
29-10-2023 సాయంకాలం నాలుగింటికి
ప్రియమైన
ఈ రోజు పొద్దున్నే మేడమీదకి వెళ్ళినప్పుడు కొన్ని పారిజాతాలు రాలి ఉన్నాయి, కొన్ని ఇంకా కొమ్మల్ని అంటిపెట్టుకునే ఉన్నాయి, కొన్ని ఆకులగుబుర్లలో ఇరుక్కుని ఉన్నాయి. వెన్నెల వాటి చుబుకాన్ని రాత్రి ముద్దాడిన నునుస్పర్శ ఇంకా వీడిపోలేదు.
ఒక గాజుగిన్నెలో వాటిని ఏరుకుంటూ ఉంటే-
పూజాశిరీషము లేరుకుంటిని,
పోయి వచ్చెద జవ్వనీ
తేజోవిలీన దృగంచలమ్ముల
తేరిచూచెద వెవ్వనీ
అని మనసు పాడుకోవడం మొదలుపెట్టింది. ముందు నాలోనాకే ఒక చిరునవ్వు కలిగింది. కాని ఆ తర్వాత రోజంతా అదే ఆలోచిస్తున్నాను. ఎందరు కవులు లేరు నా సమకాలికుల్లో? ఎన్ని గీతాల్లేవు? ఎందుకని ఎప్పటిదో ఈ భావగీతమే ఈ పారిజాత ప్రసూనాలంత తాజాగా నా మనసులో కెరలాడుతున్నది?
నేను ఈ కాలానికి చెందినవాడిని కానని నాకు చాలాసార్లు తోచిందిగానీ, మరీ ఇంత వెనకటి పాటలకొమ్మల్లోనే నా హృదయం ఇరుక్కుపోయిందనుకోలేదు.
అదే ఆలోచిస్తున్నాను. నా తరం, అంటే నాది 1950-80 తరం, అనుకుంటే, నా చిన్నప్పటి రోజులు గడిచిపోయేక, నా తరం వాళ్ళెవరివైపూ నేను స్ఫూర్తికోసం చూడనేలేదని అనిపిస్తూ ఉన్నది. ఇది బహుశా నా తాడికొండ రోజుల్లోనే మొదలైనట్టుంది. ఆ రోజుల్లో నేను నా తరగతిపిల్లల్తో కలిసి తిరిగేవాణ్ణి కాదు, వాళ్లతో కలిసి ఆడుకోవాలని చూసేవాణ్ణి కాను. ఎంతసేపూ నా ఉపాధ్యాయులు, మా ఆర్ట్ మాష్టారు వారణాసి రామ్మూర్తిగారు, మా హీరాలాల్ మాష్టారు, మా తెలుగు మాష్టారు రాళ్ళబండి కృష్ణమూర్తిగారు, మా వెంకటరత్నంగారు- వీళ్లచుట్టూతానే తిరుగుతూ ఉండేవాణ్ణి.
పెద్దయ్యేకొద్దీ నేను నా ముందుతరం గురువులకీ, సాహిత్యకారులకీ ఎక్కువ చేరువగా జరిగాను. నా ముందు తరం అంటే, 1920-50 తరం. నా తండ్రి తరం. శరభయ్యగారూ, సుదర్శనంగారూ, జగన్నాథరావుగారూ, కృష్ణారావుగారూ, ఇటీవల రాధాకృష్ణమూర్తిగారూ, సోమయ్య గార్లదాకా, వీళ్ళే నా బాల్యమిత్రులు. నా intellectual companions. ఈ సహృదయులకే నేను ప్రేమలేఖలు రాసుకున్నది. కవుల్లో బైరాగి, శేషేంద్ర, అజంతా, త్రిపుర, మోహన ప్రసాద్, మునిపల్లె రాజు గారు, వీళ్ళే నా సాహిత్యకాశాన్ని వెలిగించిన తారలు. నాతో తెలుగు అక్షరాలు పలకమీద మొట్టమొదట ఎవరు దిద్దించారో తెలియదుగానీ, ఈ గురుమిత్రుల సన్నిధినే నేను తెలుగు అక్షరాల్ని ఒద్దిగ్గా దిద్దుకున్నాను. ఈ తరం చాలా చిత్రమైన తరం. నా తండ్రిని వాళ్లందరికీ ప్రతినిధి అనుకుంటే, ఆ తరం ఒక వారధి తరం. వాళ్ళే నా పూర్వయుగాల మహామానవుల్ని నా హృదయానికి ముడివేసినవాళ్ళు. వాళ్ళకి ఎంత చేరువ అవుతూ ఉంటే, అంతగా వాళ్ళ ముందుతరాల పట్ల నా ఆసక్తీ, వాళ్ళ రచనలపట్ల దాహమూ పెరుగుతూ వచ్చాయి.
వాళ్ళముందు తరం అంటే 1890-1920 తరం, మా తాతగారి తరం. నిజమైన సాహిత్యప్రేమికులు వాళ్లు, భావుకులు, జీవితమంతా మధువిద్యని సాధనచేసినవాళ్ళు. చలంగారు, కృష్ణశాస్త్రి, శ్రీ శ్రీ, బాపిరాజు, విశ్వనాథ, నండూరి, బసవరాజు- ఒక మహాయుగం ముగిసిపోయి మరొక మహాయుగం మొదలవుతున్న కాలంలో కళ్లు తెరిచినవాళ్ళు. నవోదయాన్ని కళ్లారా చూసినవాళ్ళు, నాకు చూపించినవాళ్ళు. వాళ్ళే లేకపోతే, వాళ్ల సాహిత్యమే చదివిఉండకపోతే, నాకు జీవితాన్నెట్లా ప్రేమించాలో తెలిసి ఉండేదే కాదు. ఆ తరం రచయితల్లో నేను శ్రీశ్రీని కళ్ళారా చూశాను కానీ సంజీవ్ దేవ్ గారితో నా బాల్యంలోనే ఉత్తరప్రత్యుత్తరాలు నడిపే భాగ్యం దక్కిన వాణ్ణి.
కాని ఒకింత లోతుగా పర్యావలోకనం చేసుకుంటే, నన్ను నిజంగా ఉత్తేజితుల్ని చేసింది వాళ్ల తరం కూడా కాదు, వాళ్ల కన్నా ముందు తరం. అంటే మా ముత్తాత గారి తరం అన్నమాట. 1860-90 తరం. ఏమి తరం అది! గురజాడ, టాగోర్ ల తరం. గిడుగు రామ్మూర్తి, వివేకానందుల తరం. సరోజినీ, సుబ్రహ్మణ్యభారతిల తరం. హరిసర్వోత్తమరావు, అరవిందుల తరం. ఒక్కమాటలో చెప్పాలంటే గాంధీ తరం. ఆ తరం కదా భారతదేశాన్ని నిజంగా మేల్కొల్పిన తరం.
నా కన్నా మూడు తరాల ముందటి వాళ్లు. కాని వాళ్ళ రచనలు ఏవి చేతుల్లోకి తీసుకున్నా, విద్యుత్ ప్రవహిస్తున్నట్టు ఉంటుంది. ఆకాశం ఎంత మబ్బుపట్టి ఉన్నా, బంగారు రంగు సూర్యకాంతి నా చుట్టూ పరుచుకున్నట్టు ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంటుంది. నా బుద్ధికి నా ముందుతరం కవిమిత్రులు పదునుపెడితే,నా హృదయాన్ని 1890-20 తరమూ, నా ఆత్మని 1860-90 తరమూ పూరిగా కైవసం చేసుకున్నారనిపిస్తుంది.
వాళ్లకన్నా ఇంకొక్క తరం ముందుకు వెళ్తే, అంటే 1830-50 తరానికి వెళ్తే, అది రామకృష్ణపరమహంస, నారాయణగురుల తరం. బంకింబాబు, వీరేశలింగాల తరం. నిజమైన దీపధారుల తరం. ఇప్పుడు ఇంకా ముందుకి వెళ్ళాలని ఉంది. 1800-30 తరానికి. అది జోతిబా ఫూలే, విద్యాసాగర్ ల తరం. అంతకన్నా మరొక తరం ముందుకి వెళ్తే, 1770-1800 నాటికి? అప్పుడది రాజారామ్మోహన రాయ్, త్యాగరాజస్వామిల తరం అవుతుంది.
నా అవస్థ ఏమి చెప్పను మిత్రమా! ఒక్కొక్క తరం ఇట్లా వెనక్కి వెళ్ళాలని ఉంటుంది. వాళ్లు రాసిన ప్రతి ఒక్క వాక్యం చదువుకోవాలని ఉంటుంది. వాళ్లతో సంభాషించాలని ఉంటుంది. మా మాష్టార్ని కలుసుకున్నప్పుడు, ఒక్కొక్కప్పుడు, ఆయన ‘ నాకు masters తో తప్ప మరెవరితోనూ మాట్లాడాలని లేదయ్యా ‘ అనేవారు. ఆయన masters అంటే ఎన్ని తరాలకిందటివాళ్ళో! ఎన్ని యుగాల కిందటివాళ్ళో! ప్రపంచం తనని పెడుతున్న ఏ విసుగునుంచో, వేసటనుంచో తప్పించుకోడానికి ఆయనలా అంటున్నారని అనుకునేవాణ్ణిగాని, ఇప్పుడు తెలుస్తోంది. నీ హృదయం జ్వలిస్తూ ఉండాలంటే, నువ్వు సదా ఉన్నతశిఖరసీమలమీదనే విహరిస్తూ ఉండాలంటే, రెండే మార్గాలు- అయితే, ప్రజలమధ్యకు వెళ్ళు, వాళ్ళే ప్రపంచంగా బతుకు, లేదా, mastersని అన్వేషించు, వాళ్ళ సన్నిధిలో అధ్యయనం మొదలుపెట్టు.
నిజానికి రెండు మార్గాలన్నానుగానీ, ఒకటే మార్గం, ప్రకృతి ఎదటనో లేదా పుస్తకాలమధ్యనో గడపడం. నువ్వు ప్రజలకోసం ఎంతగా పనిచెయ్యవలసి వస్తే, అంతగా నీ జీవజలాల్ని పునః పునః నింపుకోడం కోసం మళ్ళా మళ్ళా masters ని ఆశ్రయిస్తూ ఉండాల్సిందే.
Masters ని చదువుతున్నప్పుడు మనకి కలిగేది కేవలం సాహిత్యసంతోషం కాదు. వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న చీకటిలో, వాళ్లని నిరంతరం లొంగదీయాలని చూసే ప్రతికూలశక్తుల ఎదట, తమ జీవితాల్ని ఎట్లా define చేసుకున్నారో, అది, ఆ పాఠం అది మనకి గొప్ప స్ఫూర్తి. బహుశా నా తరంలో, నా సమకాలికుల్లో కూడా చాలామంది అట్లానే తమ జీవితాలకొక అర్థాన్ని వెతుక్కుంటూ ఉండవచ్చు, కాని దాన్ని నేను స్పష్టంగా చూడలేను. ఏ కలాం వంటివాడో తప్ప తక్కినవారెవరకీ జీవితం మీద తాము సాధించిన అధికారాన్ని తమ సమకాలికులకి అంత స్పష్టంగా చెప్పుకునే అవకాశం దొరకదు.
మరో ఆసక్తికరమైన సంగతేమిటంటే, ఒక్కొక్క తరం వెనక్కి వెళ్ళేకొద్దీ ఆ వెలుగు సన్నగిల్లకపోగా, మరింత ప్రభావంతంగా కనబడుతూ ఉంటుంది. ఎమిలీ డికిన్ సన్ ని చూసాం కదా. ఆమెది 1830-60 తరం. కాని ఆ ఉత్తరాలు చూసేవుకదా, ఎంత సన్నిహితంగా ఉన్నాయి. నా సమకాలికుల్లో ఏ ఒక్కరి రచనల్లో, ఏ ఒక్క వాక్యం కూడా ఆ ఉత్తరాలు కనిపించినంత సన్నిహితంగా నాకు కనిపించలేదు. అలాగని నేను నా సమకాలికుల్ని తక్కువచేస్తున్నాను అనుకోవద్దు. ఈనాడు వీరు చూడ్డానికి ప్రయత్నిస్తున్న వెలుగు బహుశా తరువాత తరాలవారికి బాగా కనబడవచ్చు.
ఎమిలీని చదువుతున్నప్పుడు నాకు అర్థమయినమరోవిషయమేమంటే, ఆమె తన పూర్వతరాల masters తోటే జీవితమంతా గడపడం. షేక్ స్పియర్ పరిచయమయ్యాక మరొక రచయిత అవసరమా మనకి అని అందట. ఇంగ్లిషు సాహిత్యంలో షేక్ స్పియర్ తో సమానమైన ప్రజ్ఞ ఆమెది అని హెరాల్డ్ బ్లూమ్ లాంటి వాడు అన్నాడంటే ఆశ్చర్యం లేదు.
ఈరోజు ఇంత ఉపోద్ఘాతం ఎందుకు రాసానంటే, ఈ రెండు రోజులుగా మార్గరెట్ ఫుల్లర్ ని చదువుతూ ఉన్నాను. ఆమె ఎమర్సన్ కి రాసిన ఉత్తరాలతో పాటు, ఆమె గురించి మారియా పొపోవా తన Figuring (2019) లో రాసిన అత్యంత ఆసక్తికరమైన జీవితకథనం కూడా.
మార్గరెట్ ఫుల్లర్ ( 1810-1850) పంతొమ్మిదో శతాబ్ది అమెరికన్ మేధావుల్లో, భావుకుల్లో, సామాజిక కార్యకర్తల్లో, ఫెమినిస్టు ఉద్యమకారుల్లో మొదటివరసకు చెందిన వ్యక్తి. ఎమర్సన్ కి ఒక విధంగా శిష్యురాలు, ఒక విధంగా మిత్రురాలు, ఆ ఋషి చిత్తాన్ని కూడా కొన్నాళ్ళు విద్యున్మయం చేసిన ప్రేమికురాలు కూడా. అమెరికాలో తొలి మహిళాసంపాదకురాలు, గనుల్లో, జైళ్ళల్లో, ఆసుపత్రుల్లో మగ్గుతున్న జీవితాల్ని ప్రత్యక్షంగా చూసి వాళ్ళకి గౌరవప్రదమైన జీవితం కోసం తన సమకాలిక ప్రపంచంతో పోరాడిన వ్యక్తి.
మార్గరెట్ ఫుల్లర్ గురించి నీకు రెండు మూడు వాక్యాల్లో పూర్తి పరిచయం చెయ్యాలంటే ఏమని చెప్పొచ్చు అని ఆలోచించాను. గాంధీగారు తనని గాఢంగా ప్రభావితం చేసిన ముగ్గురు రచయితల్లో టాల్ స్టాయి, రస్కిన్ ల తో పాటు థోరోని కూడా పేర్కొంటారని నీకు తెలిసిందే కద! తన సత్యాగ్రహానికి థోరో నుంచి స్ఫూర్తిపొందానని ఆయన పదే పదే చెప్తూ వచ్చారు కదా. అటువంటి థోరోని గుర్తుపట్టి, ఆయన్ని ఒక రచయితగా తీర్చిదిద్దింది మార్గరెట్ ఫుల్లర్. ఎడ్గార్ అలన్ పో ఆధునిక కథకి ఆద్యుడని మనకు తెలుసు. ఆయన కవిత్వప్రభావంతోటే, మాడర్నిజం అనే సాహిత్యోద్యమం వచ్చిందని కూడా నీకు తెలుసు. అటువంటి పో ఆమె గురించి రాస్తో అంత ప్రకాశవంతమైన శైలిని మరెక్కడా చూడలేదని రాసాడు. హీరోల గురించీ, హీరో వర్షిప్ గురించీ ప్రపంచ ప్రసిద్ధగ్రంథం రాసిన థామస్ కార్లైల్ ఆమెది true-heroic mind అన్నాడు.
ఎటువంటి జీవితం ఆమెది! మొన్న ఎమర్సన్ గురించి రాస్తో 1837 లో ఆయన వెలువరించిన ఒక ఉపన్యాసాన్ని American Declaration of Intellectual Independence గా అమెరికా గుర్తుపెట్టుకుందని చెప్పాను కదా. American Scholar అనే ఆ ప్రసంగం అది. నెట్ లో ఉంది. చదువు. అమెరికాకి ఎటువంటి మేధావులు అవసరమని ఎమర్సన్ అందులో చెప్పాడో, ఆ ప్రతి ఒక్క వాక్యానికీ ఫుల్లర్ ఒక ఉదాహరణగా జీవించింది. ముఖ్యంగా, transmuting life into truth. అంటే జీవితం సత్యంగా పరివర్తన చెందడం. To transmute అంటే కేవలం మారడం కాదు. అది మట్టి బంగారంగా మారడం. To transmute అనేది ఒక intransitive verb. అంటే ఆ మార్పు ఎవరో బయటినుంచి తెచ్చేదికాదు, తనలోంచి జరగవలసింది. మార్గరెట్ ఫుల్లర్ జీవితం గురించి పొపోవా రాసింది చదువుతూ ఉంటే, జీవితం సత్యంగా మారడమంటే ఏమిటో సోదాహరణంగా చెప్తున్నట్టు ఉంది.
బంగారు తల్లీ, ఈ ఉత్తరాన్ని కూడా వ్యాసంగా మార్చానని అనుకోకు. ఎవరి జీవితమైనా ట్రూత్ గా పరివర్తన చెందినప్పుడు, ఆ ట్రూత్ ఆ జీవితం దగ్గరే ఆగిపోదు. అది రాసినవాళ్లనీ, చదివినవాళ్లనీ అందర్నీ ఆ సత్యప్రవాహంలోకి లాక్కుంటుంది. నన్ను లోలోపల నిలువెల్లా కదిలిస్తున్న ఆ సత్యాన్ని నీతోకాక మరెవరితో పంచుకుంటాను చెప్పు?
ఇంతకీ నీది ఏ తరం? వయసురీత్యా? మనసు రీత్యా? వయసులో నా తర్వాతి తరమూ, మనసులో నా తరం మనిషివా లేక వయసులో నా తరం, మనసులో నా తర్వాతి తరానివీనా?
29-10-2023
పోస్టుమాన్ వచ్చి ఉత్తరం ఇచ్చే రోజులైతే ఈ తలుపులు తెల్లవారుఝామున తీసే ఉంచే దాన్నేమో…బ్లాగ్ కనుక రిఫ్రెష్ బటన్ ఒక్కటే సరిపోయింది.
నిన్నటి ఉత్తరం మళ్లీ చాలా సార్లు చదువుకున్నాను, ఆమె కవిత్వం మళ్లీ మళ్లీ గమనించి ఆ భావాల్లోని సౌకుమార్యానికి దాసోహమయ్యాను. ఎట్లాంటి వాక్యాలను పట్టి తెచ్చారు! పటం కట్టి దాచుకోవాలి వాటిని.
మీరు మీ గురువుల దగ్గర ఎలా కూర్చుని విని ఉంటారో, బహుశా ఈ రోజు ఉత్తరం ముందు నేను అలా కూర్చుని ఉన్నాను…ఆ సత్య ప్రవాహపు తడి నన్ను తాకినట్టుగా ఉంది. మీరేమో ఆ వడిలో కొట్టుకుపోతున్న వారు.
ఈ రోజు సంభాషణ ఇప్పుడే మొదలైంది. ఇది రేపటి ఉత్తరం దాకా సాగుతూనే ఉంటుంది…❤️
ధన్యవాదాలు మానసా
To masters (you included sir) 🙏🏽🙏🏽🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
నిజం. ఏ తరమైనా ముందు తరానికి వారధిగా నిలుస్తుంది. కానీ చైతన్యవంతమైన అవగాహనతో ఆ పని చేసే బృందం ఉన్నపుడు అదెంతో బావుంటుంది. నేనూ మీరు చూసినట్టే వెనకటి తరాల్ని చూస్తుంటాను. మీరు స్వయంగా ఒక వారధిగా ఉన్నారు. అందమైన, సుగంధభరితమైన పారిజాత ప్రసూనాల్ని తీసుకొచ్చి అందుకునేవారికి ఆనందంగా ఇస్తున్నారు.
ధన్యవాదాలు మేడం
చదివే వాళ్లని అందర్నీ ఆ సత్యప్రవాహంలోకి లాక్కుంటుంది/టారు
ధన్యవాదాలు సార్
సహృదయుని ప్రేమానుభూతి ప్రత్యక్షరమ్ లోనూ…
ప్రాచీనులలో ప్రాచీనులు మీరు
ఆధునికులలో అత్యాధునికులు
ఎన్నో తరాలకు ముందూ వెనక
వారధిగా సారథి గా యెద నిండుగా..
..
ధన్యవాదాలు మాష్టారూ
మీరు పరిచయం చేసిన సెనెకా ఉత్తరాలు గుర్తిస్తున్నాయి.చిన్న తనంలో తెలిసీతెలియని వయసులో పానుగంటి సాక్షి వ్యాసాలు స్పృహను తట్టాయి. ఒక తరం నుండి మరొక తరం వెనక్కు నడుస్తూ ఎందరిని మరచిపోతున్నామో గుర్తు చేసినట్లంది.కాంతారావు సమ్మితం మిత్ర సమ్మితం కలగలసిన ఉత్తర సాక్షాత్కారం.🙏
ధన్యవాదాలు సార్