దురాశ ఉండే కాలం విలువైనది. అన్నీ కావాలని, వాటికోసం ఏమైనా చెయ్యాలని…
ప్రేమించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు తప్పనిసరా ? వాళ్ళు ఎట్లాంటి ఆసరా…రేపటి మన సంభాషణ మొదలయ్యే దాకా నన్ను occupied గా ఉంచే వాక్యాలు రాశారు.
ఇంకో మాట…మీ ఇంటి చుట్టుకొలత కావాలి. మేం కంచె కట్టుకోవాలి ❤️❤️☺️
ధన్యవాదాలు మానసా!
జీవితానికి అర్థం ,పరమార్థం ఇలాంటి లోతైన విషయాలపై దృష్టిని కేంద్రీకరించి నప్పుడు మాత్రమే లభిస్తుంది.
శుభోదయం sir.🙏🙏🙏
ధన్యవాదాలు మాస్టారూ
మనుషులు మనీషుల్లా మారడానికి ఒక ఆశ, ఒక కాగడా కావాలి…తమను తాము తెలుసుకోడానికి మీలాంటి ఒక టార్చ్ బేరర్ కూడా కావాలి ఈ కాలానికి sir…నమస్సులు
ధన్యవాదాలు సార్
నేనెవరిని అని మనసును
పదేపదే ప్రశ్నిస్తే
జీవితానికర్థం వెదకుట
మనపని యోచిస్తే
విసుగు కలుగకుండ
కొత్త కాగడాలు సృష్టిస్తూ
నిరంతరం పాఠకులకు
కొత్త వెలుగు ప్రసరిస్తూ
నాటి ఋషులు చేసిన పని
నేటి ఋషిగ చేయడం
తిమిర మనస్సీమలలో
విపులకాంతి నింపడం
ఉత్తరాల వెరగున లో
కోత్తరమగు విజ్ఞానం
అమరకవులు అందించిన
అనుభవాల సారాంశం
పూజలేల నోములేల
పుణ్యతీర్థయాత్రలేల
మనిషితనం జాడతెలుపు
రచన చాలు చారుహేల
🙏
ధన్యవాదాలు, పరి పరి వందనాలు