పోస్టు చేసిన ఉత్తరాలు-6

27-10-2023, పొద్దున్న 7.15

ప్రియమైన

ఎమిలీ డికిన్ సన్ ఉత్తరాలు చదవడం పూర్తయ్యింది. అంటే 1858 తర్వాత రాసిన ఉత్తరాలు. ఆమె కవిత్వం మరేదీ మనకి లభ్యం కాకపోయినా ఈ ఉత్తరాలూ, వీటితో ఆమె పంపించిన ఆ చిన్నిచిన్ని పూలూ, ఆ కవితలూ మాత్రమే మనకి దొరికి ఉన్నా కూడా ఒక పరిపూర్ణమానుషిని చూసిన భావన మనకు కలుగుతుంది. ఈ ఉత్తరాలు, మరీ ముఖ్యంగా, చివరి ఏళ్ళల్లో రాసిన అతితక్కువ ఉత్తరాలు, ఆ ఉత్తరాల్లో చేర్చిపెట్టిన కవిత్వపు తునకలు- వాటిని చూసినా ఆమె ఒక సెయింట్ అనీ, ఒక చిన్నారి బాలిక అనీ ఏకకాలంలో తోచకుండా ఉండదు.

ఆ ఉత్తరాలనిండా, ఆమె జీవితం పొడుగునా మృత్యువు. తన వాళ్ళనుకున్నవారు ఒక్కొక్కరే ఆమె కళ్లముందు నిష్క్రమిస్తూ ఉండటాన్ని ఆ గుండె ఎట్లా తట్టుకుందో అనిపిస్తుంది. అమ్హరెస్ట్ లో ఆమె తండ్రి తన ఇంటిముంగటి స్థలం కూడా కొన్నాక, ఆ కుటుంబం ఆ ప్రాంగణంలో ముందువేపుకి మారాక, అక్కడికి ఎదురుగా కొద్ది దూరంలో స్మశానం కనిపిస్తూ ఉండేదట. ఆ funeral processions దాదాపుగా ఆమె కిటికీ పక్కనుంచే పోయేవట. ఆమె మృత్యువుకి దగ్గరగా కాదు, మృత్యువు నీడలోనే ఎక్కువకాలం జీవించిదని చెప్పాలి.

మొదట తండ్రి. ఆయన లాయరు, రాజకీయనాయకుడు, ధార్మికుడు. తన కూతుళ్ళిద్దరికీ బైబిలు తప్ప మరో ప్రపంచం లేకుండా చేసాడు. ఎమిలీకి ఎపిలెప్సీ ఉండేదట. అందుకని ఆమెని ఎక్కడికీ పంపించేవాడు కాదు. ఎక్కడికన్నా వెళ్తే తను పక్కనుండాలి. అలాగని ఆమెతో పెద్దగా మాట్లాడేవాడు కూడా కాదు. ఒకరోజు మధ్యాహ్నం ఆమెను తన దగ్గరకు పిలిచి కూచోబెట్టుకున్నాడు. సాయంకాలందాకా. ఆ మర్నాడు బోస్టన్ వెళ్ళినవాడు, అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తల్లికి 1875 లో పక్షవాతానికి గురయ్యింది. అప్పణ్ణుంచీ ఏడేళ్ళ తరువాత ఆమె మరణించేదాకా ఇరవైనాలుగ్గంటలూ ఎమిలీ ఆమెని కనిపెట్టుకునే ఉండేది. తమ కుటుంబానికి దగ్గరగా వచ్చిన సామ్యూల్ బౌల్స్, తన చివరిదినాల్లో తన హృదయంలో అడుగుపెట్టిన జడ్జి ఓటిస్, తన జీవితకాలంలో తనని ఒక శక్తిమంతురాలైన కవిగా గుర్తించిన ఏకైక రచయిత, కవి, ఫెమినిస్టు, హెలెన్ హంట్ జాక్సన్- వీళ్ళంతా, కొంతమందీ చెప్పీ, కొంతమంది చెప్పకుండా తననుంచి వెళ్ళిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఇవి కాక, మరికొందరు స్నేహితుల, దగ్గరి బంధువుల మరణాలు కూడా ఆ ఉత్తరాల్లో నమోదయ్యాయి. కానీ ఈ మరణాలన్నిటిలోనూ ఆమె తట్టుకోలేని ఆఘాతం, తన అన్న కొడుకు, చిన్నపిల్లవాడు, గిల్బర్ట్ ఎనిమిదేళ్ళ వయసులో టైఫాయిడ్ తో మరణించడం.

హిగిన్ సన్ మొదటిసారి ఆమెని కలిసినప్పుడు ‘I find ecstasy in living- the mere sense of living is joy enough’ అని అన్నదని రాసుకున్నాడు.

జీవితం పట్ల ఆమెకి గౌరవం, ప్రేమ, ఆశ నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గలేదు. 1873 లో రాసిన ఒక ఉత్తరంలో ‘Life is a spell so exquisite that everything conspires to break it’ అని రాసింది. మృత్యువు రెక్కల ధూళి విదిలిస్తున్నకొద్దీ, ఆమె జీవితాన్ని మరింత ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది. 1870 లో రాసిన ఒక ఉత్తరంలో ‘Life is the finest secret. So long as that remains, we must all whisper. With that sublime exception, I had no clandestineness’ అని రాసింది.

జీవితం సమక్షంలో మనిషి చెయ్యగలిగింది గుసగుసలాడుకోవడమే. అందుకనే ఆ కవిత్వం ఎక్కడా loud గా ఉండదు. మరీ ముఖ్యంగా మృత్యువు పదే పదే తలుపు తడుతున్నప్పుడు, మరీ ఎక్కువమాటల్తో కూడా పనిలేదు. తన తండ్రి మరణించినప్పుడు, హిగిన్ సన్ ఉత్తరం రాస్తో I am sorry’ అని అన్నాడట. ఏళ్ళ తరువాత, ఆమె ఒక ఉత్తరంలో ఇలా రాస్తున్నది:

‘One who only said, ‘I am sorry’ helped me the most when father ceased-it was too soon for language.

Fearing to tell mother, someone disclosed it unknown to us. She only replied ‘I loved him so.’

Had he a tenderer eulogy?’

జీవితం ఎదటా, మృత్యువు ఎదటా కూడా మాటలు ఎంత వెనకబడతాయో ఇంతకన్నా గొప్పగా చెప్పినవాళ్ళు లేరు. ..it was too soon for language. ఎంత సత్యం! జీవితం నిన్ను బలంగా తాకినప్పుడు, నువ్వు బిత్తరపోయినప్పుడు, మాటలకోసం వెతుక్కుంటున్నప్పుడు, ఆ అవస్థ తెలిసినవాడికి, ఒక్క మాట చాలు, ఓదార్చడానికిగానీ లేదా ఓదార్పు పొందడానికిగానీ.

ఎమిలీ కవిత్వంలో ఆ క్లుప్తత ఎందుకంటే ఆమె జీవితపు గాఢతని అంతగా తనలోకి తీసుకోగలిగింది కాబట్టి. జీవితానుభవాల ఎదట ధారాళమైన వక్తృత్వంతో మాట్లాడగలిగేవాళ్ళు ఉండరని కాదు, వాళ్ళల్లో కనీసం కొంతమందేనా నిజాయితీ పరులు లేరనీ కాదు. కానీ, ఇదుగో, ఇలాంటితావుల్లోనే ఎమిలీలోని బాలికని మరీ దగ్గరగా పోల్చుకోగలుగుతున్నాను.

1882 లో తన తల్లి తమని వదిలివెళ్ళిపోయినప్పుడు హాలాండ్ సతికి రాసిన ఉత్తరంలో మొదటివాక్యమే ఇలా రాస్తోంది:

‘The dear mother that could not walk, has flown.’

ఆ వెంటనే మళ్లా ఇలా అంటున్నది:

‘It never occurred to us that though se had not Limbs, she had wings-‘

ఆ ఉత్తరం ముగిస్తో, తాను ఉత్తరం రాస్తున్న శ్రీమతిహోలాండ్ పిల్లల్ని అడిగానని చెప్తో, ఇలా అంటున్నది:

‘Remember me to your Annie and Kate. Tell them I envy their Mother. ‘Mother’! What a Name!’

ఈ వాక్యాల్ని వివరించి ఆమె హృదయాన్ని పలచన చెయ్యను.

కాని అన్నిటికన్నా సంచలితం ఆమె తన అన్న కొడుకు మరణించినప్పుడు, అతడి తల్లికి, అంటే, తన ప్రాణమిత్రురాలు సుసాన్ కి రాసిన ఉత్తరం. 1883 అక్టోబరులో రాసిన ఆ ఉత్తరంలో మృత్యువూ, జీవితం విడదియ్యలేనంతగా కలిసిపోయాయి. ఉత్తరం మొదలుపెడుతూనే ఇలా అంటున్నది:

‘The Vision of Immortal Life has been fulfilled-‘

సాధారణంగా ఎమిలీ డికిన్ సన్ అనగానే, తనకు తాను విధించుకున్న నిష్ఠుర ఏకాంతంలో, తెల్లని దుస్తులు ధరించి, ఎవరినీ కలవకుండా, ఎవరితోటీ మాటాడకుండా, తనలోతాను గడిపే ఒక సన్న్యాసిని గుర్తొస్తుంది. ఆమె జీవితకాలంలోనే చాలమంది ఆమెని ఒక myth అని అన్నారు.

కాని అది సత్యం కాదనీ, ఆమె చాలా ఉల్లాసవంతురాలనీ, మొక్కలతోటీ, పూలతోటీ, తుమ్మెదలతోటీ, సీతాకోకచిలుకలతోటీ జీవితాన్ని సంపద్వంతం చేసుకుందనీ మార్తా మెక్ డొవెల్ అనే పరిశోధకు రాలు రాసింది. Emily Dickinson’s Gardening Life (2019) అనే మరీ ఇటీవలి పుస్తకంలో ఆమె తోటగురించీ, ఆ తోటలో ఏడాది పొడుగునా వచ్చిపోయే ఋతువుల్ని ఆమె ఎట్లా స్వాగతించేదో, వీడ్కోలు చెప్పేదో చాలా వివరంగా రాసింది.

కానీ ఇప్పుడు ఈ ఉత్తరాలు చదివేక నాకు ఈ రెండూ కూడా నిజమే అనిపిస్తున్నాయి. అంటే ఆమెలో ఒక సన్న్యాసిని ఉండటం ఎంత నిజమో ఒక ఉల్లాసిని ఉండటం కూడా అంతే నిజం. కాని తన మేనల్లుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా ఆమె ఆ రెండు ప్రపంచాల్నీ విడివిడిగా ఉంచగలిగింది. తన మిత్రుల్నీ, పరిచయస్థుల్నీ, ప్రేమికుల్నీ కూడా ఎంత దగ్గరగా తీసుకోగలిగిందో, అంతే దూరంగా అట్టేపెట్టగలిగింది. కాని ఆ చిన్నపిల్లవాడు మొదటిసారిగా, ఆ హద్దుల్ని చెరిపేసాడు. ఇప్పుడు ఆమెకి జీవితం, మృత్యువు వేరువేరు కాదు. ఈ వాక్యాలు చూడు:

‘I see him in the Star, and meet his sweet velocity in everything that flies-His Life was like the Bugle, which winds itself away, his Elegy an echo-his Requiem ecstasy-

Dawn and Meridian one.’

మామూలుగానే ఆమె ఇంగ్లిషుని తెలుగు చెయ్యడం కష్టం. గుండెని ముక్కలు చేసి కుక్కిన ఆ పేరాగ్రాఫుని తెలుగు చెయ్యడం దుస్సాధ్యం. అయినా నీ కోసం తెలుగుచేస్తున్నాను. చూడు:

‘వాడు నా కళ్ళకి ఒక నక్షత్రమైపోయి కనిపిస్తున్నాడు. ఎగురిపోతున్న ప్రతి ఒక్కదానిలోనూ ఆ వేగమాధుర్యాన్ని అనుభూతి చెందుతున్నాను. వాడి జీవితం ఒక తుత్తారసంగీతం లాంటిది. అది వినిపించినంతమేరా వినిపించి నెమ్మదిగా తనలోకి తనే ముడుచుకుపోతుంది. నా శోకం ఆ సంగీతానికి ఒక ప్రతిధ్వని మాత్రమే. వాడికి శ్రద్ధాంజలి ఘటించడమంటే ఒక సాంద్రసంతోషాన్ని చేరుకోగలడమే. ఉదయమధ్యాహ్నాలు ఏకమైపోయిన తావు అది.’

ఒక మృత్యువు, అందులోనూ ఒక చిన్నపిల్లవాడి అకాలమృత్యువు ఆమెలో కలిగించిన ఈ సంచలనం మామూలు భాషతో మనం అర్థం చేసుకోగలిగేది కాదు. 1842 నుంచి ఆమె రాస్తూ వచ్చిన ఉత్తరాలకి 1883 లో రాసిన ఈ ఉత్తరం పతాక అని చెప్పవచ్చు. కవిగా, మనిషిగా ఆమె తన హృదయం కూలిపోగలిగిన అత్యంత అగాధాన్ని చూసింది, తన హృదయం అందుకోగలిగిన అత్యంత శిఖరానికి చేరుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి గానీ ఆమెకి తన దుఃఖాన్ని మామూలు మనుషుల్లాగా చెప్పుకోగల మాటలు రాలేదు. అప్పుడు కూడా పూర్తిగా మాటలు వచ్చాయని చెప్పలేం. చూడు:

‘Open the Door, open the Door they are waiting for me’ was Gilbert’s sweet command in delirium. Who were waiting for him, all we possess we would give to know- Anguish at last opened it, and he ran to the little Grave at his grandparent’s feet- All this and more, though is there more?More than Love and Death? Then tell me it’s name!’

ఆమె హృదయం పాతాళాన్ని చూసిందని చెప్పవచ్చు. కానీ దాన్ని వివరించడానికీ ఆమెకి మాటలు చాలలేదు. అందుకనే 1884 లో రాసిన ఒక ఉత్తరంలో అంటున్నది:

‘Abyss has no Biographer-‘

ఒక మనిషికి జన్మమృత్యువుల విలువ తెలియాలంటే ఎంతమంది మనుషులు పరిచయం కావాలి? ఎంతమంది కనుమరుగు కావాలి? నీకు నిజంగా ప్రాణం విలువ తెలిస్తే, కృష్ణమూర్తి జీవితంలో సంభవించినట్టుగా, ఒక్క మృత్యువు చాలు, నిన్ను అంతర్ముఖం చెయ్యడానికి. తాను ఒక స్త్రీగా ప్రేమించిన, ప్రేమించినట్టుగా నలుగురికీ చెప్పుకోగలిగిన లార్డ్ ఓటిస్ మరణించినప్పుడు శ్రీమతి హాలాండ్ కి రాసిన ఉత్తరంలో ఎమిలీ ఇలా అంటోంది:

‘Forgive me the Tears that fell for few, but that few too many, for was not each a world?’

ఆ ఏడాదే, అంటే, 1884 లో నార్క్రాస్ సోదరీమణులకి రాసిన ఉత్తరంలో మరొక మాట కూడా రాసింది.

‘Till the first friend dies, we think ecstasy impersonal, but then discover that he was the cup from which we drank it, itself as yet unknown.’

యాభై అయిదేళ్ళు అలా జన్మమృత్యువుల్ని అంత దగ్గరగా చూసాక, దాదాపు రెండువేల కవితలు తనకోసం తాను రాసుకున్నాక, కవిత్వాన్ని ప్రచురించడమంటే, మనసుని వేలంపాటకి పెట్టుకోవడంలాంటిదే అనుకుని చివరికి తన చెల్లెలికి కూడా చెప్పకుండా తన కవితలు దాచుకున్నాక, ఈ లోకం నుంచి సెలవుతీసుకుంది ఆమె. కాని జీవితం, మృత్యువూ రెండూ కలిసి ఆమెకి ఏమిచ్చాయి? తాను మరణించినప్పుడు తన సమాధిమీద తనకిష్టమైన పూలమొక్కలు పెరిగితే చాలనుకునే మనఃస్థితినిచ్చాయి. 1884 జూన్ లో శ్రీమతి హాలాండ్ కి రాసిన ఉత్తరంలో ఇలా రాసింది:

‘When it shall come my turn, I want a Buttercup- Doubtless the Grass will give me one, for does she not revere the Whims of her flitting Children?’

బటర్ కప్స్ అంటే పచ్చటి పూలు. ఆ పూలమొక్కలు ఎవరూ నాటనక్కరలేదట. గడ్డి తన చిలిపిపిల్లలకి తనే సంతోషంగా ఇస్తుందట.

ఆ ఉత్తరం రాసి ఏడాది తిరక్కుండానే ఆమె ఈ లోకం నుంచి సెలవుతీసుకుంది.

క్షమించు, ఈ ఉత్తరమంతా ఇలా బరువెక్కినందుకు. కానీ ఇప్పుడే నాకు మాటల విలువ తెలుస్తున్నది. ఇటువంటి మనిషి హృదయాన్ని ఇంత దగ్గరగా చూస్తున్నాక ప్రేమ ముందు వినయంతో తప్ప మరోలాగ నిలబడకూడదనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లవాడిలాగా ఉంది నా పరిస్థితి.

27-10-2023

16 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు-6”

 1. “ఇటువంటి మనిషి హృదయాన్ని ఇంత దగ్గరగా చూస్తున్నాక ప్రేమ ముందు వినయంతో తప్ప మరోలాగ నిలబడకూడదనిపిస్తోంది“

  Emily ki, ఆమెను దగ్గరగా పరిచయం చేసినందుకు మీకు వేలవేల 🙏🏽🙏🏽🙏🏽

  Beautiful letter Sir!! Thank you.

 2. ఎమిలీ డికింసన్ హృదయం మీరు మా ముందు పరిచాక..
  అవును..
  “ఇప్పుడెప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లవాడిలా ఉంది నా పరిస్థితి”
  ధన్యవాదాలు సర్..

 3. అంతర్జాలం లో ఎమిలీ డికిన్ సన్ కవితలూ, వాటి పై కొన్ని తాత్విక వ్యాఖ్యలూ పరిచయమే.. కాని, మీరు రాసిన ఈ లేఖలు చదివాకే ఎమిలీ డికిన్ సన్ మరింత బాగా అర్థమయింది. ధన్యవాదాలండీ 🙏

 4. గంభీరమైన విషాదాన్ని నింపుకున్న అక్షరాలలో ఇంత ఆర్ద్రత ఉంటుందా? ఆశ్చర్యంగా ఉంది సార్!!

 5. ఒక శోకం చూసిన ఋషి
  మనసు శ్లోకపూరితమైంది
  ఆ వేదన ఆవేదనాపూర్వక
  గానకోశమైంది
  పికగళంలో పలికే పంచమ స్వరం
  సరసమైనదో విరసమైనదో తెలియదు
  శ్రోత దుఃఖితుడైతే ఊరడిస్తుందది
  సంతోషభరితుడైతే చేరదీస్తుంది

  గుండెగాయం గేయమైతే
  శ్రోతగుండెను కోయదా
  హృదయగానం మోదమైతే
  మనిషిమనసున పూయదా

  ఎమిలీ డికిన్సన్ వ్యథాభరిత జీవితం
  ఉత్తర చరితమైంది. కవిత ఉదాత్తమైంది.
  ఇదో పుత్తడి ఉత్తరాల లోకం
  ప్రణామ్యహం.

Leave a Reply

%d